తెలంగాణలో సూర్యుడు 'అస్తమించని' గ్రామం
- శ్యాంమోహన్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Shyam Mohan
బంజేరుపల్లి.. తెలంగాణలో చిన్న పల్లెటూరు. 120 గడపలు ఉంటాయి. సిద్దిపేట జిల్లాలోని ఈ గ్రామంలో సూర్యుడు ఎప్పుడూ 'అస్తమించడు'! పగలంతా వెలుతురు ఇచ్చి, రాత్రయ్యే సరికి సోలార్ విద్యుత్ రూపంలో పల్లెలో విహరిస్తూ ఉంటాడు.
ఈ గ్రామంలో మొత్తం 120 ఇళ్లకుగాను 120 ఇళ్లు.. అంటే వంద శాతం ఇళ్ల పైకప్పు మీద సౌర ఫలకాలే కనిపిస్తాయి.
నాలుగేళ్ల క్రితం కరెంటు కోతలతో గ్రామంలోని ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతూ ఉండేవారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ఊరి రూపమే మారిపోయింది.
ఫొటో సోర్స్, Shyam Mohan
నాబార్డ్ తోడ్పాటు
జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డ్) చొరవతో బంజేరుపల్లిలో ప్రతి ఇంటిలోనూ సౌర విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయి.
విద్యుత్ పొదుపు చేసే విధానానికి బంజేరుపల్లి ప్రజల నుంచి పూర్తి సహకారం లభించింది. సంపూర్ణ సోలార్ గ్రామంగా రూపొందించడానికి గ్రామసభలో తీర్మానం చేసి, ఉత్సాహంగా ముందుకు వచ్చారు.
గ్రామంలోని 120 ఇళ్ల మీద సౌర ఫలకాలు వెలిశాయి. నాబార్డు, స్థానిక ఏపీజీవీ బ్యాంక్ ఇచ్చిన రుణాలతో పనులు జరిగాయి.
నేడు ఈ గ్రామంలో ప్రతి ఇంటిలోనూ 4 లైట్లు, 4 ఫ్యాన్లు, టీవీ, ఫ్రిజ్ (500 వాట్స్) సోలార్ విద్యుత్‌తోనే పనిచేస్తున్నాయి.
ఫొటో సోర్స్, Shyam Mohan
కరెంట్ కోతల నుంచి విముక్తి
గతంలో కరెంటు కోతలతో విసిగిపోయిన గ్రామస్థులకు ఇప్పుడు విద్యుత్ గురించి పెద్దగా టెన్షన్ లేదు.
కరెంటు పోయిన మరుక్షణం సౌర విద్యుత్ వారికి సేవలు అందిస్తోంది.
ఇళ్లలోనే కాదు, 65 సోలార్ వీధి దీపాలు ప్రజల జీవితంలో వెలుగులు నింపుతున్నాయి.
"వానాకాలంలో పిడుగు ప్రమాదాలు ఈ ప్రాంతంలో ఎక్కువ. వీటి నుంచి సోలార్ యూనిట్లను కాపాడుకోవడానికి లైట్నింగ్ అరెస్టర్లను కూడా బిగించారు" అని బంజేరుపల్లి ఎంపీటీసీ శాంత చెప్పారు.
ప్రతి ఇంటి నుంచి డిపాజిట్‌గా రూ.8 వేలు
ఒక్కో ఇంటికి సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు, వైరింగ్ ఏర్పాటు చేయడానికి 85 వేల రూపాయలు ఖర్చయింది.
ప్రతి ఇంటి నుంచి డిపాజిట్‌గా రూ.8 వేలు వసూలు చేశారు. మొత్తం వ్యయంలో 40 శాతాన్ని నాబార్డు సబ్సిడీగా అందించింది.
"మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించే అవకాశం ఇచ్చారు. గ్రామస్థులు ఎవరి వాయిదాను వారు నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించేందుకు అంగీకరించారు" అని సిద్దిపేట జిల్లా నాబార్డ్ అధికారి గంటా రమేష్ కుమార్ వివరించారు.
ఫొటో సోర్స్, Shyam Mohan
మా పల్లె కళ మారింది!
'సోలార్ గ్రామం'గా గుర్తింపు పొందిన తర్వాత మా ఊరు మారిపోయింది. వానా కాలంలో కరెంటు కోతలనేవే లేకుండా, అసలు కరెంటు పోయిందనే విషయం కూడా తెలియకుండా చాలా సంతోషంగా ఉంటున్నాం' అని గ్రామ ఉప సర్పంచ్ రాజయ్య చెప్పారు.
తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఓసారి బంజేరుపల్లిని సందర్శించారు. సంపూర్ణ సోలార్ విద్యుత్ వినియోగంలో ఉన్న గ్రామం తన నియోజకవర్గంలో ఉండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు చెల్లించాల్సిన వాయిదాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు.
"సోలార్ విలేజిగా గుర్తింపు రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వందల మంది మా ఊరికి అధ్యయనం కోసం వస్తున్నారు" అని ఉప సర్పంచ్ రాజయ్య ఆనందంగా చెప్పారు.
ఫొటో సోర్స్, Shyam Mohan
'బిల్లులు తగ్గాయి'
సోలార్ విద్యుత్ వ్యవస్థను అమర్చుకున్న తర్వాత తమ జీవనం మరింత మెరుగైందని, బిల్లుల మోత తగ్గిందని బంజేరుపల్లికి చెందిన గృహిణి లలిత తెలిపారు. గతంలో తాము నెలకు రూ.500 విద్యుత్ బిల్లు కట్టేవాళ్లమని, సౌర విద్యుత్ రాకతో నెలకు రూ.150 మాత్రమే బిల్లు కడుతున్నామని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతోంది?
- ‘కాంగ్రెస్-ముక్త భారత్’.. మోదీకి కావాలి, మోహన్ భాగవత్‌కు వద్దు. ఎందుకు?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- #UnseenLives: పీరియడ్స్ సమయంలోనూ మాతో ‘సెక్స్ వర్క్’ చేయించేవారు!
- #BBCShe: ‘ఎడ్ల దగ్గరకు వెళ్లినపుడు వాటితో మాట్లాడుతుంటా’
- తెలంగాణ: బీడువారిన నేలను మాగాణంలా మార్చారు!
- తండ్రి ఆస్తిలో కూతురి వాటా ఎంత? తాత ఆస్తిలో ఆమెకు హక్కుందా లేదా?
- ఇలా చేస్తే మీ భాగస్వామిని మోసం చేయడమా? కాదా?
- పన్ను బకాయిలు చెల్లించిన మహేశ్ బాబు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)