అభిప్రాయం: ‘కాంగ్రెస్-ముక్త భారత్’.. మోదీకి కావాలి, మోహన్‌ భాగవత్‌కు వద్దు. ఎందుకు?

  • 3 ఏప్రిల్ 2018
మోహన్ భాగవత్, ఆరెస్సెస్, బీజేపీ, మోదీ Image copyright Getty Images

'కాంగ్రెస్-ముక్త భారత్' అన్న నినాదంతో గుజరాత్ నుంచి బయలుదేరిన నరేంద్ర మోదీ మొత్తం దేశాన్ని జయించారు. కానీ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ మాత్రం బహిరంగంగానే ఆ నినాదాన్ని తోసిపుచ్చారు. ఎందుకు?

మోదీ-షా ద్వయం తమ ప్రసంగాలలో - కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని, దేశంలోని ప్రతి సమస్యకూ గాంధీల కుటుంబం, కాంగ్రెస్‌లే కారణమని చెప్పుకొచ్చారు.

తాము అహోరాత్రులు శ్రమించి కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంటే, మోహన్ భాగవత్ దానికి ఊపిరి పోయడానికి ప్రయత్నించడం వారికి ఇరకాటంగానే కాదు, అవమానకరంగా కూడా ఉంది.

పుణెలో ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటూ మోహన్ భాగవత్, కాంగ్రెస్‌-విముక్త భారత్ అన్న మోదీ నినాదాన్ని తోసిపుచ్చారు. ''ఇది రాజకీయ నినాదం. ఆరెస్సెస్ అలాంటి భాషను మాట్లాడదు. మేం ఎవరినీ వేరు చేయడం గురించి ఆలోచించం'' అన్నారు.

ఒక బహిరంగ వేదిక నుంచి తనకు అత్యంత నమ్మకస్తుడైన స్వయంసేవకుడి కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారాన్ని సంఘ్ చీఫ్ తోసిపుచ్చారు. దీని అర్థం మోదీ, భాగవత్‌ల హనీమూన్ ముగిసిందని కాదు. వారిద్దరి మధ్యా గత నాలుగైదు ఏళ్లుగా సాగుతున్న జుగల్‌బందీ రాగం తప్పుతోంది అని చెప్పడానికి కూడా ఇది నిదర్శనం కాదు.

మోదీ-షా ద్వయం, సంఘ్‌ల సామూహిక నృత్యంలో గత ఐదేళ్లలో ఇప్పటివరకు ఒక్క తప్పుటడుగూ పడలేదు. అవసరమైనప్పుడు మోహన్ భాగవత్ మోదీ ప్రభుత్వాన్ని సమర్థించారు, ప్రవీణ్ తొగాడియాలాంటి వారు నోరు తెరవకుండా చేశారు. అదే విధంగా మోదీ ప్రభుత్వం కూడా ఆరెస్సెస్‌కు పూర్తి సహకారం అందించింది. సంఘ్ ప్రముఖులను ముఖ్యమైన పదవులలో కూర్చోబెట్టింది. సంఘ్ భావాజాలాన్ని అన్ని వ్యవస్థలలో విస్తరిస్తోంది.

Image copyright Getty Images

2002లో గుజరాత్‌లో హిందుత్వ భావజాలాన్ని విస్తరించడానికి, రాజకీయంగా ఎదగడానికి మోదీకి మించిన ప్రత్యామ్నాయం లేదని సంఘ్‌కు బాగా అర్థమైంది. అదే విధంగా జాతీయ రాజకీయాల్లో ఎదగాలంటే ప్రతి అడుగులోనూ సంఘ్ స్వయం సేవకుల అవసరం పడుతుందని మోదీ గుర్తించారు.

2014 ఎన్నికలకు ముందు, పెరుగుతున్న నరేంద్ర మోదీ ప్రాబల్యాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని ఆరెస్సెస్ గుర్తించింది. అందుకే రాజకీయ లక్ష్యాలకు దూరంగా ఉండాలన్న తన పాత అలవాటు పక్కన బెట్టి, ఎల్ కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి లాంటి నేతలను దూరంగా పెట్టింది.

2014 ఎన్నికల్లో విజయం అనంతరం మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశాక, సంఘ్ తరహా రాజకీయాలు ఓపెన్ మార్కెట్లో చెల్లుబాటు కావని, 'మోదీ ఎవరినీ తనను మించి ఎదగనివ్వరు, సంఘ్ ఎవరి స్థానాన్ని వాళ్లకు నిర్దేశిస్తుంది' అన్న మీడియా విశ్లేషణలను మోదీ, భాగవత్‌లు అబద్ధం చేశారు.

Image copyright Getty Images

ఇప్పుడు నాలుగైదు ఏళ్ల తర్వాత భాగవత్ హఠాత్తుగా తనకు అత్యంత విశ్వసనీయుడైన కార్యకర్త మోదీ ఇచ్చిన కాంగ్రెస్-విముక్త భారత్ అన్న నినాదంపై అభ్యంతరం వ్యక్తం చేయడం దేనికి సంకేతం?

రాజకీయాలతో సంఘ్‌కు ఉన్న సంబంధాన్ని, సంఘ్ నేతల ఆలోచనలను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్లాలి. సంఘ్ రెండో సర్‌సంఘ్‌చాలక్ మాధవ్ రావ్ సదాశివరావ్ గోవాల్కర్ అలియాస్ 'గురూజీ' ఎన్నడూ రాజకీయాలపై ఆసక్తి కనబరచలేదు.

జనసంఘ్ స్థాపన సందర్భంగా, సంఘ్ నుంచి రాజకీయాల వైపు వెళ్లే వారితో ఆయన, 'మీరు ఎంత పైకి వెళ్లినా, మళ్లీ తప్పకుండా ఈ భూమ్మీదకు రావాల్సిందే' అన్నారు. సంఘ్‌ను ఆయన రాజకీయాలకు అతీతం అని భావించారు.

ఇవాళ మోహన్ భాగవత్ కూడా మోదీకి ఇదే సంకేతాన్ని ఇస్తున్నారు. 'మీరు ఎంత ఉన్నత స్థానానికి వెళ్లినా, సంస్థ మీ కన్నా పైనే ఉంటుంది' అని గుర్తు చేస్తున్నారు. సంఘ్ కారణంగానే మీరు రాజకీయాల్లో ఉన్నత స్థానానికి వెళ్లారు కానీ మీ వల్ల సంఘ్ ఉన్నత స్థానానికి వెళ్లలేదన్నది ఆ వ్యాఖ్యల సారాంశం.

సంఘ్ తనను తాను భారతదేశ సంరక్షకురాలిగా భావిస్తుంది. ఈ దేశాన్ని విదేశీ శక్తులు, అంతర్గత శత్రువుల నుంచి రక్షించే బాధ్యత తన కార్యకర్తల మీద ఉంటుందని విశ్వసిస్తుంది. అందుకే మోహన్ భాగవత్ యుద్ధానికి సిద్ధం కావడానికి సైన్యానికి ఆరునెలల సమయం పడితే, తమ సైన్యం మాత్రం వెంటనే సిద్ధం అవుతుందని చెప్పుకొచ్చారు.

Image copyright Getty Images

సంఘ్‌ను కలవర పెడుతున్న మీడియా కథనాలు

మోహన్ భాగవత్ ఇలా పరోక్షంగా హెచ్చరించడానికి మరో కారణం కూడా ఉంది.

మోదీ సర్కార్ ఉపాధి కల్పనలో విఫలం కావడం, చిన్న-పెద్ద వ్యాపారుల్లో అసంతృప్తి, బ్యాంకుల కుంభకోణాలు, పలు కారణాల రీత్యా రైతులు, దళితుల్లో పెరుగుతున్న ఆగ్రహం - ఇవన్నీ మోదీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. బీజేపీపై అసంతృప్తి పెరుగుతోందన్న మీడియా కథనాలు కూడా సంఘ్‌ను కలవర పెడుతున్నాయి.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ లాంటి రాష్ట్రాల్లో జరిగే విధానసభ ఎన్నికలపై ఈ ప్రభావం పడితే, బీజేపీ ఓటమి పాలయ్యే అవకాశం ఉంది. దానికి తోడు సమాజ్‌వాదీపార్టీ, బహుజన్ సమాజ్‌పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీలన్నీ ఏకం అవుతుండడం సంఘ్‌ను కలవర పెడుతోంది.

Image copyright Getty Images

అజెండాకు అనుకూలంగా ఉంటేనే..

మోదీ ప్రాబల్యం నేడు ఉచ్ఛదశలో ఉన్నా, భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందని చెప్పలేం.

సంఘ్ పనితీరును గమనించేవాళ్లకు ఒక విషయం తెలుసు. బాలరాజ్ మధోక్ లాంటి కరడుగట్టిన హిందుత్వవాదులను ఆ సంస్థ ఈగలా తీసిపారేయగలదు, మహమ్మదాలీ జిన్నాను పొగిడిన లాల్ కృష్ణ అద్వానీ లాంటి నేతలను మూలన కూర్చోబెట్టగలదు.

వ్యక్తులు ఎంత ఉచ్ఛస్థితిలో ఉన్నా సరే, తమ అజెండాను ముందుకు తీసుకువెళ్లినంత వరకే మాత్రమే సంఘ్ వారిని భరిస్తుంది.

అయితే సంఘ్, మోదీల మధ్య పరిస్థితి ఇంకా అంతవరకు రాలేదు. అందుకే మోహన్ భాగవత్ - రాజకీయ పార్టీలు తమ తమ లెక్కల ప్రకారం రాజకీయ నినాదాలు ఇస్తూనే ఉంటాయని, వారి వ్యాఖ్యలతో సంఘ్ ఏకీభవించాల్సిన అవసరం లేదన్నారు. అధికారం కోసం జరుగుతున్న పోటీలో మోదీ కాంగ్రెస్‌ను ఎలా చూస్తున్నారో, సంఘ్ కూడా సరిగ్గా అలానే చూడాల్సిన అవసరం లేదని తెలియజేయడమే దీని ఉద్దేశం.

మోదీకి దేశాన్ని కాంగ్రెస్ విముక్తం చేయడం లక్ష్యం. కానీ సంఘ్‌కు మాత్రం మొత్తం రాజకీయాలను హిందుత్వమయం చేయడం, ప్రతి రాజకీయ పార్టీకి హిందుత్వను తప్పనిసరి చేయడమే ముఖ్యం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)