#UnseenLives: ఊళ్లలో కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా?

  • రిపోర్టర్: బళ్ల స‌తీశ్; ప్రొడ్యూసర్&షూట్/ఎడిట్: సంగీతం ప్రభాకర్
  • బీబీసీ ప్రతినిధులు
వివక్ష.. రెండు గ్లాసులు

మీరెప్పుడైనా హోటల్లో టీ తాగి, మీ గ్లాస్ మీరే క‌డుక్కున్నారా? ఆశ్చ‌ర్య‌పోకండి! నిన్నా మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇలాంటివి మామూలే. దళితుల పట్ల అమలైన వివక్ష రూపాల్లో ఇదొకటి.

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ద‌ళితులు మిగిలిన కులాల వారిలా టీ స్టాల్ దగ్గ‌ర కూర్చుని అంద‌రితో స‌మానంగా టీ తాగే అవ‌కాశం ఉండేది కాదు. వారు ఓ ప‌క్క‌గా నిల్చుని, వాళ్ల కోసం విడిగా పెట్టిన గ్లాసుల్లోనే టీ తాగాలి.

వాళ్లు వాడే గ్లాసులు ‘పెద్ద కులాల’ గ్లాసుల‌తో క‌ల‌వ‌కూడ‌దు. వాటిని షాపు య‌జ‌మాని కూడా శుభ్రం చేయ‌డు. ద‌ళితులే తాము తాగిన గ్లాసులను క‌డిగి ప‌క్క‌న పెట్టాలి. దీన్నే 'రెండు గ్లాసుల ప‌ద్ధ‌తి'గా వ్యవహరిస్తుంటారు. గడచిన రెండు దశాబ్దాల్లో ఈ విధానం కొన్ని చోట్ల త‌గ్గినా, ఇప్ప‌టికీ కొన్ని ప‌ల్లెల్లో పాటిస్తూనే ఉన్నారు.

1955లో వచ్చిన అంటరానితనం(నేరాలు) చట్టం సహా ఎన్నో చ‌ట్టాలు, సంఘాలు, పోరాటాలు ఇలాంటి వివక్షలను పూర్తిగా మార్చ‌లేక‌పోయాయి. కానీ సాంకేతిక అభివృద్ధిలో భాగంగా వచ్చిన ‘డిస్పోజబుల్ గ్లాస్’ ఈ వివక్ష రూపం తగ్గటానికి కొంత సాయం చేసింది.

వీడియో క్యాప్షన్,

వీడియో: కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా?

మొత్తం వ్య‌వ‌స్థ మారిపోయిందని చెప్ప‌లేన‌ప్ప‌టికీ.. సాంకేతికత వల్ల వచ్చిన ఒక చిన్న సాధనం ఈ వివక్షారూపాన్ని మార్చింది. ఈ రెండు గ్లాసుల విధానంలోకి డిస్పోజ‌బుల్ చొచ్చుకు వ‌చ్చింది.

టీ అడిగితే 'నీదే కులం' అనే ప్ర‌శ్న‌కు బ‌దులు ప‌ది పైస‌ల కాగితం క‌ప్పు స‌మాధాన‌మైంది! దళితులకు ‘నువ్వు తాగిన గ్లాసు నువ్వే క‌డ‌గాల‌’న్న స్థితి నుంచి ఉప‌శ‌మ‌నం ఇచ్చింది ఈ క‌ప్పు.

ఇంకా రెండు గ్లాసుల విధానం పాటిస్తున్న పలు గ్రామాల్లో తాజా పరిస్థితిని తెలుసుకోవ‌టానికి ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించింది బీబీసీ బృందం.

విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి ప‌ట్ట‌ణానికి ద‌గ్గ‌ర్లో ఉన్న ఒక ప‌ల్లెలోని చిన్న హోటల్ య‌జ‌మానితో బీబీసీ బృందం మాట్లాడింది. ఆ ఊర్లో రెండు బీసీ కులాలు, ఒక ఎస్సీ కులం వారు నివసిస్తున్నారు.

ఆ షాపు ద‌గ్గ‌ర టీ కొన‌డానికి వెళ్లే ద‌ళితుల‌కు డిస్పోజ‌బుల్ క‌ప్పులో టీ అమ్ముతారు. మిగిలిన బీసీ కులాల వారికి గాజు గ్లాసులో టీ ఇస్తారు.

"మాకు వాళ్ల గ్లాసుల్లో ఇవ్వ‌రు. గ‌తంలో రెండు గ్లాసులు ఉండేవి. అయితే ఎవ‌రైనా చూస్తే ప‌ట్టుకుంటార‌నే భ‌యంతో ఇప్పుడు రెండు గ్లాసులు తీసేసి డిస్పోజ‌బుల్ పెట్టారు. మా ఊళ్లో అంద‌రం అన్న‌ద‌మ్ముల్లా క‌లిసుంటాం. గొడ‌వ‌లేమీ లేవు. కానీ వాళ్ల‌క‌దో సెంటిమెంటు" అని వివ‌రించారు ద‌ళిత కులానికి చెందిన వెంక‌య్య‌.

దాదాపు ఏడాది క్రితం వ‌ర‌కూ అక్క‌డ రెండు గ్లాసుల విధానం ఉండేది. అప్ప‌ట్లో ఒక బీసీ కులానికి చెందిన ఓ కుటుంబం టీ షాపు న‌డిపేది. ఆ కుటుంబం చెన్నై వ‌ల‌స వెళ్ల‌డంతో ఇప్పుడా టీ షాపు లేదు. కానీ ఆ ఊరిలో టీ కోసం షాపుకు వెళ్లే వారి సంఖ్య త‌క్కువ అని చెప్పారు, కిరాణా షాపులోనే టీ పాయింట్ ప్రారంభించిన ఒక హోటల్ య‌జమాని.

పరిస్థితి మారింది..

"ఒక‌టి, రెండేళ్ల క్రితం వ‌ర‌కూ ఆ ప‌ద్ధ‌తి ఉండేది. మేమే గ‌సిరాం (ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాం). వాళ్లు న‌న్ను త‌మ్ముడూ అని పిలుస్తారు. త‌మ్ముడూ ఇక‌పై అంటువంటిది ఏమీ ఉండ‌దులే. మ‌న‌కెందుకులే. మీరు గ్లాసులైనా తెచ్చుకోండి. లేక‌పోతే డిస్పోజ‌బుల్ గ్లాసుల్లో అయినా ఇచ్చేస్తాం. ఇక వేరుపాటు ఎందుకులే అన్నారు వాళ్లు. దాంతో మేమూ సైలెంట్ అయ్యాం.'' అన్నాడు రాజు.

'త‌మ్ముడూ అంటూ క‌ల‌సిమెలిసి ఉండేట‌ప్పుడు మిగతా కులాల వారికి ఇచ్చినట్టు స్టీలు లేదా గాజు గ్లాసుల్లో టీ ఇవ్వ‌డానికి ఇబ్బంది ఏంటి?' అనే ప్ర‌శ్న‌కు ''నేను స‌మాధానం చెప్ప‌లేను" అంటూ ఆయన స్పందించారు.

‘నెక్ట్స్ జెనరేషన్‌కి అలాంటిదేదీ ఉండదు...’

అయితే త‌మ ఊరిలో అటువంటి వివ‌క్ష ఏదీ లేద‌ని కొట్టి పారేశారు ఆ ఊర్లో ఉన్న బీసీ కులాల వారు.

"వాళ్లు మా ఇళ్ళ‌ల్లోకి వ‌స్తారు. క‌ల్చ‌ర్ మారింది. స‌మాన‌త్వం ఉండాల‌ని చెప్తున్నారు. ఒక‌ప్పుడు ద‌ళితుల‌ను ముట్టుకుంటే స్నానం చేసేవారు. వాళ్లు కూడా దూరంగానే ఉండేవారు. ఇప్పుడ‌ది లేదు. ఇప్ప‌డు త‌మ్ముడూ అన్నా అనుకుంటున్నాం. మా ద‌గ్గ‌ర రెండు గ్లాసులు లేవు. గుడిలోకి రానివ్వ‌క‌పోవ‌డమంటూ లేదు. శ్రీరామ‌న‌వ‌మికి భోజ‌నానికి పిలుస్తాం. వ‌చ్చి తినేసి వెళ్తారు" అని వివ‌రించారు ఓ అర‌వై ఏళ్ల బీసీ వ్య‌క్తి.

‘‘నెక్స్ట్ జ‌న‌రేష‌న్‌కి అలాంటిదేదీ ఉండ‌దు’’ అని మ‌ధ్య‌లో క‌ల‌గ‌జేసుకున్నాడు ఒక ఇంట‌ర్ చదివిన యువ‌కుడు.

అక్క‌డికి ద‌గ్గ‌ర్లో ఉన్న మ‌రో ఊళ్లో కూడా ఈ డిస్పోజ‌బుల్ సిస్టం న‌డుస్తోంది. అక్క‌డ హోటళ్లను నిర్వ‌హించేదంతా బీసీ కులాలకు చెందిన వారే.

"వాళ్ల‌కి డిస్పోజ‌ల్ ఇస్తాను. మిగిలిన వాళ్ల‌కు (బీసీల‌కు) మామూలు గ్లాస్, డిస్పోజ‌బుల్ రెండూ ఇస్తాను. దీనివ‌ల్ల ఏమీ అబ్జెక్ష‌న్ ఉండ‌దు. వాళ్ల‌కు టిఫిన్ పేప‌ర్ ప్లేట్లో పెడ‌తాను. ఎందుకంటే వాళ్లు తినేదాంట్లో మ‌నం తిన‌డం అనేది ఇది క‌దా.. ఇక్క‌డ పెద్ద‌గా అభ్యంత‌రం పెట్టే వాళ్లు లేరు. ఇక్క‌డ పెద్ద‌గా ఎవ‌రూ క్యాస్ట్ ఫీలింగ్ గొడ‌వ‌లు మాట్లాడ‌రు. ఎందుకంటే, కించప‌రిచి మాట్లాడితే వేరే గొడ‌వ‌లు వ‌స్తాయి. వాళ్లు (దళితులు) గొడ‌వ‌చేసి కేస్ పెడితే మ‌నం విడిపించుకోలేం" అని చెప్పుకొచ్చారు హోటల్ య‌జ‌మానురాలు.

దళితుల‌కు ఉన్న హ‌క్కుల‌పై కూడా అక్క‌డి మిగిలిన కులాల‌కు, దళితులకు అవగాహన ఉంది. టీ, భోజ‌నం దగ్గ‌ర స‌మ‌స్య కొనసాగుతున్నా, సర్దుకుపోవడం అనే భావన అన్ని వ‌ర్గాల్లో బ‌లంగా ఉంది. అందుకే అక్క‌డ ఎవ‌రిని కులం గురించి అడిగినా ముందుగా చెప్పే స‌మాధానం ఒక త‌ల్లీ పిల్ల‌ల్లా క‌లిసున్నామ‌ని!

‘పేపర్ గ్లాస్ వచ్చాక కల్చర్‌లో మార్పు వచ్చింది...’

అక్క‌డ‌కు ద‌గ్గ‌ర్లోని మ‌రో పెద్ద గ్రామం 'పిరిడి'లో మాత్రం ప‌రిస్థితి భిన్నం. అక్క‌డ రెండు గ్లాసుల విధానం కానీ, డిస్పోజ‌బుల్ విధానం కానీ లేదు.

త‌మ గ్రామంలో పూర్వం రెండు గ్లాసులున్నా ఇప్పుడు ఆ ప‌ద్ధ‌తి ఏమాత్రం లేద‌ని చెప్పుకొచ్చారు బీసీ కులానికి చెందిన 65 ఏళ్ల పైడిత‌ల్లి.

"1992లో ఆవు చ‌నిపోతే దాన్ని తీసే విష‌యంలో పెద్ద గొడ‌వ‌ల‌య్యి, ఊళ్లో వాళ్లు ద‌ళితులంద‌ర్నీ కొట్టారు. త‌రువాత అధికారులు వ‌చ్చారు. అప్పటి నుంచే రెండు గ్లాసుల విధానం కూడా ర‌ద్దయింది. నా జీవితంలో రెండు గ్లాసుల ఇబ్బంది ఎప్పుడూ ఎదురుకాలేదు'' అని వివ‌రించారు 40 ఏళ్లకు పైబ‌డ్డ రామారావు అనే ద‌ళితుడు.

"గాజు గ్లాసు ఉంటే స‌మ‌స్య పెరిగేది. డిస్పోజ‌బుల్ వ‌చ్చాక అంద‌రికీ ఉప‌యోగ‌కరం. ఎవ‌రికీ స‌మ‌స్య లేదు. క‌డిగే అవ‌స‌రం లేదు. దీంతో వివక్ష పోయింది. క్యాస్ట్ ఫీలింగ్ చూపక్కర్లేదు" అన్నారాయ‌న‌.

"పేప‌ర్ వ‌చ్చాక ఎవ‌రి గ్లాస్ వారిదే. క‌ల్చ‌ర్లో మార్పు వ‌చ్చింది. ప్లాస్టిక్ గ్లాస్ అయితే త‌మకు సౌక‌ర్యం అని షాపు వారు తెచ్చుకుంటారు. ప్ర‌జా సంఘాల ఒత్తిడి కూడా కొంత మార్పుకు కార‌ణం" అని వివ‌రించారు అదే గ్రామంలోని బీసీ కులానికి చెందిన‌ సింహాచ‌లం. సింహాచ‌లం బీసీ కుల సంఘాల్లో చురుగ్గా ప‌నిచేశారు.

"ఇప్ప‌టికీ చాలా ఊళ్ళ‌ల్లో రెండు గ్లాసుల విధానం ఉంది. కాక‌పోతే కేసుల భ‌యంతో కొత్త వారు వ‌చ్చిన‌ప్పుడు డిస్పోజ‌బుల్ ఇస్తారు. కాస్త చ‌దువుకున్న‌వాడు ఊరు వెళ్లి టీ తాగితే, 'నువ్వు సెప‌రేట్ గ్లాస్ తీసుకో, నువ్వు గ్లాస్ కడుగు' అని చెబితే వాడి న‌రాలు క‌రెంటు షాక్ కొట్టిన‌ట్టు అవుతాయి. అంత‌కంటే పెద్ద శిక్ష ఇంకేమీ ఉండ‌దు. ఈ గోల ప‌డ‌లేకే టీ షాపుకు వెళ్లిన‌ప్పుడు సొంత పాత్ర ప‌ట్టుకెళ‌తారు. వివ‌క్ష పోలేదు. కాక‌పోతే ఇప్పుడు కాస్త సాఫ్టుగా చెప్తున్నారు. అంతే. రెండు గ్లాసులు లేవ‌ని రామ‌భ‌జ‌న ద‌గ్గ‌ర ఒట్టేసి చెప్ప‌మ‌నండి గ్రామ పెద్ద‌ల‌ను?" అని సాంబయ్య ప్ర‌శ్నించారు.

"రెవెన్యూ పోలీసు క‌లిసి నిరంత‌రం మానిట‌రింగ్ చేస్తేనే ఈ వ్య‌వ‌స్థ మారుతుంది. పోలీసులకే జ‌నం భ‌య‌ప‌డ‌తారు. నిజంగా అంద‌రికీ స‌మానంగా ప్లాస్టిక్ క‌ప్పుల్లోనే టీ ఇస్తే ద‌ళితుల్లో ఆత్మ‌విశ్వాసం పెరుగుతంది. త‌మ‌నూ మ‌నుషుల్లా చూస్తున్నారు, గౌర‌విస్తున్నార‌న్న భావ‌న క‌లుగుతుంది" అన్నారు సాంబ‌య్య‌.

ఫొటో సోర్స్, Getty Images

శుభకార్యాల్లో వేర్వేరు వంటలు...

దళితుడి ఇంట్లో విందంటే ఫంక్షన్ ఏదైనా సరే రావాలంటే సెప‌రేట్ వంట చేయాల్సిందే లేదా విడిగా భోజనాల పందిరి వేయాల్సిందే.

"వాళ్లు ('అగ్ర‌' కుల‌స్తులు) మా ఫంక్ష‌న్ల‌కు రారు. వ‌స్తే వారికి వేరేగా భోజ‌నం పెట్టాలి. మా వాళ్ల‌కు చ‌ర్చి ద‌గ్గ‌ర పెడితే, వాళ్ల‌కు వేరే చోట భోజ‌నం పెడ‌తాం. లేక‌పోతే రారు. వాళ్లంటే గౌర‌వంతోనే ఇది చేస్తున్నాం. చిన్న‌ప్ప‌టి నుంచీ ఇదే ఆన‌వాయితీగా వ‌స్తుంది. వాళ్ల‌కు మాతో కూర్చుని తిన‌డానికి ఫీలింగ్. అందుకే ఇలా చేస్తున్నాం" ఉత్త‌రాంధ్ర‌లోని ఓ ప‌ల్లెలో తాపీ ప‌ని చేసుకునే ఒక ద‌ళిత వ్య‌క్తి బీబీసీతో చెప్పిన మాట‌లివి!

ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో కుల వివ‌క్ష‌, ద‌ళితుల‌ను త‌క్కువ‌గా చూసే విధానం ఏ స్థాయిలో ఉన్నాయ‌నేదానికి ఇది ఒక చిన్న ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. హోటళ్ల‌లోనే కాకుండా, పెళ్లి వంటి శుభ‌ కార్యాల‌లో కూడా వివ‌క్ష కొన‌సాగుతోంది.

"ఒక‌ప్పుడు ఇంకా ఉండేది. వాళ్లింట్లో శుభ‌కార్యాల‌కు మాకు భోజ‌నం బ‌య‌ట పెట్టేవారు. అంద‌రూ తినేశాక‌, చివ‌ర్న పెట్టేవారు. ఇప్పుడు అలా లేదు. వాళ్ల కార్య‌క్ర‌మంలో అంద‌రితో క‌లిపే భోజ‌నం పెడ‌తారు. కానీ మ‌నం పిలిస్తే మాత్రం వారికి వేరే పెట్టాలి. మాతో కూర్చొని తిన‌డానికి వారికి ఫీలింగ్. అందుకని వ‌డ్డించ‌డం సెప‌రేట్" అంటూ వివ‌రించాడు మ‌రో వ్య‌క్తి.

ద‌ళితుల‌ను తాము భోజ‌నాల‌కు ఆహ్వానిస్తామ‌ని అక్క‌డి బీసీ కుల‌స్తులు చెప్పారు. త‌మ‌ను ద‌ళితులు పిలిస్తే ప్ర‌త్యేకంగా వ‌డ్డిస్తార‌ని వారు వివ‌రించారు.

ఆ గ్రామానికి కాస్త దూరంలోని మ‌రో గ్రామంలో మాత్రం ఇంకా వేరుగా వంట చేసే ప‌ద్ధ‌తి కూడా ఉంది.

"రెండు కులాల మ‌ధ్య భోజ‌నాల‌కు వెళ్ళ‌డాలు లేవు. మేం పిలిస్తే వ‌స్తారు. అంద‌రితో క‌లిపే వాళ్ల‌కు పెడ‌తాం. మ‌నం వాళ్ల ఇంటికి వెళ్ళం. మొన్న ఒక పెళ్లి అయింది. అప్పుడు మాత్రం వాళ్లు సెప‌రేట్‌గా వ‌డ్డించారు. అత‌ను పంచాయితీలో ప‌నిచేస్తాడు. అత‌నికు పెద్ద వాళ్లు తెలుసు. వాళ్లంతా వ‌చ్చారు. ఆ అబ్బాయి చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు. అందుకోసం బీసీ కుల‌స్తులే సెప‌రేట్‌గా భోజ‌నం వండారు. సెప‌రేట్‌గా వ‌డ్డించారు. అత‌ను ద‌ళితుల కోసం, అగ్ర‌కుల‌స్తుల కోసం వేర్వేరుగా వంట చేయించాడు. ద‌ళితుల వంట వాళ్లు చూసుకుంటారు. మ‌న వంట సంగ‌తి, వంట మాస్టర్ చూసుకుంటారు. మ‌న‌వాళ్లే వ‌డ్డిస్తారు. (ఖ‌ర్చు ద‌ళితుల‌దే)" అని త‌మ గ్రామంలో ప‌రిస్థితి వివ‌రించారు స్థానిక మ‌హిళ‌ ఒకరు. ఎస్సీలు అంత ఘ‌నంగా పెళ్లి చేసుకోవ‌డం గ‌త నాలుగైదేళ్ల‌లో తాను చూడడం అదే మొద‌టిసారి అని వ్యాఖ్యానించారు ఆ మ‌హిళ‌.

చ‌ర్చిలు కూడా సెప‌రేటే!

ఈ గ్రామంలోని ద‌ళితులంతా క్రైస్త‌వం పాటిస్తున్నారు. వారికి ఒక చ‌ర్చి ఉంది. పాస్ట‌ర్ ఉన్నారు. ఊరిలో కొంద‌రు బీసీలు కూడా క్రైస్త‌వం తీసుకున్నారు. కానీ వారు మాత్రం వేరే చ‌ర్చికి వెళుతున్నారు. ఆ ప‌క్క‌నే మ‌రో గ్రామంలో మాత్రం ద‌ళితుల్లో హిందువులున్నా వారు ఇప్ప‌టికీ దేవాల‌యాల్లోకి రారు. గుడిలోకి రావ‌డానికి తీవ్ర‌మైన ప్ర‌య‌త్నాలు చేయ‌లేదని చెప్పుకొచ్చారు ఈ గ్రామానికి చెందిన ఒక పెద్ద వ‌య‌సు వ్య‌క్తి.

అయితే కొన్ని ఊళ్ల‌ల్లో ప‌రిస్థితి క్ర‌మంగా మారుతోంది. పిరిడి గ్రామంలో ఆ విషయంలో ఒక ముంద‌డుగు ప‌డింది. ఆ గ్రామంలో అమ్మ‌త‌ల్లి అనే దేవ‌త ఉత్స‌వం జ‌రుగుతుంది. ఆ ఉత్స‌వాల్లో భ‌క్తులు త‌మ త‌ల‌పై అమ్మ‌వారి ప్ర‌తిరూపాలుగా చెప్ప‌బ‌డే ఘ‌టాల‌ను పెట్టుకుని ఊరంతా తిరిగే సంప్ర‌దాయం ఉంటుంది.

అలా ఘ‌టం లేదా గ‌ర‌గ‌ను నెత్తిమీద పెట్టుకుంటామంటూ చాలా మంది అమ్మ‌వారికి మొక్కుకుంటారు. కానీ, వాటిని నెత్తిమీద పెట్టుకునే అవ‌కాశం ద‌ళితులకు లేదు. అక్క‌డ ఉత్స‌వం ఐదేళ్ల‌కోసారి జ‌రుగుతుంది.

మొన్న‌ ఆ ఉత్స‌వం జ‌రిగినప్పుడు గ‌ర‌గ‌లు నెత్తిమీద పెట్టుకునే అవ‌కాశం త‌మకూ కావాల‌ని ద‌ళితులు కోరడం, దానిపై బీసీ కులాలు చర్చించి, చివ‌ర‌కు ఒప్పుకోవ‌డం, మొద‌టిసారి మాల‌, మాదిగ‌లు అమ్మ‌వారి గ‌ర‌గ నెత్తిమీద పెట్టుకోవ‌డం జ‌రిగాయి.

"ఊరిలో కొంద‌రు మంచివారు కూడా ఉంటారు. అగ్ర‌కుల‌స్తుల్లో వివ‌క్ష‌ను వ్య‌తిరేకించేవారు ఉంటారు. కానీ వారు మాట్లాడ‌లేరు. మంచివారి మౌనం చాలా ప్రమాదం. ఇటువంటి సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించి, ద‌ళితుల‌ను బ‌హిష్క‌రించే గ్రామ‌లను ప్ర‌భుత్వ‌మే బ‌హిష్క‌రించ‌డం, పోలీసులు నిరంతరం క‌మిటీల‌తో ప‌ర్య‌వేక్షించ‌డం వంటివి చేస్తే త‌ప్ప వివ‌క్ష పోదు" అని వివ‌రించారు సాంబ‌య్య అనే అంబేడ్క‌ర్ పోరాట స‌మితి నాయ‌కులు.

ఇలస్ట్రేషన్స్: పునీత్ కుమార్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)