ప్రెస్ రివ్యూ: గ్రూపు-1లో బీటెక్‌ బాబులదే హవా!

  • 31 మార్చి 2018
Image copyright AFP

గ్రూపు-1 ఉద్యోగాలను దక్కించుకోవడంలో బీటెక్‌ అభ్యర్థులే ముందంజలో ఉంటున్నారు. బీఏ, బీకాం, సైన్స్‌, ఇతర డిగ్రీ అభ్యర్థులు వెనుకబడిపోతున్నారంటూ 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవల ప్రకటించిన మౌఖిక పరీక్షల మార్కుల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇటీవల బ్యాంకు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, పోలీసు, ఇతర శాఖల ఉద్యోగాలలోనూ బీటెక్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

గ్రూపు-1 ఇంటర్వ్యూలకు హాజరైన వారిలో బీటెక్‌ చదివిన వారే 60 శాతానికి పైగా ఉన్నారు. ఎంబీబీఎస్‌ వైద్యులు 15 మంది వరకు ఉన్నారు.

ఎంపికయ్యే వారిలోనూ బీటెక్‌ వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారని ఈనాడు పేర్కొంది.

5వ పేపర్('డేటా ఇంటర్‌‌ప్రెటేషన్‌') బీటెక్ అభ్యర్థుల తలరాతలను మార్చేస్తోంది.

మౌఖిక పరీక్షలకు ఎంపికైన మొదటి 110 మందిలో 96(87%) మందికి 5వ పేపరు 'డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌'(గణితం)లో 100 (150 మార్కులకు)కుపైగా రావడం గమనార్హం.

ఈ పేపరులో 130, 140 మార్కులు సాధించడంవల్ల మిగిలిన పేపర్ల(50 నుంచి 60 మధ్య)లో మార్కులు తక్కువగా వచ్చినప్పటికీ మౌఖిక పరీక్ష, ఉద్యోగాలకు చేరువవుతున్నారు.

ఇదే సమయంలో మిగిలిన 4 పేపర్లలో 85-90 మార్కులు సాధించి 5వ పేపరులో 60-70 మార్కులు సాధించిన అభ్యర్థులు అసలు ఇంటర్వ్యూలకు కూడా ఎంపిక కావడంలేదని ఈనాడు వివరించింది.

ప్రకాశ్ రాజ్‌తో కేసీఆర్ బయోపిక్?

Image copyright facebook.com/KalvakuntlaChandrashekarRao

టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్‌ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోందంటూ 'ఆంధ్రప్రభ' పత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. కేసీఆర్ పాత్రలో నటించేందుకు ప్రకాశ్ రాజ్‌ను ఎంపిక చేశారు. వచ్చే నెలలో లేదా మే మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ దినచర్య, హావభావాలు, మాట్లాడే తీరుపై అవగాహన కల్పించేందుకు ప్రతి రెండు, మూడు రోజులకోసారి ప్రకాశ్ రాజ్ తనతో కొన్నగంటలు గడిపేందుకు అనుమతి ఇచ్చారు.

అందులో భాగంగానే గురువారం ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన కేసీఆర్‌తో కలిసి అసెంబ్లీకి కూడా వెళ్లారు.

అక్కడ సీఎం కార్యాలయంలో నేతలతో వరుస భేటీలు, వారితో చర్చించిన అంశాలు, సమస్యలపై స్పందించిన తీరును ప్రకాశ్ రాజ్ పరిశీలించారు.

ఈ సినిమాకు అయ్యే ఖర్చును పూర్తిగా టీఆర్‌ఎస్ పార్టీ భరిస్తుందని ఆంధ్రప్రభ వివరించింది.

1.30 లక్షల మంది టీచర్ల బదిలీలు

Image copyright Getty Images

సుమారు 1.30 లక్షల మంది ఉపాధ్యాయుల బదిలీలకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం అంగీకరిస్తే మే నెలలోనే బదిలీలు చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోందని 'సాక్షి' పేర్కొంది.

రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించి మూడేళ్లు (2015 జూన్‌/జూలై) కావస్తోంది.

ఈ నేపథ్యంలో 54 ఉపాధ్యాయ సంఘాలు 'జాయింట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్స్‌ యూనియన్‌ (జేసీటీయూ)'గా ఏకమై బదిలీల డిమాండ్‌ను లేవనెత్తాయి. ఈసారి కచ్చితంగా టీచర్ల బదిలీలు చేపట్టాలని, ఏకీకృత సర్వీసు రూల్స్‌ను పరిష్కరించి పదోన్నతులు కల్పించాలని కోరాయి.

మరోవైపు, ఏడాది కింద కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న పండిట్, పీఈటీ అప్‌గ్రెడేషన్‌ విషయంలో.. వారికి పదోన్నతులు కల్పించి బదిలీలు చేయాల్సి ఉంది.

కొత్తగా రానున్న 8,792 మంది ఉపాధ్యాయులకు జూన్‌/జూలై నెలల్లో పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని ముందుగానే టీచర్ల బదిలీలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం ఏ మేనేజ్‌మెంట్‌ (ప్రభుత్వ, జిల్లా పరిషత్‌) టీచర్లను ఆ మేనేజ్‌మెంట్‌ పరిధిలోనే బదిలీ చేయాలని విద్యాశాఖ భావిస్తోందని సాక్షి వివరించింది.

జేఎఫ్‌సీ కథ 'ముగిసింది'

పవన్ కల్యాణ్, జయప్రకాశ్ నారాయణ Image copyright facebook.com/janasenaparty

జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ, తదితరులు కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ(జేఎఫ్‌సీ) కథ ముగిసిందంటూ 'ఆంధ్రజ్యోతి' రాసింది.

''జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన సంయుక్త నిజనిర్ధారణ సంఘం (జేఎ్‌ఫసీ) ఒక ఈవెంట్‌లాగా ముగిసిపోయింది. అదే స్ఫూర్తితో, ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించేలా స్వతంత్ర నిపుణుల బృందం (ఇండిపెండెంట్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌-ఐజీఈ) ఏర్పాటు చేశాం'' అని లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌ నారాయణ ప్రకటించారు.

జేఎఫ్‌సీని ప్రారంభించేందుకు చొరవ చూపినవారు, ఆ తర్వాత దానిని కొనసాగించలేదంటూ పరోక్షంగా పవన్‌పై జేపీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

విభజన చట్టంలో నవ్యాంధ్రకు ఇచ్చిన హామీలు ఏమేరకు అమలయ్యాయి? ప్రధాన అంశాలకు పరిష్కారం ఏమిటి? అనే అంశాలపై ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ తరఫున ఏర్పడిన ఐజీఈ శుక్రవారం హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌)లో సమావేశమైంది. న్యాయ, ఆర్థిక, పరిపాలన రంగాలకు చెందిన నిపుణులు ఆయా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

కేంద్రం తమకు సమయమిస్తే, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి లేదా ఆర్థిక మంత్రితో కూర్చుని పార్టీలకు అతీతంగా పరిష్కారాలు సూచిస్తామని జయప్రకాశ్‌ నారాయణ చెప్పారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు