కశ్మీర్: శాంతి పునరుద్ధరణపై ఆశలు ఆవిరి

  • 2 ఏప్రిల్ 2018
కశ్మీర్‌లో ఆందోళనలు Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

కశ్మీర్‌లో మిలిటెంట్లపై భారత సైన్యం చేపట్టిన అతిపెద్ద సైనిక ఆపరేషన్‌లో 13 మంది మిలిటెంట్లు, ముగ్గురు సైనికులు, నలుగురు పౌరులు చనిపోవడంతో కశ్మీర్‌ లోయలో శాంతి పునరుద్ధరణపై ఆశలు ఆవిరయ్యాయి.

దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్, అనంతనాగ్‌లలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాల వద్దకు స్థానికులు వెళ్లినప్పుడు జరిగిన ఘటనల్లో 200 మందికి పైగా పౌరులు గాయపడటం ఒక ముఖ్య పరిణామం.

ఇంతకుముందు భారత ప్రభుత్వం, కశ్మీర్ ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలతో శాంతి పునరుద్ధరణపై ఆశలు మొలకెత్తాయి.

కశ్మీర్ అధికార యంత్రాంగం కొన్ని రోజుల కిందట ముందెన్నడూ లేనంత భారీస్థాయిలో ఒక పర్యాటక సదస్సును నిర్వహించింది. దేశం నలుమూలల నుంచి పర్యటనల నిర్వాహకులు (టూర్ ఆపరేటర్లు) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కశ్మీర్‌పై పర్యాటకుల్లో ఆసక్తి పెరిగేలా, కశ్మీర్‌లో పర్యాటకం అభివృద్ధి చెందేలా తమ వంతు తోడ్పాటు అందిస్తామని ఆపరేట్లరు హామీ ఇచ్చారు.

Image copyright Getty Images

పోలీసుల ఉపసంహరణ, దినేశ్వర్ శర్మ పర్యటన

వేర్పాటువాద నాయకులు సయ్యద్ అలీ షా జిలానీ, మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ నివాసాల వద్ద పోలీసుల మోహరింపును ఉపసంహరించుకుంటూ డీజీపీ శేష్‌ పాల్ వైద్ ఆదేశాలు ఇచ్చారు. తర్వాత ఈ ముగ్గురు నాయకులు వివిధ మసీదుల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

కశ్మీర్‌కు భారత ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అయిన దినేశ్వర్ శర్మ ఇటీవల.. 2016లో భద్రతా బలగాలు చంపేసిన మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వానీ స్వస్థలానికి వెళ్లారు. స్థానిక యువతతో ఆయన మాట్లాడారు. కశ్మీర్ యువతలో చాలా మంది బుర్హాన్ వానీని అభిమానిస్తారు.

డీజీపీ ఆదేశాలు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పర్యటన తదితర చర్యలతో కశ్మీర్‌ లోయలో శాంతి పునరుద్ధరణపై ఆశలు చిగురించాయి. 2016, 2017 సంవత్సరాల్లో మాదిరి ఈసారి లోయలో హింస ఉండదనే అంచనాలు వెలువడ్డాయి. ఇటీవలి సైనిక ఆపరేషన్, తదనంతర పరిణామాలతో ఈ ఆశలు గల్లంతయ్యాయి.

''శాంతి పునరుద్ధరణకు మార్గం సుగమం చేసేందుకు, మిలిటెంట్లపై సైనిక ఆపరేషన్‌ తీవ్రతను ప్రభుత్వం తగ్గిస్తుందనే భావన ఉండేది. తాజా ఆపరేషన్‌తో ఆ ఆశలు ఆవిరయ్యాయి'' అని సీనియర్ జర్నలిస్టు రియాజ్ మాలిక్ వ్యాఖ్యానించారు.

Image copyright BILAL BAHADUR / BBC

సైనిక ఆపరేషన్‌లో చనిపోయిన మిలిటెంట్లలో ఇద్దరు 2017లో కశ్మీరీ సైనికాధికారి ఉమర్ ఫజాయ్ హత్యకు కారకులని సైనికోన్నతాధికారి మేజర్ జనరల్ బీఎస్ రాజు చెప్పారు.

దక్షిణ కశ్మీర్‌లో షోపియన్ సహా నాలుగు జిల్లాల్లో మిలిటెన్సీపై పోరాడే 'విక్టర్ ఫోర్స్'‌కు రాజు సారథ్యం వహిస్తున్నారు.

''మేం వెనక్కు తగ్గబోం, మిలిటెంట్లను వెంటాడతాం. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోం'' అని ఆయన ఆదివారం మీడియాతో చెప్పారు.

సైనిక ఆపరేషన్‌లో పౌరుల మరణంతో, శాంతి పునరుద్ధరణకు దినేశ్వర్ శర్మ చేస్తున్న ప్రయత్నాలకు అవరోధం ఏర్పడినట్లు కశ్మీర్‌లోని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వేర్పాటువాద నేతలను శాంతి పునరుద్ధరణకు ముందుకొచ్చేలా చేయడంలో దినేశ్వర్ శర్మ ఇప్పటివరకు విజయవంతం కాకపోయినప్పటికీ, వేర్వేరు ప్రాంతాల్లో ఆయా వ్యక్తులతో ఆయన మాట్లాడుతున్నారని దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాకు చెందిన పరిశోధకుడు జునాయిద్ దర్ చెప్పారు.

సైనిక ఆపరేషన్‌లో పౌరులు చనిపోవడం, భద్రతా దళాల కాల్పుల్లో వందల మందికి గాయాలు కావడం వల్ల, దినేశ్వర్ శర్మ తన ప్రయత్నాలతో ఇంతవరకు సాధించినదంతా బూడిదలో పోసిన పన్నీరైందని ఆయన వ్యాఖ్యానించారు.

తాము చెప్పిన సూచనలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కొందరు పౌరులు చనిపోయారని పోలీసులు అంటున్నారు.

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాలకు పౌరులు దూరంగా ఉండాలని తాము సూచించామని, అయినా స్థానికులు వాటికి సమీపంలోనే నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారని, సైనిక ఆపరేషన్‌కు ఆటంకం కలిగించేందుకు ఎవరు యత్నించినా కఠిన చర్యలు తప్పవని ఓ సైనికోన్నతాధికారి స్పష్టం చేశారు.

Image copyright Getty Images

2016లో పెద్దయెత్తున హింస

ఎన్‌కౌంటర్‌లో బుర్హాన్ వానీ చనిపోయిన తర్వాత 2016 జులైలో కశ్మీర్‌లో పెద్దయెత్తున హింస చెలరేగింది. 100 మంది చనిపోయారు. 15 వేల మంది గాయపడ్డారు. వీరిలో అత్యధికులు పెల్లెట్ల వల్లే గాయపడ్డారు.

గత ఏడాది కూడా కశ్మీర్ లోయలో ఉద్రిక్తతలు పెరిగాయి. మిలిటెంట్లపై సైనిక దాడులు తీవ్రతరం కావడం, వేర్పాటువాదులకు వ్యతిరేకంగా ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టడంతో లోయలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

2016, 2017 అనుభవాల నేపథ్యంలో, ఈసారి కూడా కశ్మీర్ లోయలో వేసవిలో ఉద్రిక్తతలు తలెత్తుతాయని, హింస చెలరేగుతుందని, మరణాలు సంభవిస్తాయని, విద్య, వ్యాపార కార్యకలాపాలకు అడ్డంకులు ఏర్పడతాయనే ఆందోళన స్థానికుల్లో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)