#CWG2018: ఒలింపిక్స్‌లో చెత్త రికార్డు.. దేశంలో ఉత్తమ రికార్డు.. రెండూ ఆమెవే

  • వందన
  • బీబీసీ ప్రతినిధి

మీరాబాయ్ చాను.. గతేడాది వెయిట్‌ లిఫ్టింగ్‌లో వరల్డ్ ఛాంపియన్. కానీ రియో ఒలింపిక్స్‌లో కనీసం పోటీని కూడా పూర్తి చేయలేకపోయింది. ఆ ఓటమి తరవాత క్రీడల నుంచి వైదొలగాలనుకున్న మీరా, ఏడాదిలోనే అనూహ్యంగా పుంజుకుంది.

నేటి నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ప్రారంభం కానున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో మీరా.. భారత్ తరఫున వెయిట్ లిఫ్టింగ్‌లో 48కేజీల విభాగంలో పోటీ పడటానికి సిద్ధమైంది.

రెండేళ్ల క్రితం రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో బరువును ఎత్తలేక మీరా పోటీ మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటిదాకా కేవలం ఇద్దరు మాత్రమే అలా పోటీ పూర్తిచేయలేకపోయారు. అందులో మీరా ఒకరు.

నిజానికి ప్రాక్టీస్ సెషన్లలో ఆమె అవలీలగా ఆ బరువును ఎత్తేది. కానీ ఒలింపిక్స్ వేదికపై మాత్రం తడబాటుకు గురైంది.

పోటీ ముగిసిన మరుసటి రోజు సోషల్ మీడియాలో ఆమెను లక్ష్యంగా చేసుకొని అనేక విమర్శలు ఎదురయ్యాయి. క్రీడాభిమానుల పాలిట మీరా ఓ విలన్‌లా మారింది. ఆ పరిణామాల నేపథ్యంలో మీరా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.

ఓ దశలో ఏకంగా క్రీడలకే దూరమవ్వాలనుకుంది. కానీ వైద్యుల కౌన్సిలింగ్ అనంతరం, కుటుంబ సభ్యులు, కోచ్‌ల ప్రోత్సాహంతో మళ్లీ వెయిట్ లిఫ్టింగ్‌పై దృష్టి సారించింది.

ఫొటో క్యాప్షన్,

ఒలింపిక్స్‌లో విఫలమైనా వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం మీరా సొంతమైంది.

గతేడాది మీరా అద్భుత ప్రదర్శనతో క్రీడాభిమానుల్ని మురిపించింది. తన బరువుకు దాదాపు నాలుగింతల బరువు.. అంటే 194కేజీలను ఎత్తి 2017 వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుంది. గత 22ఏళ్లలో ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ మీరానే.

స్వర్ణపతకాన్ని మెడలో వేసుకున్న సమయంలో మీరా కంట జారిన కన్నీరు, ఒలింపిక్స్‌లో వైఫల్యం అనంతరం ఆమె అనుభవించిన బాధకు సాక్ష్యంగా నిలిచాయి.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీ రోజున శరీర బరువులో తేడా రాకూడదని మీరా భోజనం కూడా చేయలేదు. తన సోదరి పెళ్లికి కూడా వెళ్లకుండా పోటీలో పాల్గొంది. ఆ త్యాగం తాలూకు ఫలితం స్వర్ణ పతకం రూపంలో ఆమెకు లభించింది.

ప్రస్తుతం కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకం గెలవడమే మీరా ముందున్న లక్ష్యం.

4.1అడుగుల ఎత్తుండే మీరాను చూడగానే చాలామందికి ఆమె వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్ అని అనిపించడం కష్టం. 24ఏళ్ల మీరా మణిపుర్ రాజధాని ఇంఫాల్‌కు 200కి.మీ. దూరంలో ఓ చిన్న పల్లెలో పుట్టింది.

మణిపుర్‌కే చెందిన భారతీయ స్టార్ వెయిట్‌లిఫ్టర్ కుంజురాణి దేవికి మీరా పెద్ద అభిమాని. కుంజురాణి స్ఫూర్తితోనే మీరా వెయిట్‌లిఫ్టింగ్‌ని తన కెరీర్‌గా ఎంచుకుంది.

మొదట్లో మీరాకు సాధన చేయడానికి కనీసం ఐరన్ బార్స్ కూడా అందుబాటులో లేవు. దాంతో వెదురు బొంగులతోనే ఆమె వెయిట్ లిఫ్టింగ్ సాధన చేసింది. దగ్గర్లోని శిక్షణా కేంద్రానికి రోజూ 50-60 కి.మీ. ప్రయాణించాల్సి వచ్చేది.

మీరాకు రోజూ పాలు, చికెన్ లాంటి పోషకాహారాన్ని అందించే పరిస్థితి కూడా అప్పట్లో ఆమె తల్లిదండ్రులకు లేదు. కానీ ఇవేవీ ఆమె సాధనకు అడ్డురాలేదు.

పదకొండేళ్ల వయసులో మీరా అండర్-15 ఛాంపియన్‌గా ఎదిగింది. పదిహేడేళ్ల వయసులో నేషనల్ జూనియర్ ఛాంపియన్‌గా అవతరించింది.

2016లో 192కిలోల బరువెత్తి తాను ఆరాధించే కుంజురాణి జాతీయ రికార్డునే మీరా బద్దలు కొట్టింది. 2014గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్‌లో మీరా రజత పతకాన్ని గెలుచుకుంది. ఈసారి స్వర్ణం సాధించడమే ఆమె లక్ష్యం.

కానీ ఇప్పటికీ ఆమెకు ఆర్థిక కష్టాలు దూరమవలేదు.

వెయిట్‌లిఫ్టింగ్‌తో పాటు డాన్స్ కూడా మీరాకు చాలా ఇష్టం. బీబీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ఒక్కదాన్నే ఉన్నప్పుడు గది తలుపులు మూసేసి సినిమా పాటలకు డాన్స్ చేస్తా. సల్మాన్ ఖాన్ సినిమాలంటే నాకు ఇష్టం’ అన్నారామె.

కామన్‌వెల్త్ గేమ్స్‌తో పాటు ఏషియన్ గేమ్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌ లక్ష్యంగా మీరా సాధన సాగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)