#గమ్యం: ఈ 10 అంశాలు పాటించండి! పరీక్షల ఒత్తిడిని జయించండి!!
- అనిల్ కుమార్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం. విద్యార్థులందరికీ వార్షిక పరీక్షలు పూర్తయ్యాయి. అందువల్ల కొద్దిగా రిలాక్స్ అవుదామనుకుంటున్నారేమో! వద్దు.. వద్దు.
చదువు, ప్రిపరేషన్లో ఇదే తీవ్రతను మరికొద్దిరోజుల పాటు కొనసాగించండి. ఎందుకంటే ఇప్పుడున్నదంతా పోటీపరీక్షల కాలమే. ఈ కొద్ది రోజులూ కష్టపడితే ఆ తర్వాత సెలవులన్నీ హ్యాపీగా గడిపేయొచ్చు.
ఈ తక్కువ సమయంలోనే ఒత్తిడిలేకుండా పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో వివరిస్తున్నారు Careers360.com డైరెక్టర్ రామలక్ష్మి పేరి. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.
#గమ్యం: పరీక్షల ఒత్తిడిని జయించడం ఎలా?
1) ఎన్ని పుస్తకాలు చదవాలో!
జేఈఈ మెయిన్స్ పరీక్ష పూర్తిగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఉన్న అంశాల ఆధారంగానే జరుగుతుంది. అందువల్ల ఈ పుస్తకాలను కూలంకషంగా చదివితే ఈ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. స్టేట్ బోర్డుల్లో చదివిన విద్యార్థులకైనా సరే.. సిలబస్‌లో కొద్దిగా మార్పులుండవచ్చేమోగానీ, సబ్జెక్టులో అయితే మార్పులుండవు కదా. కాబట్టి మీ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్న అంశాలను నిర్లక్ష్యం చేయకుండా చదువుకోవడం చాలా ముఖ్యమైన అంశం.
ఫొటో సోర్స్, Getty Images
2) సమయం ఎక్కువ లేదు!
ఇంత తక్కువ సమయంలో సిలబస్ ఎలా కవర్ చేస్తాం అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ పరీక్ష మొత్తం 11th, 12th తరగతుల్లోని అంశాల ఆధారంగానే ఉంటుంది. ఇప్పుడే పరీక్షలు రాసి ఉన్నారు కాబట్టి మీరు 70శాతం సిలబస్ పూర్తిచేసి, పరీక్షకు సిద్ధమైపోయినట్లే భావించవచ్చు.
అంశాలవారీగా నోట్స్ తయారుచేసుకుని, దాన్ని పదేపదే చదువుకుంటూ ఉండండి. ఉన్న ఈ కొద్ది సమయంలో గణిత శాస్త్రంలో ముఖ్యమైన అంశాలు, రసాయన శాస్త్రంలో ముఖ్యమైన అంశాలు, భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన అంశాలు మీద దృష్టి సారించండి. ఎందుకంటే వీటినుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
3) బలాలు - బలహీనతలు
అందరికీ అన్నీ రావు. అలా అని రానివాటిపైనే దృష్టి పెట్టి బాగా తెలిసిన అంశాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఎప్పుడూ చూడని, చదవని అంశాలజోలికి ఈ సమయంలో వెళ్లకపోవడమే మంచిది. మీకు ఇప్పటివరకూ చదివినవన్నీ రివిజన్ చేసుకోండి.
4) ఓఎంఆర్ ప్రాక్టీస్
ఆఫ్‌లైన్‌లో పరీక్ష రాయాలనుకునేవాళ్లు ఓఎంఆర్ షీట్‌ను నింపడాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైనా ఒక్క ప్రశ్నకు సమాధానం నింపబోయి మరో నంబరు ప్రశ్నకు దిద్దారంటే మొత్తం అన్నీ తప్పు అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రశ్న నెంబరు, సమాధానం నెంబరూ సరిచూసుకుంటూ, సమయాన్ని దృష్టిలో ఉంచుకుంటూ జాగ్రత్తగా నింపడాన్ని ప్రాక్టీస్ చేయండి.
ఫొటో సోర్స్, Getty Images
5) ఏదైనా ప్రశ్న అర్థం కాకపోతే?
ఏదైనా తెలియని ప్రశ్న ఉంటే దాన్ని అప్పటికి వదిలేసి తర్వాత ప్రశ్నకు వెళ్లిపోండి. ఇలాంటి ప్రశ్నలన్నీ చివర్లో మరోసారి చూడవచ్చు.అలా కాకుండా దాన్నే పట్టుకుని కూర్చుంటే సమయం వృధా అవుతుంది.
6) కట్ ఆఫ్ మార్కులు
జేఈఈ మెయిన్స్ కట్ ఆఫ్ 81 మార్కులు. దీనర్థం 81మార్కులొస్తే మంచి సంస్థలో సీటొస్తుందని కాదు. కేవలం అడ్వాన్సుడ్‌కు అర్హత సాధించడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ మంచి సంస్థలో సీటు కావాలనుకుంటే మీరు 250 మార్కుల లక్ష్యంగా పెట్టుకుని సిద్ధం కండి. పాత పేపర్లు, మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయండి.
ఫొటో సోర్స్, Getty Images
7) సోషల్ మీడియా
మీ భవిష్యత్ మంచిగా ఉండాలి అనుకుంటే ఈ పోటీపరీక్షలన్నీ పూర్తయ్యేవరకూ సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించండి. వీలైతే పూర్తిగా దూరంగా ఉండండి. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌తో మనకు తెలియకుండానే ఎంతో సమయం గడిచిపోతుంది. ఇప్పుడు అలాంటి తప్పు చేయవద్దు.
8) ఆరోగ్యం జాగ్రత్త
కాసేపు వ్యాయామం చేయండి. ఆడుకోండి. బయటి ఆహారం తినొద్దు. మంచినీళ్లు బాగా తాగండి. ఆరోగ్యం తర్వాతే చదువు.
ఫొటో సోర్స్, Getty Images
9) మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు
ఎవరి బలాలు, బలహీనతలు వారికుంటాయి. మీ స్నేహితులకు బాగా వచ్చిన అంశాలు మీకు రావట్లేదని బాధవద్దు. మీ బలాలపై దృష్టి సారించండి. చివరి రెండు, మూడు రోజుల్లో కొత్త అంశాల జోలికి వెళ్లొద్దు. అప్పటి వరకూ చదివినవాటినే మళ్లీ ఓసారి రివైజ్ చేసుకోండి.
10) పరీక్ష కేంద్రం ఎక్కడ?
పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో ముందురోజే తెలుసుకుని, ఎలా వెళ్లాలో ఆలోచించుకుంటే మంచిది. చివరి నిమిషంలో గందరగోళం వద్దు. నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లను కూడా దృష్టిలో ఉంచుకోండి. మీతోపాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లేమీ తీసుకెళ్లొద్దు. నిర్దేశించిన డ్రెస్ కోడ్‌ను పాటించండి. అడ్మిట్ కార్డు/హాల్ టికెట్ తీసుకెళ్తే సరిపోతుంది. పెన్ను కూడా వాళ్లే ఇస్తారు.
ఏప్రిల్ 24న జేఈఈ మెయిన్స్ కీ విడుదల చేస్తారు. దాని ప్రకారం మీకెన్ని మార్కులు రావచ్చనేది అంచనా వేసుకోండి.
ఏప్రిల్ 30న ఫలితాలు వెలువడతాయి.
గుడ్ లక్.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)