అభిప్రాయం: గ్రామీణ భారతంలో ప్రభుత్వ చట్టాల కన్నా కుల ఆధిపత్యానికే పవర్ ఎక్కువ!

  • మార్టిన్ మక్వాన్
  • దళిత హక్కుల కార్యకర్త
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో హత్యకు గురైన యువకుడు

గుజరాత్‌లో భావ్‌నగర్ జిల్లాలోని టీంబా అనే గ్రామంలో గుర్రం ఎక్కాడన్న కారణంతో ఓ దళిత యువకుడినికొందరు హత్య చేశారు. అంతకు ముందే గుర్రం ఎక్కవద్దంటూ ఆ యువకుడికి బెదిరింపులు వచ్చాయని మృతుడి తండ్రి చెప్పారు.

అసలు దళితులపై ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి? క్షేత్ర స్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? వీటిపై దళిత హక్కుల కార్యకర్త, నవ్‌సర్జన్ వ్యవస్థాపకుడు మార్టిన్ మక్వాన్ బీబీసీ కోసం రాసిన 'అభిప్రాయం' ఇది...

..................

అతడి పేరు ప్రదీప్ రాథోడ్. అతడిక లేడు. వయసు 21 ఏళ్లు. పదో తరగతితోనే చదువు ఆపేశాడు. సొంతంగా తనకో గుర్రం ఉండాలన్నది అతడి కాంక్ష.

దళితుడినైన తాను కూడా సొంతంగా ఒక గుర్రం కలిగివుండగలనని తన గ్రామంలోని క్షత్రియులకు తెలియజెప్పటం అతడి ఉద్దేశం కాదు. అతడికి గుర్రం అంటే చాలా ఇష్టం. మంచి శిక్షకుడు కూడా.

ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన ప్రదీప్‌కి అతడి తండ్రి రూ. 30,000 ఖర్చు చేసి ఓ గుర్రం కొనిచ్చాడు. కానీ ఆ గుర్రాన్ని అమ్మేస్తే అతడికి మంచిదని ఊళ్లోని క్షత్రియులు గత వారంలో మరోసారి ఆ తండ్రిని హెచ్చరించారు.

ఎందుకంటే.. క్షత్రియులకు - అందరికీ కాకపోయినా - గుర్రం అనేది వారి జాతి గర్వం. ఒక దళితుడి దగ్గర గుర్రం ఉండటం వారికి అవమానంగా, నేరంగా భావించారు. మీసాలు కూడా కలిగి ఉన్న ప్రదీప్‌ను నిందితులు ఎలా చంపారో చూస్తే వారిలో క్రోధం, ద్వేషం ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. (గతంలో మీసాలు కలిగి ఉన్న కారణంగా కూడా ఓ దళిత యువకుడిపై దాడి జరిగింది. - సంపాదకుడు)

నిందితుల దాడిని ఎదుర్కోవటానికి ప్రయత్నించిన ప్రదీప్ అరచేతుల మీద కోతల గుర్తులున్నాయి. అతడి తల వెనుక భాగం.. శరీరం నుంచి పూర్తిగా వేరుపడి మెడకు వేలాడుతోంది.

ఇంత క్రూరత్వం ఎందుకు? ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ చట్టాల కన్నా కుల చట్టాలే బలమైనవి. వాటిదే ఆధిపత్యం. ఆస్పత్రిలో నేను ఆ యువకుడి తండ్రి దగ్గర కూర్చుని ఉన్నపుడు నా మది మొత్తం సుప్రీంకోర్టు ఆలోచనతో నిండిపోయింది.

స్వాతంత్ర్యానంతరం దేశ జనాభాలో ఐదో వంతు మంది ఉన్న దళితులకు, అంటరానివారికి, అణచివేతకు గురైన వారికి.. న్యాయం పొందేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం న్యాయవ్యవస్థ.

(ఎస్సీ, ఎస్టీలపై) అత్యాచారాల నిరోధక చట్టాన్ని అమాయక పౌరులను వేధించటానికి దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తులూ వీసమెత్తు సందేహమైనా లేకుండా చేసిన వ్యాఖ్యానం.. దళితులకు శరాఘాతమైంది. ఇప్పుడు ఈ కేసు కూడా బూటకపు కేసే అవుతుందా?

ప్రదీప్ కుటుంబానికి సంఘీభావంగా నిలవటానికి భావ్‌నగర్ సివిల్ హాస్పిటల్‌కు వస్తున్న జనం ద్వారా నాకు తెలిసింది. దళితులు ఎంతగా వివక్షాపూరిత దాడులకు గురైనా కానీ వారు ఫిర్యాదు చేసే సాహసం చేయలేని గ్రామాలు ఈ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి.

ఈ జిల్లాలో సుమారు 40 అట్రాసిటీ కేసుల్లో శిక్షలు ఖరారయ్యేలా నవ్‌సర్జన్ చేయగలిగింది. అయినా ఇది స్వల్పమేనని మేం భావిస్తున్నాం.

ప్రదీప్ తండ్రి ఎస్పీని ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు: నిందితులందరినీ అరెస్ట్ చేయండి.. అప్పుడు నా కుమారుడి మృతదేహాన్ని నేను స్వీకరిస్తాను. భూమి కోసం డిమాండ్ చేయాలని కొందరు నాయకులు ఆ తండ్రి మీద ఒత్తిడి తేవటానికి ప్రయత్నించారు.

కానీ ఆయన చలించలేదు. ఆయన కొద్దిపాటి భూమి కోసం తన 21 ఏళ్ల కుమారుడిని పోగొట్టుకోలేదు. అందుకే న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ అట్రాసిటీ కేసులో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ పరిహారం కింద రూ. 4,15,000 చెక్కుతో సాంఘిక సంక్షేమ విభాగం అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. కానీ ఆ డబ్బును అంగీకరించటానికి ఆ తండ్రి తిరస్కరించటం నేను చూశాను.

చివరికి.. ఆరు గంటల నిరీక్షణ తర్వాత.. నిందితులైన ముగ్గురినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు మాకు తెలిపారు. అప్పుడు మృతదేహాన్ని తండ్రి స్వీకరించారు.

ఆ యువకుడి శరీరాన్ని సమాధి చేయాలని మా సమాజం నిర్ణయించింది. అంతిమయాత్రలో మా సమాజంతో పాటు ఆ గుర్రం కూడా కలిసి సాగుతుంది.. స్వేచ్ఛాయుత పౌరులుగా జీవించకుండా ఎవరూ భయపెట్టలేరనే సందేశం ఇవ్వటానికి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)