బిహార్: మత ఘర్షణల కేసులో కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే కుమారుడి అరెస్ట్

  • మనీష్ శాండిల్య
  • బీబీసీ కోసం
అర్జిత్ అరెస్ట్

బిహార్ రాజధాని పట్నాలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే కుమారుడు, బీజేపీ నేత అర్జిత్ శాశ్వత్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు.

భాగల్‌పూర్‌లోని నాథ్‌నగర్ ప్రాంతంలో మత ఘర్షణలను రెచ్చగొట్టిన కేసులో అర్జిత్ నిందితుడిగా ఉన్నారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలంటూ మార్చి 24న కోర్టు వారంట్ జారీ చేసింది.

పట్నా జిల్లా సీనియర్ ఎస్‌పీ మను మహారాజ్ బీబీసీతో మాట్లాడుతూ ఆయన అరెస్టును ధ్రువీకరించారు. "రాత్రి ఒంటి గంట సమయంలో అర్జిత్‌ను పట్నాలోని గోలంబర్ వద్ద అరెస్ట్ చేశాం. తదుపరి చర్యల కోసం పోలీసులు ఆయనను భాగల్‌పూర్‌కు తీసుకెళ్తారు" అని ఆయన చెప్పారు.

నిజానికి అర్జిత్‌ను మార్చి 25 నాడే అరెస్ట్ చేయాల్సింది. ఆ రోజు పట్నా రోడ్లపై జరిగిన 'రామ నవమి' ఊరేగింపులో అర్జిత్ పాల్గొనడమే కాదు, మీడియాతో కూడా మాట్లాడారు. అయినా పోలీసులు అరెస్ట్ చేయలేదన్న విమర్శలున్నాయి.

సరెండర్ అయ్యానంటున్న అర్జిత్

అయితే అరెస్టుకు కాస్త ముందు అర్జిత్ మీడియాతో మాట్లాడుతూ, కోర్టు అదేశాలను గౌరవిస్తూ తాను సరెండర్ అయ్యానని చెప్పారు.

"నాపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవు. నేను పూజ కోసం హనుమాన్ మందిరానికి వచ్చాను. ఆ తర్వాత నేను సరెండర్ అయ్యాను. నాకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించిందన్న విషయం నాకు సాయంత్రమే తెలిసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలను గౌరవించడమే ఉచితం అని నాకనిపించింది" అని అర్జిత్ అన్నారు.

నాథ్‌నగర్‌లో పోలీసులు తీసుకున్న చర్యలపై అర్జిత్ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కొంత మంది 'జై శ్రీరాం' అనే నినాదాలు కూడా చేశారు.

శనివారం (మార్చి 31) నాడు భాగల్‌పూర్‌లోని ఓ కోర్టు అర్జిత్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఫొటో క్యాప్షన్,

మార్చి 17న భాగల్‌పూర్‌లో బీజేపీ నిర్వహించిన ఓ ఊరేగింపుకు అర్జిత్ నేతృత్వం వహించారు.

ఇంతకూ అసలు వివాదమేంటి?

హిందూ నూతన సంవత్సరం సందర్భంగా మార్చి 17న భారతీయ జనతా పార్టీ భాగల్‌పూర్‌లోని సాండిస్ కాంపౌండ్ నుంచి ఓ శోభా యాత్ర నిర్వహించింది. దానికి అర్జిత్ నాయకత్వం వహించారు.

ఈ ఊరేగింపుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఊరేగింపు భాగల్‌పూర్‌లోని నాథ్‌నగర్‌కు చేరుకోగా, ఒక అసభ్యకరమైన పాట విషయంపై రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తి అది రాళ్లు రువ్వుకోవడం, దహనకాండ, హింసలకు దారి తీసింది.

ఇందులో ఒక పోలీసు కానిస్టేబుల్ సహా కొంత మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్‌ నమోదు కాగా, అర్జిత్ సహా మరో పది మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.

ఆ తర్వాత కోర్టు ఆర్జిత్ సహా మొత్తం పది మందినీ అరెస్ట్ చేయాలంటూ వారంట్లు జారీ చేసింది.

ఫొటో క్యాప్షన్,

నాథ్‌నగర్‌లో రెండు సముదాయాల మధ్య హింస జరిగింది.

అర్జిత్ అరెస్ట్ విషయంపై గత కొద్ది రోజులుగా బిహార్‌లో రాజకీయ వర్గాల్లో చర్చ వేడెక్కింది. అరెస్ట్‌లో ఆలస్యం పట్ల ఓవైపు ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా, మరోవైపు పాలక కూటమిలో కూడా విభేదాలు తలెత్తాయి.

అర్జిత్ తండ్రి అశ్వినీ చౌబే తన కుమారుడు నిర్దోషి అని అంటూ, ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను 'ఓ చెత్త కాగితం'గా అభివర్ణించారు.

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సహా మరి కొందరు బీజేపీ నేతలు అర్జిత్‌కు మద్దతుగా ముందుకొచ్చారు. కాగా, అధికార కూటమిలో భాగమైన జనతాదళ్ యునైటెడ్ మాత్రం బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేయడం పట్ల అభ్యంతరం వెలిబుచ్చింది. చట్టాన్ని గౌరవించాలనీ, కూటమి ధర్మాన్ని పాటించాలని హితవు పలికింది.

అయితే, బిహార్‌లో ఇప్పటికే మొదలైన రాజకీయ వేడి అర్జిత్ అరెస్ట్ తర్వాత కూడా చల్లారే సూచనలు లేనట్టు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)