జర్నలిస్టుల గుర్తింపు రద్దు నిర్ణయం వెనక్కి

ఫొటో సోర్స్, Reuters
నకిలీ వార్తలు పుట్టించినా, ప్రచారం చేసినా సంబంధిత పాత్రికేయుడి గుర్తింపు (అక్రెడిటేషన్)ను శాశ్వతంగా రద్దు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
జర్నలిస్టుల గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని తమకు ప్రధాని మోదీ ఆదేశించారని పీఐబీ ప్రిన్సిపల్ డీజీ ఫ్రాంక్ నోరానా వెల్లడించారు.
అంతకు ముందు విలేకరుల గుర్తింపునకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది.
నకిలీ వార్తలను ప్రచురించినట్లు లేదా ప్రసారం చేసినట్లు నిర్ధరణ అయితే సంబంధిత విలేఖరి గుర్తింపును తొలి ఉల్లంఘన కింద 6 నెలల పాటు రద్దు చేస్తారు.
రెండోసారీ అదే పని చేస్తే గుర్తింపు సంవత్సరం పాటు రద్దు చేస్తారు.
మూడోసారి తప్పు చేస్తే గుర్తింపును శాశ్వతంగా రద్దు చేస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలియజేసింది.
నకిలీ వార్తలపై వచ్చే ఫిర్యాదులను పత్రికలకు సంబంధించినవయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) పరిశీలనకు, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినవయితే న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ) పరిశీలనకు పంపిస్తామని తెలిపింది.
ఫిర్యాదు నమోదు చేసినప్పటి నుంచి నిర్ణయం వెలువడేంతవరకు ఆ జర్నలిస్టు గుర్తింపును తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పింది.
ఈఅంశంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి సృతీ ఇరానీ స్పందిస్తూ.. నకిలీ వార్తలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు చర్చకు దారి తీశాయని, దీనిపై పలు సంస్థలు, పలువురు పాత్రికేయులు తమ సూచనలు ఇవ్వడానికి ముందుకొచ్చారని తెలిపారు. మున్ముందు కూడా ఈ అంశంపై సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు తాము సుముఖంగా ఉన్నామని చెబుతూ ఆమె ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.