#BBCShe: తెల్లటి మోడల్సే ఎందుకు? తమిళ యువతుల సూటి ప్రశ్న?

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి

నేను కోయంబత్తూర్ వీధుల్లో వెళ్తున్నపుడు రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు కనిపించాయి. అక్కడ చామన ఛాయలో ఉన్న మహిళలు వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుండగా పక్కనే హోర్డింగుల్లో, ప్రకటనల్లో తెల్లటి అమ్మాయిల ముఖాలు కనిపించాయి.

చామన ఛాయ సాధారణమైన తమిళనాడులో ఈ ప్రకటనలు మాత్రం దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దించినట్లు అనిపించింది.

ఈ గందరగోళం నాకొక్కరికే కాదు. #BBCShe ప్రాజెక్ట్‌లో భాగంగా అవినాశిలింగం విశ్వవిద్యాలయంలో మేం మాట్లాడిన మహిళల్లోనూ కనిపించింది. వారూ ఇదే అంశంపై గొంతెత్తారు.

''మనం ప్రకటనల్లో చూస్తున్నట్లుగా మహిళలు నిజ జీవితంలో ఉండరు. అలాగే ప్రతి మహిళా తెల్లగా, ఎర్రగా పొడవాటి జుట్టుతో, సన్నటి నడుముతో ఉన్న సమాజాన్నీ మనం ఆశించలేం'' అని ఓ యువతి చెప్పారు.

ఈ కామెంట్‌కి తోటి యువతుల నుంచి గట్టి మద్దతు లభించింది. అక్కడ 70 మంది మహిళలుండగా అందరూ ఈ కామెంట్‌ని ప్రశంసించారు. వీరిలో ఎక్కువ మంది చామన ఛాయలో ఉన్నవారే.

సన్నటి మహిళలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఓ ధోరణి ఉంది.

అయితే ఎక్కువ మంది చామన ఛాయలో ఉన్న ప్రాంతంలో మరో రంగు కలిగిన మోడల్స్ వారికి ఎలా పలు ఉత్పత్తులను అమ్మగలుగుతున్నారు?

ఇది కేవలం హోర్డింగ్‌లకే పరిమితం కాదు.

ఇక్కడ టీవీ ప్రకటనలు కూడా ఇంతే. బంగారు ఆభరణాల ప్రకటనల్లో తెల్లటి మోడల్స్ కనిపిస్తారు.

ఇక తమిళ సినీ పరిశ్రమ.. అదేనండీ, కోలీవుడ్‌లోనూ ఇదే ధోరణి ఉందని ఈ కళాశాల విద్యార్థినులు పేర్కొన్నారు.

గూగుల్లో తమిళ నటుల కోసం వెదికితే ఈ ముఖాలు కనిపించాయి.

ఇందులో ఆసక్తికరమైన అంశమేంటంటే.. ఇక్కడ కాజల్ అగర్వాల్, సిమ్రన్ పంజాబీలు.

తమన్నా, హన్సిక మహారాష్ట్రకు చెందినవారు. అనుష్క శెట్టి కర్ణాటక నుంచి వచ్చారు.

స్నేహ మాతృభాష తెలుగు. అసిన్‌ది కేరళ.

మొత్తం పది మందిలో కేవలం త్రిష, సమంత, శృతి హాసన్‌ - ఈ ముగ్గురే తమిళనాడుకు చెందినవారు.

చామన ఛాయ లేదా నల్లటి రంగున్న హీరోలు ధనుష్, విశాల్, విజయ్ సేతుపతి, విజయ్‌కాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్‌లు తెల్లటి రంగున్న హీరోయిన్‌లతో కలిసి నటించడాన్ని తమిళ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.

ఇక పలు సినిమాల్లో అయితే చామన రంగున్న హీరోలు తెల్లగా ఉండే హీరోయిన్లనే కోరుకోవడం సాధారణంగా కనిపిస్తుంది.

చాలా మంది ఈ చర్చను పనికిమాలినదిగా కొట్టిపారేయొచ్చు. ప్రకటనలు, సినిమాలు కల్పితాలని చెప్పవచ్చు.

అయితే ఈ కళాశాల విద్యార్థినులు 'తెల్లటి తోలు భ్రమలు' తమపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో వెల్లడించారు.

ఈ ధోరణి వల్ల కుటుంబం, పాఠశాల, టీచర్లు, తోటి విద్యార్థులు ఇలా పలు చోట్ల పలువురి నుంచి వివక్షను ఎదుర్కొనాల్సి వస్తోందని చెప్పారు.

ఒక్కోసారి ఇది ఆత్మస్థయిర్యాన్నీ దెబ్బతీస్తోందని తెలిపారు.

ఇక 2013లో షారుక్ ఖాన్ ఓ ప్రకటన కోసం 'ఫెయిర్ ఈజ్ లవ్లీ' అంటూ చేసిన ప్రకటనల వంటివి శరీర రంగు భ్రమలపై మరింత ప్రభావాన్ని చూపాయి.

అయితే ఇలాంటి ప్రకటనలకు బాలీవుడ్‌లోనూ వ్యతిరేకత మొదలైంది. డార్క్ ఈజ్ బ్యూటిఫుల్‌కు ప్రచార కర్త అయిన నందితా దాస్ వంటివారు తెల్లటి రంగే గొప్పదన్న దురభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

2017లో మిసెస్ ఇండియా ఎర్త్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన కోయంబత్తూరుకు చెందిన గాయత్రీ నటరాజన్ కూడా తాను చామన రంగు వల్ల చాలా వివక్షను ఎదుర్కొన్నాని తెలిపారు.

ప్రకటనకర్తలు తెల్లటి రంగున్న మహిళలనే ఎంచుకుంటారు. తెల్లటి మహిళలే ఫెయిర్‌నెస్ క్రీముల్లో మంచి ప్రభావం చూపగలుగుతారని నమ్ముతున్నారు. నిజమే మరి, ముఖ సంరక్షణ మార్కెట్లో ఫెయిర్‌నెస్ క్రీములే 50 శాతం మేర అమ్ముడవుతున్నాయి.

అందుకే మీడియా, అడ్వర్టైజింగ్ సంస్థలు ఇలాంటి కళాశాల విద్యార్థినుల మాటలనూ వినాలి. వాళ్లకు ఏం కావాలో తెలసుకోవాలి. అలాగే తమ ప్రకటనలు వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో గ్రహించాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)