#UnseenLives: పీరియడ్స్ సమయంలోనూ మాతో ‘సెక్స్ వర్క్’ చేయించేవారు!
- కిరణ్ దేశ్‌ముఖ్
- సెక్స్ వర్కర్, సామాజిక కార్యకర్త

ఫొటో సోర్స్, PRAJAKTA DHULAP / BBC
నేషనల్ నెట్వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్.. వేశ్యావృత్తిలోని మహిళల హక్కుల కోసం కృషి చేస్తున్న సంస్థ. దేశంలో 50 వేల మంది సెక్స్ వర్కర్లు ఈ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉన్నారు.
ఈ సంస్థతో కలిసి పనిచేసే సామాజిక కార్యకర్త, సెక్స్ వర్కర్ కిరణ్ దేశ్‌ముఖ్ ఇటీవల సంస్థ కార్యక్రమంలో భాగంగా దిల్లీ వచ్చారు. ఆమె తన అనుభవాలను బీబీసీ మరాఠీ ప్రతినిధి ప్రజాక్త ధులాప్కి వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
నేను ఇప్పటికీ సెక్స్ వర్కర్‌గానే పనిచేస్తున్నా. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది. కానీ ఇంతకుముందు జనానికి పీరియడ్స్ గురించి అవగాహన లేదు. ఈ వృత్తిలో చాలా వేధింపులు ఉంటాయి.
మేం కూడా మా శరీరాల్ని మామూలు మనుషుల్లాగా చూసుకోవటం నేర్చుకున్నాం. కానీ చాలా ఆలస్యంగా.
నాకు మొదటిసారి నెలసరి వచ్చినపుడు నా వయసు పదేళ్లు. మా ఇంటి నిండా ఎప్పుడూ జనం ఉండేవారు. ఆ రోజు ఇంట్లో అందరూ మగాళ్లే ఉన్నారు.
మరకలు అయిన విషయం నాకు తెలియలేదు. మా అన్నయ్య తన భార్యను పిలిచి చెప్పాడు. ‘‘ఆమె బట్టల మీద ఏవో మరకలు ఉన్నాయి చూడు’’ అని.
నాకేమీ అర్థం కాలేదు. నన్ను బట్టలు మార్చుకోమని మా వదిన చెప్పింది. ఓ పక్కన వేరుగా కూర్చోవటం, మనుషులను ముట్టుకోకుండా ఉండటం వంటి రూల్సన్నీ ఆమె నాకు వివరించింది. ‘‘ఇప్పుడు నువ్వు పెద్ద మనిషివి అయ్యావు’’ అంది.
ఏళ్లు గడిచిపోయాయి. పరిస్థితులు నన్ను పుణెలో ఓ సెక్స్ వర్కర్‌గా మార్చాయి. నాకు ఏమీ తెలిసేది కాదు. అప్పుడసలు ‘సెక్స్ వర్క్’ అనే మాటే ఉనికిలో లేదు.
జనానికి వారి హక్కుల గురించి అవగాహన లేదు. నా యజమానురాలు (ఈ వ్యాపారాన్ని నిర్వహించే మహిళ) మమ్మల్ని వేధించేది. పీరియడ్స్ రోజుల్లో కూడా వదిలిపెట్టేది కాదు. నేను పారిపోవాలని అనుకునేదాన్ని.
మహారాష్ట్రలోని సాంగ్లీ-మిరాజ్ అనే ప్రాంతం గురించి నాకు తెలిసింది. అది వేశ్యావృత్తికి సంబంధించిన ప్రాంతం. నేను పారిపోయి అక్కడికి వెళ్లాను.
పబ్లిక్ టాయిలెట్లలో దాక్కున్నాను. మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో సాంగ్లీ చేరుకున్నాను. ఆ కొత్త నగరం చూసి నాకు చాలా భయం వేసింది. తెల్లవారుజామున సాంగ్లీలో దిగాను. అక్కడొక మహిళను కలిశాను.
ఫొటో సోర్స్, PAJAKTA DHULAP / BBC
నెలసరి సెలవు
ఆ ఇంటి యజమానురాలు (వేశ్యావృత్తి నిర్వాహకురాలు) ఆడవాళ్లందరి బాగోగులు చూసుకునేది. నేను రెండు రోజులుగా ఏమీ తినలేదు. ఆమె నాకు అన్నం పెట్టింది. ఆమెలా నన్నెవరూ చూసుకోలేదు. నాకు అమ్మ ప్రేమ దొరికినట్లు అనిపించింది.
‘‘నేను నిన్నేమని పిలవాలి?’’ అని ఆమెనడిగాను. ఆమె కన్నడ మహిళ. ‘‘అవ్వ అని పిలుపు’’ అని చెప్పింది. అవ్వ అంటే అర్థం అమ్మ. నేను ఆమె కోసం పనిచేయటం మొదలుపెట్టా. ఆమె చాలా దయగా ఉండేది.
ఒక రోజు ఆమె నన్ను అడిగింది. ‘‘నీకు నెలసరి రాదా? అసలు ఎప్పుడూ సెలవు తీసుకోవు?’’
అది నిజం. నా పాత యజమానురాలు ఈ సెలవు గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఆమె చాలా డబ్బు గుంజుకుంది. అవ్వ వేరే తరహా. నెలసరి రోజుల్లో సెలవు తీసుకుని విశ్రాంతిగా గడపమని నాకు చెప్పింది.
ఆ రోజుల్లో నేను జాకెట్, స్కర్ట్ మాత్రమే తొడుక్కునేదాన్ని. నెలసరి రోజుల్లో స్కర్టును మడిచి నా నడుము చుట్టూ కట్టుకునేదానిని. అది నా శరీరానికి రాసుకుపోయి, చర్మం చిరుగులు పడేది. ఈ స్కర్టునే సానిటరీ నాప్కిన్గా వాడేవాళ్లం. ఆ తర్వాత ఆ స్కర్టుని ఉతుక్కునేవాళ్లం.
ముంబయి రెడ్‌లైట్ ఏరియా సెక్స్ వర్కర్ల కూతుళ్లు ఎడిన్‌బరో వచ్చి తమ అనుభవాల్ని పంచుకున్నారు
రౌడీల జులుం
సమాజానికి ఈ నెలసరి గురించి అసలేం తెలియదు. ఈ వృత్తిలో చాలా వేధింపులు ఉంటాయి. అది 1990-91 సంవత్సరం. మిరాజ్ రెడ్ లైట్ ఏరియాలో రౌడీలు రాజ్యం చలాయించేవారు.
ఎవరైనా ఒక సెక్స్ వర్కర్ వారి మాట వినకపోతే.. వాళ్లు ఆమె స్కర్ట్ పైకెత్తి లాంతరుతో తనిఖీ చేసేవాళ్లు. బూతులు తిట్టేవాళ్లు.
1992లో సంగ్రామ్ అనే ఎన్జీఓ గురించి మాకు తెలిసింది. వాళ్లు హెచ్ఐవీ గురించి అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నారు. అప్పటివరకూ సెక్స్ వర్కర్లకు తమ సొంత ఆరోగ్యం గురించి ఏమీ తెలియదు.
వాళ్లు కండోమ్‌ల గురించి మాట్లాడారు కానీ నెలసరి గురించి మాట్లాడలేదు.
హెచ్ఐవీ, ఎయిడ్స్ గురించి ప్రచారం అప్పుడే మొదలైంది. సెక్స్ వర్కర్లు కండోమ్‌లు వాడాలని పట్టుబట్టటం మొదలుపెట్టారు. జనం కండోమ్‌ల గురించి మాట్లాడారు. కానీ నెలసరి గురించి మాట్లాడేవాళ్లు కాదు.
నా స్నేహితురాలు ఒకామె ఎన్జీఓ సంగ్రామ్ ప్రతినిధి మీనా శేషుతో కలిసి కొన్ని రోజులు బయటకు వెళ్లింది. ఆమెకు నెలసరి వచ్చినపుడు స్కర్టు సాయంతో దానిని దాచటానికి ప్రయత్నం చేసింది. అది చూసి మీనా షాక్ తింది. అలా అప్పుడు.. నెలసరి రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీనా మాకు బోధించింది.
సెక్స్ వర్కర్ల సమస్యల గురించి అవగాహన విస్తరించటం మొదలైంది. మా పరిధికి బయట ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాం. శానిటరీ ప్యాడ్లు వాడటం ప్రారంభించాం.
1997లో సాంగ్లీ, సతారా, కొల్హాపూర్లతో పాటు కర్ణాటకలోని రెండు జిల్లాల్లో సంగ్రామ్ ఒక సర్వే నిర్వహించింది. ఆ సమయంలో ఐదు వేల మందికి పైగా మహిళలు ఈ వృత్తిలో ఉండేవాళ్లు. వాళ్లు కండోమ్‌ల వాడకం కోసం పట్టుబట్టటం మొదలుపెట్టారు.
ఫొటో సోర్స్, Getty Images
ముట్టు ప్రశ్నేలేదు...
మేం ఒక సంస్థను ఏర్పాటు చేశాం. దాని పేరు 'వేశ్యా అన్యాయ్ ముక్తి పరిషత్'. ఇందుకు సంగ్రామ్ సాయం చేసింది.
మా ఆరోగ్యం బాగోగుల కోసం ప్రధానంగా ఈ సంస్థలు పనిచేశాయి. నేడు లైంగికంగా వ్యాప్తి చెందే వ్యాధులను నివారించటం కోసం మేం నూరు శాతం కండోమ్‌లు ఉపయోగిస్తున్నాం.
నెలసరి రోజుల్లో ముట్టు అనే దానిని మేం పట్టించుకోం. మేం నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటాం. మీరు ఈ ప్రాంతంలో తిరిగేటపుడు ఎవరైనా మహిళ జుట్టుకు బాగా నూనె పెట్టుకుని కనిపించిందంటే ఆమె రెస్ట్ తీసుకుంటుందని అర్థం. ఆ నాలుగు రోజులు వారికి జీతాలుండవు.
మేం మానసికంగా బాగా అలసిపోతాం. ఎవరైనా మహిళ విచారంగా కనిపిస్తే.. ఆమెను అనునయించటానికి ప్రయత్నిస్తాం.
మేం నెలసరిలో ఉన్నట్లయితే మా దగ్గరికి కస్టమర్లు రారు. ఒకసారి నాకు నెలసరి వచ్చినట్లు కూడా నాకు తెలియదు. అతడు అది చూసి ‘‘నాకెందుకు చెప్పలేదు? మా ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు’’ అంటూ కేకలు వేశాడు.
ఇప్పుడు చెప్పండి.. అతడు తన భార్య నెలసరిలో ఉన్నప్పుడు ఇలా కోరిక తీర్చుకుంటాడు. మరి ఆమెకు నెలసరి సమయంలో కోరికలు వస్తే ఏం చేయాలి? ఆమె ఎక్కడికి వెళ్లాలి?
ఈ సహజ ప్రక్రియ గురించి మగాళ్లకు చాలా అపోహలున్నాయి. మొత్తం సమాజమంతా ఇదే ఆలోచనాతీరు పాతుకుపోయి ఉంది.
ఇదంతా దేవుడి సృష్టి అని అంటాం. ఇది దేవుడి సృష్టి అయితే ఆడవాళ్లను నెలసరి రోజుల్లో గుళ్లలోకి ఎందుకు రానివ్వరు? నేను మాత్రం నెలసరి రోజుల్లో గుడికి వెళ్తాను. అక్కడే సేద తీరుతాను.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)