దక్షిణ కర్ణాటకలో మత ఛాందసవాదానికి కారణాలు ఏమిటి?

  • సల్మాన్ రావి
  • బీబీసీ ప్రతినిధి
వీహెచ్‌పీ కార్యకర్తలు (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ కర్ణాటకలో మతాల మధ్య ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి?

మంగళూరు ప్రాంతంలో ఛాందసవాదంతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు దాదాపు అన్ని వర్గాలపైనా ఉన్నాయి. ఎక్కువగా హిందుత్వ సంస్థలపైనే ఉన్నాయి. శ్రీరామ్ సేన, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) లాంటి సంస్థలపై ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.

ఛాందసత్వాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, 'లవ్ జిహాద్', 'ల్యాండ్ జిహాద్'లకు పాల్పడుతున్నాయని ముస్లిం సంస్థలపై.. మత మార్పిళ్లు చేస్తున్నాయని క్రైస్తవ సంస్థలపై ఆరోపణలు ఉన్నాయి.

ప్రతి మత సంస్థా ఇతర మతాలకు చెందిన సంస్థలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూనే ఉంది. దీనివల్ల ఇక్కడ విభజన రేఖలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గుజరాత్‌తో పోలిస్తే కర్ణాటకలో ముస్లిం జనాభా చాలా ఎక్కువ

దక్షిణ కర్ణాటక తీర ప్రాంతంలో మత ఘర్షణలకు చాలా చరిత్రే ఉంది.

ఇవి 1960ల్లో మొదలయ్యాయని స్థానిక చరిత్రకారులు కొందరు చెబుతారు. మరికొందరు చరిత్రకారులేమో ఇవి అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ 1975-77) కాలంలో మొదలయ్యాయని పేర్కొంటారు.

ఆవును చంపేవారిపై దాడులు 1960ల్లో ప్రారంభమయ్యాయని చరిత్రకారులు చెబుతారు. ఈ సమయంలోనే దక్షిణ కర్ణాటక తీర ప్రాంతంపై విశ్వ హిందూ పరిషత్ ప్రాబల్యం పెంచుకొంది. అప్పుడే హిందూ యువసేన, హిందూ జాగరణ వేదిక ఏర్పాటయ్యాయి.

2002 గుజరాత్ అల్లర్ల తర్వాత ఈ ప్రాంతంలో బజరంగ్ దళ్ చాలా శక్తిమంతమైంది. గుజరాత్‌తో పోలిస్తే కర్ణాటకలో ముస్లిం జనాభా చాలా ఎక్కువ.

2011 జనగణన ప్రకారం కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 35 నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంది.

మంగళూరులో క్రైస్తవ జనాభా అధికం. అందుకనే మంగళూరును 'రోమ్ ఆఫ్ సౌత్ ఇండియా' అని పిలుస్తారు.

ఛాందసత్వానికి ప్రయోగశాలగా తీర ప్రాంతం

దక్షిణ కర్ణాటక తీర ప్రాంతంలో మతం పేరిట పోటీ నెలకొని ఉంది. ఛాందసత్వానికి ఈ ప్రాంతం ఒక ప్రయోగశాలగా మారిపోయింది.

కొన్ని చోట్ల ఆలయాలు, బౌద్ధ ఆరామాల మధ్య ఆధిపత్య పోరు ఉంది. మరికొన్ని చోట్ల షియాలు, సున్నీల మధ్య, లేదా ఎహ్లే హాదీలు, వాహబీల మధ్య ఆధిపత్య పోరాటం ఉంది. మసీదులపై ఆధిపత్యం కోసం నెలకొన్న పోరు ఘర్షణలకు దారితీసి, అనేక మంది యువకులు ఆస్పత్రుల పాలయ్యారు.

మంగళూరులో గతంలో వినాయక్ బలిగ అనే సమాచార హక్కు(ఆర్‌టీఐ) కార్యకర్త హత్యకు గురయ్యారు. ఇటీవల ఆయన సోదరి వర్షను కలిశాను.

వినాయక్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు దాఖలు చేసేవారని, ఒక రోజు తమ ఇంటి ముందే ఆయన హత్యకు గురయ్యారని వర్ష చెప్పారు. ఒక ఆలయానికి సంబంధించిన ఆదాయవ్యయ వివరాలు చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద తన సోదరుడు దరఖాస్తు చేశారని, ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన హత్యకు గురయ్యారని ఆమె వివరించారు.

తన సోదరుడికి భారతీయ జనతా పార్టీతో సంబంధాలు ఉండేవని, ఆయన్ను హత్య చేసిన వారికి కూడా అదే పార్టీతో సంబంధాలు ఉన్నాయని వర్ష పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మంగళూరును 'రోమ్ ఆఫ్ సౌత్ ఇండియా' అంటారు

నరేంద్ర నాయక్ అనే సామాజిక కార్యకర్తను కూడా ఛాందసవాదులందరూ లక్ష్యంగా చేసుకున్నారు. వారికి వ్యతిరేకంగా ఆయన గళమెత్తుతుండటమే దీనికి కారణం. ప్రస్తుతం స్థానిక అధికార యంత్రాంగం ఆయనకు వ్యక్తిగత భద్రతను ఏర్పాటు చేసింది.

తమ కుటుంబానిది బ్రాహ్మణ వర్గమని, తమ కుటుంబం పూర్వం గోవా నుంచి మంగళూరుకు పారిపోయి వచ్చిందని నరేంద్ర నాయక్ బీబీసీతో చెప్పారు. అప్పట్లో పోర్చుగీసు సైన్యం గోవాలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడంతో తాము అక్కడి నుంచి పారిపోయి మంగళూరు చేరుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అక్కడే ఉండిపోయినవారు క్రైస్తవంలోకి మారాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, సంస్కృతి మార్చుకోలేదనే కారణంతో వారిని క్రైస్తవులుగా గుర్తించలేదని, దీంతో వారు కూడా తర్వాత అక్కడి నుంచి వచ్చేశారని తెలిపారు.

నరేంద్ర నాయక్ తనను తాను నాస్తికుడిగా చెప్పుకొంటారు. మంగళూరులో ఆయనకు చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ప్రముఖ హేతువాది గౌరీ లంకేశ్ హత్య జరిగినప్పటి నుంచి నరేంద్ర నాయక్‌కు అధికార యంత్రాంగం ఇద్దరు సాయుధ పోలీసు సిబ్బందితో నిరంతర భద్రత కల్పిస్తోంది.

'దళితులు, ఓబీసీలపై వీహెచ్‌పీ ప్రభావం'

విశ్వ హిందూ పరిషత్ దళితులు, ఇతర వెనకబడిన తరగతుల(ఓబీసీ) ప్రజల్లోకి వెళ్లిందని, వారిని ప్రభావితం చేసిందని నరేంద్ర నాయక్ చెప్పారు.

1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొనేందుకు దక్షిణ కర్ణాటక నుంచి వెళ్లిన స్వచ్ఛంద కార్యకర్తలు దళితులు, ఓబీసీలేనని, 'అగ్రవర్ణాలు'గా చెప్పే కులాలలకు చెందినవారు మంగళూరులోనే అరెస్టయ్యారని ఆయన తెలిపారు.

పరిస్థితులు హింసాత్మకంగా మారినప్పుడుల్లా వీహెచ్‌పీ లాంటి సంస్థలు దళితులు, ఓబీసీ కార్యకర్తలను ముందు వరుసలో పెడుతుంటాయని ఆరోపించారు.

మంగళూరులోని ఒక పబ్‌లో జరిగిన దాడి(2009) కేసులో నిందితులందరిని న్యాయస్థానం మార్చి నెల ప్రారంభంలో నిర్దోషులుగా ప్రకటించింది. వీరిలో శ్రీరామ్ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రమోద్ ముతాలిక్, శ్రీరామ్ సేన అధినేత

'కేరళలోని ఇస్లామిక్ సంస్థలకు అరబ్ దేశాల నుంచి నిధులు'

విశ్వ హిందూ పరిషత్‌కు చెందిన జగదీశ్ షెనాయ్‌తో బీబీసీ మాట్లాడింది. ''తీర ప్రాంత కర్ణాటకను ఛాందసవాద ప్రయోగశాలగా ఎందుకు పిలుస్తారు'' అని అడగ్గా- అసలు అలాంటిదేమీ లేదని ఆయన బదులిచ్చారు.

దక్షిణ కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి జిల్లాలకు ఎగువన భత్కల్ ప్రాంతంలో ఇస్లామిక్ తీవ్రవాదం వ్యాప్తి చెందుతోందని జగదీశ్ షెనాయ్ పేర్కొన్నారు. మంగళూరు ప్రాంతానికి దిగువన ఉత్తర కేరళలో కాసర్‌గోడ్ అనే ప్రాంతం ఉందని, అరబ్ దేశాల నుంచి ముస్లింలు అక్కడికి నిధులు పంపిస్తున్నారని, ఈ నిధులతోనే స్థానికంగా ఇస్లామిక్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

కర్ణాటక దక్షిణ తీర ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ లేకపోతే ఇక్కడ అమ్మాయిలకు రక్షణే ఉండేది కాదని జగదీశ్ షెనాయ్ వ్యాఖ్యానించారు. ''ఈ ప్రాంతం లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌లకు కేంద్రంగా మారుతోంది. మేం దీనిని వ్యతిరేకిస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

ఈ ప్రాంతంలో ఇటీవల చర్చిల మీద జరిగిన దాడులపై ప్రశ్నించగా, ఆయన మౌనం దాల్చారు.

'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)', మరికొన్ని ఇస్లామిక్ సంస్థలపై ఇస్లామిక్ ఛాందసవాద సంస్థలనే ఆరోపణలు ఉన్నాయి.

సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ మొహమ్మద్ ఇలియాస్ తుంబే మాట్లాడుతూ- ఇస్లామిక్ సంస్థలను సంఘ్ పరివార్ కావాలనే అప్రతిష్ఠపాల్జేస్తోందని ఆరోపించారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ లేదా బీఫ్ జిహాద్ లాంటి మాటలు సంఘ్ పరివార్ నిఘంటువులో మాత్రమే ఉంటాయని, వీటితో యువతను ప్రభావితం చేసి, ఉద్రిక్త వాతావరణాన్ని సంఘ్ పరివార్ సృష్టిస్తోందని పేర్కొన్నారు.

ఇటీవల ఒక మాల్ ముందు హిందూ యువకులతో మాట్లాడుతున్నందుకు కొందరు ముస్లిం అమ్మాయిలపై ఆగంతకులు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు యువకులపై అభియోగాలు నమోదయ్యాయి.

కర్ణాటక అసెంబ్లీకి మే 12న ఎన్నికలు జరుగనున్నాయి. కులం, మతం పేర్లతో ఓటర్లను చీల్చేందుకు అన్ని పార్టీలూ యత్నిస్తున్నాయి. సామాన్య జనంలో అత్యధికులు మాత్రం శాంతి, సామరస్యాలనే కోరుకొంటున్నారు.

ఓవైపు కర్ణాటక దక్షిణ తీర ప్రాంతంలో వివిధ సంస్థలు ఛాందసవాద వ్యాప్తికి యత్నిస్తుండగా, మరోవైపు ఐదు దశాబ్దాలుగా శాంతి కోసం ప్రయత్నాలు కొనసాగుతుండటం సానుకూల అంశం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)