పశ్చిమ బెంగాల్‌ మతఘర్షణలకు రామనవమి పాటలే కారణమా?

  • అమితాబ్ భట్టశాలి, దిల్‌నవాజ్ పాషా
  • బీబీసీ ప్రతినిధులు
ఆసన్‌సోల్, రామనవమి, హింస

పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు జరిగిన ప్రాంతాలకు చెందిన కొందరు ముస్లింలు 'రామనవమి' ఉత్సవాలలో పెట్టిన పాటల వల్లే గొడవలు తలెత్తి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

రామనవమి ప్రదర్శనలపై రాళ్లు పడడం చూసిన కొందరు పోలీసు అధికారులు, జర్నలిస్టులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అసన్‌సోల్‌లోని చాంద్‌మారి ప్రాంతానికి చెందిన బబ్లూ బీబీసీతో మాట్లాడుతూ, ''రామనవమి ప్రదర్శన సాగుతుండగా, హఠాత్తుగా సౌండ్ సిస్టమ్‌ను లక్ష్యంగా చేసుకుని రాళ్ల వర్షం కురిసింది'' అని తెలిపారు.

మొదట రాళ్ల వర్షంతో ప్రారంభమైన గొడవ తర్వాత పూర్తి స్థాయి ఘర్షణలకు దారి తీసిందని చాంద్‌మారి స్థానికుడు ఉమాశంకర్ గుప్తా తెలిపారు.

గతవారం కొన్ని అల్లరిమూకలు ఆయన దుకాణాన్ని దగ్ధం చేయడంతో కొన్ని రోజులు ఆయన సహాయ శిబిరంలో తల దాచుకున్నారు.

రామనవమి ప్రదర్శనలో తీవ్రమైన, రెచ్చగొట్టే ధోరణిలో ఉన్న పాటలను పెట్టారని రాణిగంజ్‌కు చెందిన పోలీసు అధికారి, పేరు వెల్లడించడానికి ఇష్టపడని కొంతమంది జర్నలిస్టులు కూడా వెల్లడించారు.

బీబీసీ పరిశోధనలో రామనవమి సందర్భంగా పెట్టిన పాటలు ఎన్నో యూట్యూబ్‌లో లభించాయి. వాటిలో చాలా పాటలు పాకిస్తాన్‌పై విద్వేషాన్ని చిమ్ముతున్నాయి. అంతే కాకుండా - 'టోపీవాలాలు కూడా 'జై శ్రీరాం' అని నినదిస్తారు' అని ఆ పాటల్లో ఉంది.

''వాళ్లు ఏడాది పొడవునా రామనవమి వేడుకలు జరుపుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్లు పెడుతున్న పాటలు చాలా రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. మా మనోభావాలను దెబ్బ తీస్తున్నాయి'' అని ముసద్ది మొహల్లాకు చెందిన జుల్ఫికర్ ఆలీ తెలిపారు.

అయితే రామనవమి ఉత్సవాలలో అలాంటి పాటలు పెట్టారా లేదా అన్నది తనకు ఖచ్చితంగా తెలీదని పశ్చిమ బర్ధమాన్ జిల్లా బీజేపీ ప్రతినిధి ప్రశాంత చక్రబర్తి అన్నారు.

''అయినా ఆ పాటలు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. వాటి వల్ల ముస్లింలు బాధ పడాల్సిన అవసరం ఏముంది? '' అన్నారాయన.

దీనికి స్థానిక ముస్లిం యువకుడు ఖురేషీ, ''మేమేమైనా పాకిస్తాన్ పౌరులమా? ఇలాంటి పాటలను మా ప్రాంతంలో ఎందుకు పెడతారు?'' అని ప్రశ్నించారు.

ఫొటో క్యాప్షన్,

తన ఇంట్లో కాలిపోయిన వస్తువులను చూపుతున్న సోని దేవి

గ్రౌండ్ రిపోర్ట్

అసన్‌సోల్‌లో శ్రీనగర్ ప్రాంతానికి చెందిన సోని దేవి కాలిపోయిన తన ఇంటిని అందరికీ చూపుతూ, ''మా ఇల్లు మొత్తం బూడిదగా మారింది. మా ప్రపంచమంతా తలకిందులైపోయింది. పిల్లలను తీసుకుని ఎక్కడికి వెళ్లాలి? పిల్లల పుస్తకాలను కూడా వదలకుండా అన్నిటినీ తగలబెట్టారు'' అని మొర పెట్టుకుంటున్నారు.

ఆమె ఇంట్లో వస్తువులన్నీ బూడిదగా మారిపోయాయి. వాటిలో ఆమె బట్టలు కుట్టి తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ, చదివించుకోవడానికి ఉపయోగపడే కుట్టు మెషీన్ కూడా ఉంది.

మంగళవారం రామనవమి వేడుకల సందర్భంగా అసన్‌సోల్‌లోని శ్రీనగర్ ప్రాంతంలో ఉద్రిక్తత మొదలైంది. గొడవలు మొదలవగానే ప్రజలు ఇక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. సోని దేవి కూడా తన ఇద్దరు పిల్లలను తీసుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు.

అల్లర్లు జరిగిన రోజులను తల్చుకుంటూ ఆమె, ''నేను వంట చేస్తుండగానే ఇటుకలు పడడం ప్రారంభమైంది. అవి పిల్లలపై ఎక్కడ పడతాయో అని నాకు చాలా భయమేసింది. పిల్లలను తీసుకుని అక్కడి నుంచి ఎలా బయటపడ్డానో నాకే తెలుసు'' అన్నారామె.

'అంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది'

శ్రీనగర్‌కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఠాకూర్‌పూర్ ప్రాంతంలో సప్నా చౌదరి ఉమ్మడి కుటుంబం ఉంటోంది. అక్కడే వారి ఇల్లు, దుకాణం కూడా ఉన్నాయి.

మంగళవారం జరిగిన అల్లర్లతో బెదిరిపోయిన చౌదరి, తన కుటుంబసభ్యులతో కలిసి బందువుల ఇళ్లకు వెళ్లి తల దాచుకున్నారు.

రామనవమి మరుసటి రోజు అంటే బుధవారం, వాళ్ల ఇల్లు, దుకాణం తగలబడిపోయాయి. దుండగులు తగలబెట్టిన మోటర్ బైక్ ఇంకా ఆయన ఇంటి ముందే ఉంది. ఆయన ఇల్లు మొత్తం లూటీ చేశారు. తమతో పాటు తీసుకుపోలేకపోయిన వాటిని తగలబెట్టేశారు.

''గొడవలు జరిగాక, పోలీసులను భారీగా మోహరించారు. కానీ పోలీసులు అక్కడ ఉండగానే మా ఇంటిని తగలబెట్టారు. పోలీసులు తమాషా చూస్తూ నిలబడ్డారు'' అని చౌదరి తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

కిటికీలోంచి దూసుకుపోయిన తూటా

ఠాకూర్‌పాడా ముస్లింలు ఎక్కువగా ఉన్న గ్రామం. ఇక్కడ కేవలం పది పన్నెండు హిందూ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. నగరంలో గొడవల గురించి తెలిసిన వెంటనే అక్కడ ఉన్న హిందువుల కుటుంబాలు గ్రామం వదిలి వెళ్లిపోయాయి.

ఇక్కడ ఉండే స్థానిక ముస్లిం యువకుడు ఆందోళనకారులు కొన్ని హిందువుల కుటుంబాలను మాత్రం లక్ష్యంగా చేసుకున్నారని వివరించారు.

శ్రీనగర్ ప్రాంతంలో గత ఏడాది కూడా రామనవమి ఉత్సవాల సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఈసారి పూర్తి జాగ్రత్తలు తీసుకున్నా, ఘర్షణలు తప్పలేదు.

గొడవలకు అసలు కారకులెవరో ఎవరికీ తెలీదు.

ఈ ఏడాది రామనవమి ఉత్సవాలలో మొహమ్మద్ ఇస్లాం కూడా పాల్గొన్నారు. రామనవమి ప్రదర్శన సందర్భంగా అసన్‌సోల్ పరిసరాల్లో అనేక వదంతులు బయలుదేరాయి. ఆ వదంతుల భయంతో అనేక హిందూ, ముస్లిం కుటుంబాలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు.

ఇప్పుడిప్పుడే వాళ్లు మెల్లమెల్లగా తిరిగి వస్తున్నారు.

గొడవల గురించి వివరిస్తూ ఇస్లాం, ''రామనవమి ప్రదర్శన జరిగిన మరుసటి రోజు బుధవారం ఉదయం సుమారు పదిన్నర సమయంలో ఒక గుంపు తుపాకులు పట్టుకుని ముస్లింల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం ప్రారంభించింది. వాళ్లెవరో మాకు తెలీదు. కానీ వాళ్లు ఇక్కడి వాళ్లైతే కాదు.'' అని తెలిపారు.

ఇక్కడ ఓ ముస్లింల ఇంటిని ఇంటిని లక్ష్యంగా చేసుకుని కాల్చిన బుల్లెట్, వంటింటి కిటికీలోంచి దూసుకువెళ్లింది.

అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ ఎవరికి తగల్లేదు.

ఇప్పటివరకు శ్రీనగర్ ప్రాంతంలోని బీపీఎల్ కాలనీలో హిందూ ముస్లింలు కలిసి మెలిసి జీవించారు. కానీ గత కొన్నేళ్లుగా దేశంలో రెండు వర్గాల మధ్య పెరుగుతున్న అంతరం ఇక్కడ కూడా ప్రతిఫలిస్తోంది.

అందుకే ఇప్పటివరకు కలిసి మెలిసి జీవించిన వీరిద్దరూ ఒకరినొకరు అనుమానం, అపనమ్మకంతో చూసుకుంటున్నారు.

ఈ అల్లర్లు బయటి వాళ్ల ప్రేరేపితమే అని ఇక్కడి హిందువులూ, ముస్లింలు ఇరు మతాల వారూ అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)