హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?

  • సౌతిక్ బిశ్వాస్
  • బీబీసీ ప్రతినిధి
మాంసాహారం

ఫొటో సోర్స్, AFP

భారతదేశం ప్రధానంగా శాకాహార దేశమా, మాంసాహార దేశమా? దీనిపై గతంలో ఎన్నో చర్చలు జరిగాయి, ఇప్పుడూ జరుగుతున్నాయి. ఈ విషయంపై నిర్వహించిన ఒక పరిశోధనలో హైదరాబాద్‌లో కేవలం 11 శాతం మంది మాత్రమే శాకాహారులున్నారని వెల్లడైంది.

భారతీయుల ఆహారంపై అనేక సూత్రీకరణలు, అపోహలున్నాయి. భారతదేశం ప్రధానంగా శాకాహార దేశం అన్నది వాటిలో ఒక ప్రధాన సూత్రీకరణ.

అంతేకాదు, గతంలో జరిగిన పలు పరిశోధనల ప్రకారం దేశంలో మూడోవంతుకు పైగా ప్రజలు శాకాహారాన్నే తీసుకుంటారు.

ప్రభుత్వం నిర్వహించిన మూడు ప్రధానమైన సర్వేల ప్రకారం 23-37 శాతం పైగా భారతీయులు శాకాహారులు.

'సాంస్కృతిక, రాజకీయ ఒత్తిళ్లు'

కానీ అమెరికాలో ఉంటున్న మానవశాస్త్రవేత్త డాక్టర్ బాలమురళీ నటరాజన్, భారతదేశానికి చెందిన ఆర్థికవేత్త సూరజ్ జాకబ్‌లు చేపట్టిన ఒక సంయుక్త పరిశోధనలో 'సాంస్కృతిక, రాజకీయ ఒత్తిళ్ల' వల్ల వాస్తవాలను తప్పుగా పేర్కొన్నారని, మాంసం - మరీ ప్రత్యేకించి గొడ్డు మాంసం తినేవారి సంఖ్యను తక్కువగా, శాకాహారాన్ని తినేవారి సంఖ్యను ఎక్కువగా చూపించారని తెలుస్తోంది.

వీరిద్దరి పరిశోధన ప్రకారం కేవలం 20 శాతం మంది భారతీయులు మాత్రమే శాకాహారులు. భారతదేశం గురించి సాధారణంగా చెప్పే అంచనాకు ఇది చాలా దూరం.

భారతదేశ జనాభాలో 80 శాతం ఉన్న హిందువులు, ప్రధానంగా మాంసాహారులు. అగ్రవర్ణాల వారిలో మూడోవంతు మంది మాత్రమే శాకాహారులు.

కింది కులాల వారు, దళితులు, గిరిజనులు ప్రధానంగా మాంసాహారులు.

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో శాకాహారుల శాతం

  • హైదరాబాద్ : 11 %
  • చెన్నై : 6 %
  • ఇండోర్ : 49 %
  • మీరట్ : 36 %
  • దిల్లీ : 30 %
  • నాగ్‌పూర్ : 22 %
  • ముంబై : 18 %
  • కోల్‌కతా : 4 %

(ఆధారం: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే)

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు డాక్టర్ నటరాజన్, డాక్టర్ జాకబ్‌ల పరిశోధనలో గొడ్డుమాంసం తినేవారి సంఖ్య ప్రభుత్వ గణాంకాలు చెబుతున్న దానికంటే ఎక్కువగానే ఉందని తేలింది.

ప్రభుత్వ సర్వేల ప్రకారం భారతదేశంలో సుమారు 7 శాతం మంది గొడ్డుమాంసం తింటారు.

కానీ గొడ్డుమాంసం చుట్టూ సాంస్కృతిక, రాజకీయ వివాదాలు, ఆత్మగౌరవ పోరాటాలు ఉండడం వల్ల అధికారిక గణాంకాలు వాస్తవాన్ని కొంత మరుగుపరుస్తున్నాయి.

మోదీ నేతృత్వంలోని బీజేపీ శాకాహారాన్ని ప్రోత్సహిస్తోంది. దేశంలోని మెజారిటీ హిందువులు ఆవును పవిత్రంగా భావిస్తారు కాబట్టి, దానిని సంరక్షించాలని భావిస్తుంది.

ఇప్పటికే దేశంలోని డజనుకు పైగా రాష్ట్రాలు పశువుల వధను నిషేధించాయి. గోసంరక్షక బృందాల పేరిట పశువులను రవాణా చేస్తున్న వారిని పలుచోట్ల కొట్టి చంపారు కూడా.

అయితే వాస్తవం ఏమిటంటే - దళితులు, ముస్లింలు, క్రైస్తవులతో పాటు కోట్లాది మంది భారతీయులు గొడ్డు మాంసాన్ని భుజిస్తారు. కేరళలోని సుమారు 70 కులాల వారు ఖరీదైన గొర్రె మాంసం కన్నా తక్కువ ధరకు లభించే గొడ్డు మాంసం వైపు మొగ్గు చూపుతారు.

దేశంలో సుమారు 15 శాతం మంది భారతీయులు అంటే సుమారు 18 కోట్ల మంది గొడ్డు మాంసం తింటున్నారని డాక్టర్ నటరాజన్, డాక్టర్ జాకబ్‌లు తేల్చి చెప్పారు. అధికారిక అంచనాలకన్నా ఇది 96 శాతం ఎక్కువ.

ఫొటో సోర్స్, AFP

'బటర్ చికెన్ క్యాపిటల్'

అంతే కాకుండా భారతదేశ ప్రజల ఆహారంపై అనేక సూత్రీకరణలు కూడా ఉన్నాయి.

మూడోవంతు దిల్లీవాసులు మాత్రమే శాకాహారులు. అందువల్ల 'బటర్ చికెన్ క్యాపిటల్' అన్న పేరు దిల్లీకి సరిగ్గా సరిపోతుంది.

కానీ చెన్నైని'దక్షిణ భారతదేశపు శాకాహార భోజన కేంద్రం'గా పేర్కొనడం మాత్రం పూర్తిగా వాస్తవ దూరం. ఇక్కడ కేవలం 6 శాతం మంది మాత్రమే శాకాహారులు.

చాలా మంది పంజాబ్ ప్రజలు చికెన్‌ను బాగా ఇష్టపడతారని భావిస్తారు కానీ నిజానికి ఇక్కడ సుమారు 75 శాతం మంది శాకాహారులే.

మరి భారతదేశం శాకాహార దేశం అన్న భావనను విజయవంతంగా ఎలా వ్యాప్తి చేశారు?

డాక్టర్ నటరాజన్, డాక్టర్ జాకబ్‌లు, ''సమాజంలో ఇంత వైవిధ్యం ఉన్న సందర్భంలో, ప్రతి కొన్ని కిలోమీటర్ల దూరానికి ఆహార అలవాట్లు, వంటలు మారే సమాజంలో, ఆ బృందం తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేవారు, మిగతా వారి తరపున తాము చెప్పాలనుకున్నది చెబుతుంటారు. కొన్ని సమూహాలకు, బృందాలకు, ప్రాంతాలకు లేదా మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహించే వారు ఇలాంటి సూత్రీకరణలు చేస్తుంటారు'' అని తెలిపారు.

''ఇది శాకాహారుల సామాజిక శక్తిని వెల్లడిస్తుంది. ఎక్కువ మంది తినేది శాకాహారమే అని, దానికి మాంసాహారం కన్నా ఉన్నత స్థానాన్ని కల్పించే ప్రయత్నాలను తెలియజేస్తుంది. 'శ్వేత' జాతి ప్రజలు ఎలాగైతే తాము ఆక్రమించుకున్న అసంఖ్యాకమైన ప్రజల విషయంలో 'శ్వేతేతరులు' అన్న భావనను కల్పించారో, ఇది అలాంటిదే.'' అని వారు వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

వలసల వల్ల కూడా ఈ సూత్రీకరణ జరిగిందని వీరిద్దరూ తెలిపారు.

దక్షిణ భారతదేశ ప్రజలు ఉత్తర, మధ్య భారతదేశానికి వలసపోయినప్పుడు, వారి ఆహారాన్నే మొత్తం దక్షిణ భారతదేశపు ఆహారంగా భావిస్తారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే ఉత్తర భారతదేశ ప్రజలకు కూడా ఇదే విషయం వర్తిస్తుంది.

చివరగా - ఈ సూత్రీకరణల్లో కొన్ని బయటి వాళ్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. కొంతమంది దక్షిణ భారతదేశం వారిని కలిసిన ఉత్తర భారతదేశం వాళ్లు, ఆ ప్రాంతం యొక్క వైవిధ్యం గురించి ఆలోచించకుండా మొత్తం దక్షిణ దేశానికి వారే ప్రతినిధులు అని భావిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

శాకాహారుల్లో మహిళలే ఎక్కువ

ఈ పరిశోధనలో పురుషులు, మహిళల ఆహారపు అలవాట్లను కూడా చర్చించారు. ఉదాహరణకు, పురుషులకన్నా మహిళల్లో ఎక్కువ మంది శాకాహారులు ఉన్నారని తేలింది.

''సాధారణంగా శాకాహార సాంప్రదాయం పాటించాలన్న భారం మహిళల మీదే ఎక్కువగా పడుతుంటుంది'' అని డాక్టర్ నటరాజన్, డాక్టర్ జాకబ్‌లు అన్నారు.

సర్వే నిర్వహించిన కుటుంబాలలో సుమారు 65 శాతం దంపతులు మాంసాహారులు కాగా, శాకాహారులు కేవలం 20 శాతం మాత్రమే. 12 శాతం కేసుల్లో భర్త మాంసాహారి కాగా, భార్య శాకాహారిగా తేలింది. కేవలం 3 శాతం కేసుల్లో మాత్రమే భర్త శాకాహారి కాగా, భార్య మాంసాహారి.

ఈ మొత్తం పరిశోధనను బట్టి జనాభాలో మెజారిటీ ప్రజలు అప్పుడప్పుడూ లేదా క్రమం తప్పకుండా చికెన్ లేదా మాంసం లేదా బీఫ్.. ఏదో ఒకటైతే తింటున్నారని తెలుస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో భారతదేశం, భారతదేశ ప్రజల ప్రాతినిధ్యం విషయంలో ఎందుకు మనల్ని శాకాహారులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు?

ఈ విస్తృత, వైవిధ్య, బహుళ సంస్కృతులు కలిగిన సమాజంలో ఆహారం విషయంలో సూత్రీకరణలు చేయడం, ఆహారపు అలవాట్లపై నిఘా పెట్టడంతో దీనికేమైనా సంబంధం ఉందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)