ప్రెస్ రివ్యూ: నేను కూడా దుకాణానికి వెళ్లి కార్డు గీకాల్సిందేనట: కేసీఆర్

  • 30 మార్చి 2018
కేసీఆర్ Image copyright facebook.com/trspartyonline

ఎరువుల కోసం రైతులు కార్డు ద్వారానే డబ్బులు చెల్లించాలని కేంద్రం చెప్పడం సరికాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారని ఈనాడు పేర్కొంది.

ఎరువుల రాయితీని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయనే నెపంతో రైతులందరినీ పీవోఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) కేంద్రాల వద్దకు వెళ్లి కార్డును గీకి ఎరువులు తీసుకోవాలనడం ఏమాత్రం సమంజసం కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఎరువుల కోసం రైతులను ఇలా ఇబ్బంది పెట్టటం భావ్యం కాదని, దీన్ని విరమించుకోవాలని ఆరుణ్‌జైట్లీని కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆయన అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు.

''ఎరువులను కొనుక్కోవాలంటే ఇప్పుడు ఆధార్‌కార్డు చూపించడంతోపాటు పీవోఎస్‌లో కార్డును గీకాలి. ఇందుకోసం ఎరువులు కావాల్సిన రైతులు స్వయంగా వెళ్లాల్సి ఉంటోంది. నేను ఒంటిమామిడిలో ఉన్న దుకాణంలో ఎరువులను కొంటుంటాను. నన్ను కూడా షాపుకు వచ్చి కార్డును గీకి ఎరువులను తీసుకెళ్లాలని, లేకుంటే తానే మిషన్‌ను పట్టుకొని వస్తానని దుకాణ యజమాని చెప్పాడు. అలా చేయకుంటే తన లైసెన్సు పోతుందని ఆయన వాపోతున్నాడు'' అని సీఎం పేర్కొన్నారు.

ఏప్రిల్ 1 నుంచి పార్కింగ్ ఉచితం

Image copyright Getty Images

హైదరాబాద్‌లో ఏప్రిల్ 1 నుంచి కొత్త పార్కింగ్ పాలసీని అమలు చేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హైదరాబాద్‌లోని మాల్స్, మల్టీప్లెక్సుల్లో ఉచిత పార్కింగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

తొలి ముప్పై నిమిషాల పాటు ఉచితంగా పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని కమిషనర్ సూచించారు. ఆ తర్వాత కూడా నిర్ణీత ఫీజులు మాత్రమే వసూలు చేయాలని కోరారు.

నగరంలో రోజూ 54 లక్షల వాహనాలు తిరుగుతున్నట్టు గుర్తించామన్నారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి ఖాళీగా ఉన్న ప్రదేశాలను గుర్తించి, తాత్కాలికంగా పార్కింగ్‌ను కల్పించే విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

సొంత బ్యాంకులోనే చోరీ

Image copyright Getty Images

తాను పనిచేస్తున్న బ్యాంకులోని రూ. 91 లక్షల నగదుతోపాటు, ఖాతాదారులు కుదువపెట్టిన బంగారు ఆభరణాలతో హెడ్ క్యాషియర్ పరారయ్యాడని ఆంధ్రజ్యోతి తెలిపింది.

కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచిలో ఇది జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. ప్రొద్దుటూరుకు చెందిన ఎం. గురుమోహన్‌రెడ్డి రంగసముద్రం ఎస్‌బీఐలో హెడ్‌క్యాషియర్‌. బుధవారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ఆయర, సాయంత్రం బ్యాంకు లావాదేవీలు ముగిసే సమయానికి కూడా తిరిగి రాలేదు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉంది. అనుమానం వచ్చి ఆ బ్యాంకు మేనేజర్‌ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో బ్యాంకు ఉన్నతాధికారులు హుటాహుటిన వచ్చి తనిఖీ చేశారు. రూ. 91,49,900 నగదు, 24 చిన్న సంచుల్లోని ఖాతాదారులు కుదువపెట్టిన బంగారు నగలు కనిపించలేదు. హెడ్‌ క్యాషియరే వీటిని దొంగలించాడనే అనుమానంతో బ్యాంకు మేనేజర్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐసీఐసీఐ బ్యాంకులో 'క్విడ్ ప్రో కో'?

Image copyright Getty Images

ఐసీఐసీఐ బ్యాంకులో కుంభకోణం బయటపడిందంటూ సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం, బ్యాంకు సీఈవో చందా కొచర్‌.. క్విడ్‌ ప్రో కో (నాకిది, నీకది) విమర్శలకు కేంద్ర బిందువయ్యారు.

డిసెంబర్‌ 2008లో చందా కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌తో పాటు మరో ఇద్దరు బంధువులతో కలసి వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటరు వేణుగోపాల్‌ ధూత్‌.. న్యూపవర్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత తన సొంత కంపెనీ నుంచి ఈ కొత్త సంస్థకు రూ.64 కోట్ల రుణమిచ్చిన ధూత్‌... ఆపై కేవలం రూ.9 లక్షలకు న్యూపవర్‌లోని తన వాటాలు, యాజమాన్య అధికారాలన్నీ దీపక్‌ కొచర్‌కి బదలాయించేశారు.

అయితే, వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 3,250 కోట్ల మేర రుణం మంజూరైన ఆరు నెలల్లోనే 'న్యూపవర్‌' కంపెనీ చేతులు మారటం చర్చనీయమైంది. ఇందులో లబ్ధిదారు చందా కొచర్‌ భర్త దీపక్‌ కొచర్, ఇతర కుటుంబీకులు కావడంతో ఆమె పాత్రపై సందేహాలు తలెత్తుతున్నాయి.

''2012లో ఎస్‌బీఐ సారథ్యంలో 20 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి వీడియోకాన్‌కు సుమారు రూ.40,000 కోట్లు రుణాలిచ్చాయి. ఇందులో మా వాటా కేవలం రూ.3,250 కోట్లు. ఆ రుణంలో దాదాపు 86 శాతం(రూ.2810 కోట్లు) ఈ గ్రూప్‌ చెల్లించలేకపోయింది. దాంతో 2017లో ఆ గ్రూపును మొండిపద్దుగా ప్రకటించాం" అని ఐసీఐసీఐ వివరణిచ్చింది.

కన్సార్షియంలో ఎస్‌బీఐ, ఐడీబీఐ బ్యాంకులు రుణాలు మంజూరు చేశాకే, ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కమిటీ రుణం మంజూరు చేసిందని ఐసీఐసీఐ చైర్మన్‌ ఎం.కె. శర్మ చెప్పారు. ఆ కమిటీకి అప్పట్లో చందా కొచర్‌ చైర్‌పర్సన్‌గా లేరని స్పష్టం చేశారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)