దళితుల 'భారత్ బంద్': పలు రాష్ట్రాల్లో హింస, 8 మంది మృతి

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు సోమవారం చేపట్టిన భారత్ బంద్ సందర్భంగా మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో హింస చెలరేగింది.
మధ్యప్రదేశ్‌లో ఆరుగురు వ్యక్తులు చనిపోయారని ఐజీ (శాంతిభద్రతలు) యోగేశ్ చౌధరి బీబీసీకి తెలిపారు. రాజస్థాన్‌లో ఒకరు, ఉత్తరప్రదేశ్‌లో మరొకరు మృతి చెందారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ముగ్గురు, భిండ్‌లో ఇద్దరు, మురైనాలో ఒకరు మృతి చెందారు.
మధ్యప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, హరియాణా రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. దళిత సంఘాలు అనేక చోట్ల ప్రదర్శనలు, ఊరేగింపులు నిర్వహించగా, కొన్ని చోట్ల పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జి చేశారు.
‘‘హింసలో గ్వాలియర్‌లోని తాటీపూర్ ప్రాంతంలో ఇద్దరు చనిపోయారు. భిండ్, మొరేనా జిల్లాల్లో ఇద్దరు పోలీసుల కాల్పుల్లో మరణించారు’’ అని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. గ్వాలియర్‌లో ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు.
భిండ్‌లో భజరంగ్‌దళ్, భీమ్సేనల మధ్య ఘర్షణ తలెత్తింది.
ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌నగర్, హాపూర్, అజంగఢ్‌లలో కూడా హింస చోటుచేసుకుంది. పలు దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు.
- అట్రాసిటీ చట్టం: సుప్రీంకోర్టు తీర్పుపై భిన్న వాదనలు
- 'దళితుల కోసం ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక పార్టీ'
బంద్ పిలుపు నేపథ్యమేమిటి?
‘నిజాయితీ’గా అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించే విషయంలో తప్పుడు కేసులతో బ్లాక్మెయిల్ చేయకుండా రక్షణ కల్పించటం కోసమంటూ ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్‌లోని కొన్ని నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు మార్చి 20వ తేదీన ఆదేశాలు జారీ చేసింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని తక్షణం అరెస్ట్ చేయటానికి బదులుగా ప్రాధమిక విచారణ జరపాలని నిబంధనను సవరించింది.
ఇలా చేయటం చట్టాన్ని నిర్వీర్యం చేయటమేనని.. దీనివల్ల దళితుల పట్ల వివక్ష, వారిపై నేరాలు మరింతగా పెరుగుతాయని దళిత సంఘాలు విమర్శిస్తున్నాయి. దీనిపై సోమవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి.
బంద్ సందర్భంగా ఎంపీ, యూపీ సహా పలు రాష్ట్రాల్లో దళిత సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి.
దళిత సంఘాల ఆగ్రహానికి కారణమైన సుప్రీంకోర్టు తీర్పులో ముఖ్యాంశాలివే...
- ఈ చట్టం కింద ఏ వ్యక్తి పైనైనా కేసు నమోదైతే ఏడు రోజుల్లోగా ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలి.
- ప్రాథమిక దర్యాప్తు జరిగినా, కేసు నమోదైనా నిందితుడి అరెస్టు అనివార్యం కాదు.
- నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి అయితే, అతడిని అరెస్టు చేయడానికి అతడిని ఉద్యోగంలో నియమించిన వ్యక్తి అనుమతి తప్పనిసరి.
- నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కాకపోతే అరెస్టు చేయడానికి ఎస్ఎస్పి స్థాయి అధికారి ఆమోదం తప్పనిసరి.
- ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 18 ప్రకారం ముందస్తు బెయిలుకు వీలు లేదు. కోర్టు తన ఆదేశంలో ముందస్తు బెయిల్‌కు అనుమతి ఇచ్చింది. అయితే ఈ చట్టం కింద పెట్టిన కేసు దురుద్దేశపూరితంగా పెట్టిందని న్యాయ సమీక్షలో తేలితే ముందస్తు బెయిల్‌కు వీలు ఉంటుంది.
సుప్రీంకోర్టులో కేంద్రం రివ్యూ పిటిషన్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
‘‘ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సమగ్ర రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దళితులు, గిరిజనుల సంక్షేమానికి నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ట్విటర్లో వెల్లడించారు.
'భారత్ బంద్'పై ఎవరేమన్నారు?
- కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ దీనిపై మాట్లాడుతూ, "ప్రజల ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలం. కానీ ప్రతిపక్షాలు దీనిని ఎందుకు రాజకీయం చేస్తున్నాయి? అంబేడ్కర్‌కు 'భారత రత్న' కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన అనుచరులమన్నట్టుగా వ్యవహరిస్తోంది" అని అన్నారు.
- 'భారత్ బంద్'పై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, "మేం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాం. శాంతిభద్రతలను కాపాడాలనీ, హింసను రెచ్చగొట్టొద్దనీ నేను రాజకీయ పార్టీలన్నింటికీ విజ్ఞప్తి చేస్తున్నాను."
ఇవి కూడా చదవండి:
- దళితుల 'భారత్ బంద్': పలు రాష్ట్రాల్లో హింస, 8 మంది మృతి
- పశ్చిమ బెంగాల్ మతఘర్షణలకు ఆ పాటలే కారణమా?
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- అట్రాసిటీ చట్టం: సుప్రీంకోర్టు తీర్పుపై భిన్న వాదనలు
- అభిప్రాయం: గ్రామీణ భారతంలో చట్టానికన్నా కులానిదే ఆధిపత్యం!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)