పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో పెట్రోల్ ధర నాలుగేళ్ల గరిష్ఠానికి చేరగా డీజిల్ ధర కూడా అత్యధిక స్థాయికి చేరింది.
దేశ రాజధాని దిల్లీలో ఏప్రిల్ 1న పెట్రోల్ ధర రూ.73.73గా ఉండగా, డీజిల్ ధర రూ.64.58గా ఉంది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన సమయంలో, అంటే 2014 సెప్టెంబర్ 14 తర్వాత పెట్రోల్ ధరలు ఇంతగా పెరగడం ఇదే తొలిసారి.
గత నాలుగేళ్లుగా ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. కానీ ఆ ప్రయోజనం ప్రజలకు చేరడం లేదు.
ఇక ఇప్పుడు ముడి చమురు ధర క్రమంగా పెరుగుతుండటంతో జనం చేతి చమురు వదులుతోంది.
ఏప్రిల్ 1న పెట్రోల్ ధరలు
పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావం ప్రజలపై పడకుండా ఎక్సైజ్ పన్ను తగ్గించాలని ఈ ఏడాది ప్రారంభంలో ఆర్థిక శాఖను పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరింది.
కానీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ ప్రతిపాదనను పెద్దగా పట్టించుకోకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారు.
మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధర రూ. 2.32 పైసలు పెరిగింది.
2014 మేలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.41 ఉండగా, 2018 ఏప్రిల్ 1న ఇది రూ. 73.73కి చేరింది. ఇది నాలుగేళ్ల గరిష్ఠ ధర.
ఫొటో సోర్స్, Bloomberg/Getty Images
చమురు ధరల పెరుగుదలపై విపక్షాలు మోదీ ప్రభుత్వానికి చురకలు అంటించాయి.
మొదట ఈ వార్త 'ఏప్రిల్ ఫూల్స్ డే' జోక్ అనుకున్నామని, కానీ ఇది నిజమేనని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
కేంద్రం మాటల సర్కారే గానీ చేతల ప్రభుత్వం కాదని మమతాబెనర్జీ విమర్శించారు. చమురు ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు.
'మోదీ చెప్పిన అచ్చేదిన్ కన్నీటితో నిండిపోయాయి. సామాన్యులను ఇబ్బందిపెట్టిన ప్రభుత్వంగా మోదీ సర్కార్ నిలిచిపోతుంది' అని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ కార్యదర్శి అశోక్ గెహ్లెత్ అన్నారు.
దక్షిణాసియాలో పెట్రోల్, డీజిల్‌పై అత్యధిక పన్నులు వేస్తున్నది భారతదేశమే. లీటర్ పెట్రోల్ ధరలో సగం వరకు ఈ పన్నులే ఉన్నాయి.
ముడి చమురు ధరలు తగ్గినప్పుడల్లా, 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య జైట్లీ తొమ్మిదిసార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచారు.
కానీ ఒక్కసారి మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. గత ఏడాది అక్టోబర్‌లో లీటర్‌కు రూ.2 చొప్పున తగ్గించారు.
ఫొటో సోర్స్, Getty Images
పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమేంటి?
ఎక్సైజ్ డ్యూటీ: భారత్‌లో పెట్రోల్ ధరలు అధికంగా ఉండటానికి ఎక్సైజ్ పన్నులే ప్రధాన కారణం. దక్షిణాసియాలో భారత్‌లోనే ఎక్సైజ్ సుంకం అధికంగా ఉంది. చమురు ధరల్లో సగం వరకు ఎక్సైజ్ పన్ను ఉంటోంది.
వ్యాట్: కేంద్రం వడ్డించే ఎక్సైజ్ సుంకానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను-వ్యాట్ వసూలు చేస్తున్నాయి. ఈ పన్ను తగ్గించాలని కేంద్రం విజ్ఞప్తి చేసినా, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలు తగ్గించలేదు.
అధిక డిమాండ్ : పెట్రోల్ ధరలు పెరుగుతున్నా దానికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
జీఎస్టీ కిందికి ఎందుకు తీసుకురావడం లేదు?: చమురు ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.
రెట్టింపు ఆదాయం: ఎక్సైజ్ పన్ను పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వానికి రెట్టింపు ఆదాయం లభించింది. 2014-15లో రూ. 99,000 కోట్లు ఉన్న ఈ ఆదాయం 2016-17లో రూ. 2,42,000 కోట్లకు చేరింది.
ఫొటో సోర్స్, Getty Images
పెట్రోల్ ధరను ఇలా పెంచేస్తున్నారు!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గితే మనదేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. కానీ అలా జరగడం లేదు. పైగా ధరల మోత మోగుతోంది.
విపక్షాలు గగ్గోలుపెడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. చమురు కంపెనీలకు పెత్తనం అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న ఆరోపణలు ఉన్నాయి.
అంటే ఎలాంటి పన్నులు లేకుంటే డీలర్ లాభం లీటర్‌కు రూ.5 అనుకున్నా లీటర్ పెట్రోల్ రూ.36లోపే ఉంటుంది.
కానీ ఇక్కడే అసలు కిరికిరి ఉంది. ఈ ధరకు ఎక్సైజ్ పన్ను, వ్యాట్ కలిపి కేంద్ర, రాష్ట్రాలు వినియోగదారుడి నడ్డి విరుస్తున్నాయి.
ఇవన్నీ కలిపితే దిల్లీలో లీటర్ పెట్రోల్ అమ్మకం ధర 70.38పైసలు (2017 సెప్టెంబర్ 14 నాటి ధర) అవుతోంది.
ఇందులో ఎక్సైజ్ సుంకం కేంద్రం, వ్యాట్ ద్వారా వచ్చే డబ్బులు రాష్ట్రాల ఖజానాకి చేరుతుంది.
కేంద్ర, రాష్ట్రాలు ఎక్సైజ్ సుంకం, వ్యాట్ ఎత్తివేస్తే ప్రజలకు 40 రూపాయల లోపే లీటర్ పెట్రోల్ అందుబాటులో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)