#UnseenLives: ఊరికి రోడ్డొచ్చాక కూలీల జీవితంలో కొంత మార్పొచ్చింది

  • 31 మార్చి 2018
మహిళలు

గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్య‌వ‌స్థ‌కీ, ర‌వాణా సౌక‌ర్యానికీ చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉంటుంది. ఊరికి ర‌వాణా సౌక‌ర్యం, ఇత‌ర‌త్రా అనుసంధానం (క‌నెక్టివిటీ) పెరిగిన త‌రువాత ఆ ప్ర‌భావం అన్ని సముదాయాల మీదా ప‌డుతుంది.

ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాలలో కూలీ చేసుకుంటే త‌ప్ప కుటుంబం గ‌డ‌వ‌ని వారికి రోడ్లు ఎలా ఉప‌యోగ‌ప‌డ్డాయి? అని ప‌రిశీలించ‌డానికి ఉత్త‌రాంధ్ర ప‌ల్లెల్లో ప‌ర్య‌టించింది బీబీసీ తెలుగు బృందం.

గ్రామీణ కూలీల‌పై రోడ్లు చూపించిన ప్ర‌త్య‌క్ష ప్ర‌భావంతో వారి అవ‌కాశాల‌ పరిధి విశాలమైంది.

తారు రోడ్లు వ‌చ్చాక గ్రామీణ ప్రాంతాల్లో ర‌వాణా సౌక‌ర్యం పెరిగింది. ఆర్టీసీ బ‌స్సులు, ప్రైవేటు బ‌స్సులు, వ్యానులు, జీపులు.. ఇప్పుడు వాటన్నిటినీ త‌ల‌ద‌న్నేలా పెద్ద ఆటోలు!

ఇవ‌న్నీ ఒక కూలీని తాను వెళ్లాలనుకున్న చోటుకు చేరుస్తున్నాయి.

సొంతూరిలో పని దొరకనప్పుడు, పక్క గ్రామాలకు, పట్టణాలకు న‌డిచో, సైకిళ్ల మీదో వెళ్లి కూలీ చేసుకుని సాయంత్రానికి ఉసూరుమంటూ కాళ్లీడ్చుకుని రావ‌ల్సిన క‌ష్టాన్ని త‌ప్పించాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఊరికి రోడ్డొచ్చాక కూలీల జీవితాలు ఎలా మారాయంటే...

ఎక్క‌డ నాలుగు రూపాయలు ఎక్కువ వస్తే అక్క‌డికే

ఊళ్లో ప‌ని ఉన్నా లేక‌పోయినా ఎక్క‌డ నాలుగు రూపాయలు ఎక్కువ వ‌స్తాయో అక్క‌డ‌కు వెళ్లే అవ‌కాశాన్ని క‌ల్పించాయి ఈ రహదారులు. అంతకు ముందు ఊళ్లో వాళ్లు ఇచ్చినంతే తీసుకోవాల్సి వచ్చేది.

విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని పిరిడి గ్రామం కూలీల‌కు పెద్ద అడ్డా. ఆ గ్రామంలో దాదాపు 2 వేల మంది కూలీలు ఉన్నారు.

ఈ సందర్భంగా హ‌డావుడిగా ఆటోలో కూర్చున్న సింహాచ‌లం అనే మ‌హిళ‌ బీబీసీతో మాట్లాడుతూ.. "అప్ప‌ట్లో న‌డిచే వెళ్లే వాళ్లం. అప్పుడ‌ప్పుడు రిక్షాలు ఎక్కే వాళ్లం. కాస్త ఆలస్యం అయినా వెన‌క్కి రావాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఆటోలు, బ‌స్సులు వ‌చ్చాక ఆ సమస్య లేదు" అని చెప్పారు.

చిత్రం శీర్షిక ఆటోలు రావడంతో ఎంత దూరమైనా పనులకు వెళ్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.

"బ‌స్సు అయితే బ‌స్సు, ఆటో అయితే ఆటో ఏదో ఒక‌టి. తొంద‌ర‌గా వెళ్లాలి. పొద్దున్నే ఏడున్న‌ర‌క‌ల్లా అక్క‌డుండాలి. లేక‌పోతే క్యారేజీ (భోజ‌నం డబ్బా) ప‌ట్టుకుని వెన‌క్కు వ‌చ్చేయాల్సిందే. ఎందుకంటే ఆలస్యమైతే సేట్లు (సేటు = య‌జ‌మాని) ఊరుకోరు క‌దా. పనిలేదు పోరా! టైం దాటిపోయాక వ‌చ్చి ప‌నేంటి? అంటారు. ఊళ్లోనేమో ప‌నిదొర‌క‌దు. నీళ్లు లేవు. ఉపాధి మ‌ట్టి ప‌నికి (ఉపాధి హామీ ప‌థ‌కం) వెళ్తే కూలీ స‌రిగా రాదు. స‌రిపోదు. సిమెంట్ ప‌నికి వెళితే 350 రూపాయల దాకా వస్తాయి. బియ్యం, కూర‌గాయలు కొనుక్కోవ‌చ్చు. బొబ్బిలి వెళ్తే సాయంత్రానికి కూలి డ‌బ్బులు ఇచ్చేస్తారు. అప్పట్లో రోడ్లు బాలేవు. అన్నీ గోతులు ఉండేవి. ఇప్పుడు బావున్నాయి. ప‌నులు దొరుకుతున్నాయి. కూలీ పెరిగింది" అని రాము అనే మరో కూలీ వివ‌రించారు.

త‌న చిన్న‌త‌నంలో పేదరికంతో త‌ల్లితండ్రులు చ‌దివించ‌లేక‌పోయార‌ని, ఇప్పుడు బ‌య‌ట కూలీకి వెళ్తే పిల్ల‌ల్ని ప్రైవేటు స్కూలుకు పంప‌క‌పోయినా, గ‌వర్న‌మెంటు స్కూల్లో చ‌దివించ‌గ‌లుగుతున్నామనీ ఆయ‌న చెప్పుకొచ్చారు.

అప్ప‌ట్లో ఇన్ని వాహనాలు, బ‌స్సులు లేన‌ప్పుడు సైకిల్ పై వెళ్లడం లేదంటే కాలిన నడకన వెళ్లాల్సి వచ్చేది. అలా కొందరు 20 - 30 కిలోమీట‌ర్లు కూడా వెళ్లేవారు.

రోడ్ల‌మీద గోతులు, రాళ్ల‌కు సైకిల్ రీములు విరిగిపోవ‌డం, పంక్చ‌ర్లు కావ‌డంతో నానా ఇబ్బందుల పడేవాళ్లమని గ్రామ‌స్తులు గత పరిస్థితులను గుర్తు చేశారు.

చిత్రం శీర్షిక రహదారులు బాగుపడటంతో గ్రామాలకు రవాణా సౌకర్యాలు పెరిగాయి.

పొద్దున సైకిల్ మీద వెళ్లి, రోజంతా చెమటోడ్చి, మ‌ళ్లీ సాయంత్రం అంత‌దూరం సైకిల్ తొక్క‌ాలంటే ఆయాసం వేసేది.

ఇప్పుడు రోడ్లు వ‌చ్చాక ప‌దో, ప‌దిహేనో పోయినా ప‌ర్వాలేదు. బ‌స్సో, ఆటో ఎక్కివెళ్ల‌వ‌చ్చ‌నే భావన పెరిగింది.

బ‌స్సు ఉంటే స‌రి. లేదంటే ఒక్క ఫోను చేస్తే ఆటోవాలాలు వ‌చ్చి ఎక్క‌డి నుంచి కావాలంటే అక్క‌డి నుంచి తీసుకెళ్తున్నారు.

చిత్రం శీర్షిక సింహాచలం, కూలీల మేస్త్రీ

కూలీల‌ను ప‌నుల‌కు తీసుకువెళ్లే మేస్త్రీలు కూడా వ్యాన్లు, జీపులు, ఆటోల వారితో ఒప్పందం చేసుకుని ప‌ని మ‌రింత సులువు చేసుకున్నారు.

"అప్ప‌ట్లో కూలీ ప‌నికుండే అవ‌కాశాలు త‌క్కువ‌. ప‌దేళ్ల నుంచి బాగా పెరిగాయి. ముఖ్యంగా కాంట్రాక్టు ప‌నులు పెర‌గ‌డం, గ‌వ‌ర్న‌మెంటు కూడా ప‌ని ఇస్తోంది. ఊరి బ‌య‌ట‌కు ప‌నికోసం వెళ్ల‌డం ఓ ప‌దేళ్ల నుంచే మొద‌లైంది. బ‌య‌ట ఊళ్ల‌లో కాంక్రీటు ప‌నికి వెళ‌తాం. అక్క‌డి వారికి ఆ ప‌ని రాక‌పోవ‌డం లేదా కూలీలు త‌క్కువ ఉండ‌డం వ‌ల్ల మ‌మ్మ‌ల్ని పిలుస్తారు" అని వివరించారు సింహాచ‌లం అనే కూలీల మేస్త్రి.

చిత్రం శీర్షిక ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద వేసిన రోడ్డు

మ‌హిళ‌ల ప‌రిస్థితి…

కూలీ చేసుకునే మ‌హిళ‌ల‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌కు తోడు వేధింపులు అద‌నం. అన్ని రంగాల్లో ఉన్న‌ట్టే ఇక్క‌డా కనిపిస్తుంది. మ‌హిళ‌లు దానిపై తిర‌గ‌బ‌డే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉండేది. మాట‌ల‌ను మౌనంగా భ‌రించాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఆ ప‌రిస్థితి కాస్త మారింది.

"వేధింపులు ఇంత‌కు ముందు అక్క‌డ‌క్క‌డా ఉండేవి. అది అన్ని చోట్ల‌, అన్ని ప‌నుల్లో ఎప్పుడూ ఉన్న‌దే. అంద‌మైన ఆడ‌పిల్ల న‌డిచెళ్తుంటే చూడ్డం, మాటలు అన‌డం, హీనంగా మాట్లాడ్డం చాలా కాలం నుంచి ఉంది. పేద‌రికం వ‌ల్ల అలా గమ్మున ఉండాల్సి వ‌చ్చేది. అప్ప‌ట్లో కూలీ ప‌ని దొర‌క‌డ‌మే క‌ష్టం. కుటుంబం గ‌డ‌వాలి. అంతా మౌనంగా ఉండేవాళ్లు. కుటుంబ పోష‌ణ ముఖ్య‌ం అనుకునేవాళ్లు మ‌హిళ‌లు. ఇప్పుడు కొంత మార్పు వ‌చ్చింది. అంద‌రూ క‌ష్ట‌ప‌డుతున్నారు. క‌ష్ట‌ప‌డి తింటున్నారు. ఎవ‌రూ త‌క్కువ‌గా ఉండ‌డం లేదు. పక్క ఊళ్లకు భార్యాభ‌ర్త‌లు క‌లిసి ప‌నికి వెళ్తున్నారు. ఒక‌వేళ ఎక్క‌డైనా ఇబ్బంది ఉన్నా, దాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. మితిమీరితే తిర‌గ‌బ‌డుతున్నారు" అని వివ‌రించారు సింహాచ‌లం.

చిత్రం శీర్షిక పనులకు వెళ్తున్న మహిళలు

కూలీ రేట్ల విష‌యంలో గ్రామాల‌కూ, సమీపంలో ఉన్న పట్టణాలకు మ‌ధ్య తేడా కాస్త త‌క్కువ‌గానే ఉంది. ప‌నిని బ‌ట్టి, సీజ‌న్ బ‌ట్టి అది మారుతోంది.

అయితే వ్య‌వ‌సాయం బాగా ఉన్న ఇత‌ర ప్రాంతాల‌కు వల‌స వెళ్లడం ఇక్క‌డ చాలా ఎక్కువ‌. అలాగే మ‌హిళ‌లు, పురుషుల కూలీ రేట్ల మ‌ధ్య‌ వ్య‌త్యాసం కూడా కొన‌సాగుతోంది.

ఉపాధి హామీ ప‌థ‌కం రేట్లు తక్కువ ఉండ‌డం, స‌మ‌యానికి అంద‌క‌పోవ‌డంపై అసంతృప్తి కూడా గ్రామాల్లో క‌నిపిస్తోంది.

మొత్తానికి రోడ్లు వ‌చ్చాక నిరంత‌రం కూలీ దొరికే అవ‌కాశం, కాస్త ఎక్కువ సంపాదించుకునే అవ‌కాశం క‌లిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు

మోదీకి గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే అవార్డుపై అభ్యంతరాలు ఎందుకు?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం

ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?

ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?

పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా

చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల వల్ల భారత్‌లో ధరలు పెరుగుతాయా?