ప్రెస్ రివ్యూ: కేంద్రంపై తిరుగుబాటుకు చంద్రబాబు పిలుపు!

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన ప్రధాని మోదీపై తిరుగుబాటు చేయాలని సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారని 'సాక్షి' పేర్కొంది.

బ్రిటిష్‌ వారిపై, నిజాంపై పోరాటం చేశామనీ, అలాగే కేంద్ర ప్రభుత్వంపైనా పోరాడాలని ఉద్బోధించారు.

గతంలో ఎన్టీఆర్‌ను బర్తరఫ్‌ చేసినప్పుడు, తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకూ పోరాడామని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మనం అడిగేది న్యాయమైన కోరికలని, ధర్మ పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు.

రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత ఐదు కోట్ల ఆంధ్రులపై ఉందన్నారు.

మన పొట్టకొట్టే అధికారం వారికి (కేంద్రానికి) ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేంద్రంతో విభేదిస్తే జైలుకు పోతామని కొందరు భయపెడుతున్నారని, తాను నిప్పులాగా ఉన్నానని, ఎవరికీ భయపడనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 1

పోస్ట్ of Twitter ముగిసింది, 1

హెచ్‌సీయూ వీసీ అప్పారావు హత్యకు కుట్ర?

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఉపకులపతి అప్పారావును హతమార్చేందుకు కుట్ర పన్నిన ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారని 'ఈనాడు' పేర్కొంది.

పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేశరపల్లికి చెందిన ఎ. పృథ్వీరాజ్‌ (27) విజయవాడలోని సిద్ధార్థ లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ నాలుగో ఏడాది చదువుతున్నారు.

హెచ్‌సీయూ స్కాలర్‌ చందన్‌కుమార్‌ మిశ్రాది (28) పశ్చిమ బెంగాల్‌.

హెచ్‌సీయూలో రోహిత్‌ వేముల ఆత్మహత్యకు వీసీదే బాధ్యత అని, ఆయనను హత్య చేసి వేలాది మంది విద్యార్థులను మావోయిస్టు పార్టీలో చేర్చుకునేలా ప్రణాళిక రచించారు.

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌, కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న దిశానిర్దేశం మేరకు వీరు ఈ కుట్ర పన్నారు.

నిఘా వర్గాల సమాచారంతో శుక్రవారం రాత్రి పృథ్వీరాజ్‌, చందన్‌లను భద్రాచలం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు.

అయితే, పోలీసులు రెండు రోజుల కిందట కేసరపల్లికి మఫ్టీలో వచ్చి.. వారిని బలవంతంగా తీసుకెళ్లారని ఏపీ, తెలంగాణ పౌర హక్కుల సంఘాలు ఆరోపించాయి.

మావోయిస్టుల నుంచి తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదు. తనను చంపేందుకు ఎవరు కుట్ర చేశారో కూడా తెలియదని హెచ్‌సీయూ వీసీ అప్పారావు అన్నారని ఈనాడు తెలిపింది.

ఫొటో క్యాప్షన్,

కోదండరామ్

కోదండరాం పార్టీ పేరు.. తెలంగాణ జన సమితి

తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న పార్టీ పేరు 'తెలంగాణ జన సమితి'గా ఖరారైందని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

ఈ పేరుకు ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. పార్టీ పేరును సోమవారం (ఈ నెల 2న) కోదండరాం స్వయంగా ప్రకటించనున్నారు. పార్టీ జెండా, కండువాను ఈ నెల 4న ఆవిష్కరిస్తారు.

పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 29న నిర్వహించాలని నిర్ణయించారు. సరూర్‌నగర్‌ క్రీడా మైదానంలో సభ నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ను కోదండ సన్నిహితులు శనివారం కలిశారు.

పార్టీ జెండాను ప్రజలే ఎంపిక చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఇక నుంచి ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు!

తెలంగాణలో ఎక్కడ అయినా రేషన్ సరుకులు తీసుకునేలా రూపొందించిన పోర్టబిలిటీ విధానం ఆదివారం (ఈ రోజు) నుంచి అమలులోకి వస్తోందని 'నమస్తే తెలంగాణ' ఓ కథనంలో పేర్కొంది.

దీంతో ఏ జిల్లాలో ఉన్నా, ఎక్కడ నివసిస్తున్నా.. రాష్ట్రంలోని ఏ రేషన్‌ షాపులోనైనా సరుకులు తీసుకోవచ్చు.

ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

కార్డుదారులు చిరునామా, రేషన్ దుకాణం మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

కార్డుపై పేరున్న కుటుంబసభ్యులు ఇకపై వారికి నచ్చిన ప్రాంతాల్లో వేర్వేరుగా కూడా సరుకులు తీసుకోవచ్చు.

రేషన్‌ కార్డు లేదా ఆధార్ కార్డు నంబర్ చెప్పి సరుకులు పొందవచ్చని, ప్రతి నెలా సరుకులు తీసుకోకున్నా కార్డు తొలిగించబోమని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)