ఇస్రో: జాడలేని జీశాట్ - 6ఏ ఉపగ్రహం

ఉపగ్రహం

మార్చి 29న ప్రయోగించిన జీశాట్- 6ఏ ఉపగ్రహంతో తమకు సంబంధాలు తెగిపోయినట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) వెల్లడించిందని 'పీటీఐ' వార్తా సంస్థ పేర్కొంది.

మార్చి 31న రెండో కక్ష్యలోకి ప్రవేశపెట్టే ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, ఆ తర్వాత మూడో కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో దానితో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

"ఆ ఉపగ్రహంతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని తెలిపింది.

నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌08 వాహక నౌక (రాకెట్) ద్వారా జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని మార్చి 29వ తేదీన ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

సాధారణంగా ఉపగ్రహాన్ని ఒక కక్ష్య నుంచి మరో కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రతిసారీ ఆ విషయాన్ని ఇస్రో తన వెబ్‌సైట్‌లో పెడుతుంది. అలా జీశాట్-6ఏ గురించి మార్చి 30న ఉదయం 9.22కి పేర్కొంది. ఆ తర్వాత ఎలాంటి వివరాలనూ వెల్లడించలేదు.

ఈ ఉపగ్రహం బరువు 2,140 కిలోలు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ మెరుగైన మొబైల్ కమ్యూనికేషన్ సేవలు అందించే లక్ష్యంతో దీన్ని ప్రయోగించారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)