ప్రధానిపై పోరాడుతున్నా: చంద్రబాబు

మోదీ, చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం రెచ్చగొడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన హమీల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద తాను పోరాడుతున్నట్లు చెప్పారు.

దిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు బుధవారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి జాతీయ మీడియాకు, దేశం మొత్తానికీ తెలియజేయాలనుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన క్రమాన్ని, ప్రత్యేక హోదా హామీ, ప్రత్యేక సాయం ప్రకటనలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెల్లూరు, అమరావతి సభల్లో.. ‘ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణాలకు నాదీ భరోసా’ అంటూ చేసిన ప్రకటన వీడియోలను ప్రదర్శించారు.

చంద్రబాబు ప్రెస్ మీట్‌లో చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చాలా అన్యాయంగా అశాస్త్రీయంగా జరిగింది. మా జనం అన్నీ కోల్పోయారు. విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్రమే భరించాలి. మా రాష్ట్రానికి ఒక ఊతం కావాలి. కేవలం మా రాష్ట్రానికి మద్దతు కోసమే నేను ఎన్‌డీఏలో చేరాను. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి అప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం. ఏపీ పునర్నిర్మాణానికి హామీ ఇచ్చారు. దిల్లీకంటే ఉత్తమమైన రాజధానిని నిర్మిస్తామని ప్రకటించారు. పార్లమెంటులో, ఎన్నికల ప్రచారంలో, అమరావతి శంకుస్థాపన సభలో బీజేపీ, నరేంద్రమోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేం కోరుతున్నాం.
 • నాలుగేళ్లలో నేను ఇక్కడికి 29 సార్లు వచ్చాను. చిన్న చిన్నవి మినహా రాష్ట్రానికి ఏమీ జరగలేదు. ప్రధాన అంశాలన్నీ అలాగే ఉన్నాయి. ప్రతిసారీ ఎన్నికలున్నాయి, ఈ పనులున్నాయి వేచివుండండి అని చెప్తూ వచ్చారు. ఎంతో నమ్మకంతో నేను పెద్దగా ఒత్తిడి చేయలేదు. నాలుగు సంవత్సరాలు సహనంతో నిరీక్షించాను.
 • మధ్యలో 14వ ఆర్థిక కమిషన్ సిఫారసులు, జీఎస్‌టీ అమలు కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందన్నారు. కానీ.. ఆ కమిషన్ చైర్మన్, సభ్యులు అలాంటిదేమీ తాము చెప్పలేదన్నారు. ఆర్థిక వనరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయటమే తమ పని అని, అనవసర వివాదాల్లోకి తమను లాగవద్దని చెప్పారు.
 • అప్పుడు.. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఏ రాష్ట్రానికీ ఇవ్వట్లేదు, ఏపీకే ఇస్తున్నామని చెప్పారు. అందుకు అంగీకరించాం. కానీ ఏడాదిన్నర దాకా ఏమీ కదలలేదు. ఆ తర్వాత నాబార్డు నుంచి ఇస్తామని.. అందుకోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ప్రారంభించాలని చెప్పారు. అలా చేయటం వల్ల నిధులను ఇతర అవసరాలకు మళ్లించలేం. అదెలా చేయగలం? అయినా దాని గురించి అధికారికంగా మార్గదర్శకాలు ఇవ్వలేదు.
 • అదే సమయంలో 11 ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా సాయం అందిస్తోంది. మరి మాకు ఎందుకు ఇవ్వటం లేదు. జీఎస్‌టీ తర్వాత పరిశ్రమలకు ఇంటెన్సివ్‌లు, మార్గదర్శకాలను మూడేళ్ల పాటు ఇస్తున్నట్లు రెండు జీఓలు ఇచ్చారు. కానీ వాటివల్ల ప్రయోజనమేమీ లేదు. ప్రత్యేక హోదా మాట ఎత్తలేదు. ఏపీ గురించి ఎలాంటి శ్రద్ధా చూపలేదు.
 • పార్లమెంటులో మా ఎంపీలు ప్రస్తావించారు. వారు పట్టించుకోలేదు. అసెంబ్లీలో నేను నాలుగేళ్లుగా జరిగింది చెప్పాను. అదే రోజు.. కేంద్ర ఆర్థికమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇవ్వబోమని, స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తే నిధులు అందిస్తామని చెప్పారు. ఇదెక్కడి న్యాయం? మమ్మల్ని నమ్మించి ఇలా చేశారు.
 • ఈ పరిస్థితుల్లో మా ఎంపీలతో చర్చించాం. కేంద్ర ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం లేదని నిర్ణయించాం. నేను ఆ రోజు రాత్రి ప్రధానమంత్రితో మాట్లాడటానికి ఫోన్ చేశాను. ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ రోజు రాత్రి 11 గంటల తర్వాత నేను ప్రకటించాను.. కేంద్రం నుంచి వైదొలగుతున్నట్లు. ఆ తర్వాతి రోజు మోదీ నాకు ఫోన్ చేశారు. పరిస్థితి చెప్పి పరిష్కరిస్తే సంతోషమని చెప్పాను. ఆయన చూద్దామని బదులిచ్చారు. కానీ ఏమీ జరగలేదు. దీంతో ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి మా మంత్రులను ఉపసంహరించాం.
 • పార్లమెంటులో మేం పోరాటం చేస్తున్నాం.. ప్రభుత్వం పునరాలోచిస్తుందని ఆశించాం. కానీ వారు పట్టించుకోలేదు. దీంతో ఎన్‌డీఏ తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. చాలా పార్టీలు మాకు మద్దతిచ్చాయి. ఆయా పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి.
 • ఇప్పుడు.. డబ్బులు ఇవ్వటానికి తాము సిద్ధంగా ఉన్నామని.. మేమే తీసుకోవటం లేదని మాపై ఎదురు దాడి చేస్తున్నారు. సహకార సమాఖ్య, టీమ్ ఇండియా అని మాట్లాడుతున్నారు. కానీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే, విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తే వారు రాష్ట్రం మీద ఎదురు దాడి చేస్తున్నారు. ఇది సరైనదేనా? మేం డబ్బులు వాడుకోవటం లేదని, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని మాపై నిందలు మోపుతున్నారు. మీరు మమ్మల్ని వేధించాలని అనుకుంటున్నారా?
 • ఏపీకి 2014-15లో రెవెన్యూ లోటు 16,079 కోట్లకు గాను.. 3,979 కోట్లు మాత్రమే ఇచ్చారు. హేతుబద్దత లేకుండా నిర్లక్ష్యంగా లెక్కలు వేసి ఆ ఇచ్చిన నిధులు కలిపి మొత్తంగా రూ. 4,117 కోట్లు మాత్రమే వస్తాయని చెప్తున్నారు. అంటే ఇక రూ. 138 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం లేఖ రాసింది.
 • దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం అతి తక్కువగా ఉంది. కారణం.. రాష్ట్ర విభజన. విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్ర తలససరి ఆదాయం రూ. 89,214 ఉంటే.. విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం రూ. 82,870 గా ఉంది. అదే తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,12,162 గా ఉంది. అంటే.. హైదరాబాద్‌తో పాటు మేం కొంత తలసరి ఆదాయాన్ని కోల్పోయాం. అది తెలంగాణలో కలిసింది.
ఫొటో క్యాప్షన్,

బుధవారం ఉదయం ఏపీ భవన్‌లో చంద్రబాబుతో భేటీ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్

 • అయినా కానీ.. మేం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. నాలుగేళ్లలో సగటున 10.5 శాతం వృద్ధి సాధించాం. అది జాతీయ సగటు కంటే అధికం.
 • ప్రత్యేక హోదా ఐదేళ్ల పాటు ఇస్తామని పార్లమెంటులో నాటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. మోదీ తనను గెలిపిస్తే ఆ హోదా హామీని అమలు చేయటంతో పాటు హోదా గడువును పదేళ్లకు పొడిగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. విభజన చట్టంలో ప్రతి అంశాన్నీ గడువులోగా అమలు చేస్తామని, అమరావతిని దిల్లీ కన్నా మెరుగైన నగరంగా నిర్మిస్తామని మోదీ అమరావతి శంకుస్థాపన సభలో ప్రకటించారు. కానీ ఏమీ జరగలేదు.
 • కేంద్రం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోంది. సెంటిమెంట్ ఇంత బలంగా ఎందుకుంది? 60 ఏళ్లు హైదరాబాద్‌లో ఉన్నాం. జనమంతా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. దానిని మేం కోల్పోయాం. ఆ నష్టాన్ని భర్తీ చేయటం కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రజల సెంట్‌మెంట్‌ ఎంత తీవ్రంగా ఉందో చూడాలి. విభజన తర్వాత 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ.. ఏపీలో అన్ని సీట్లూ కోల్పోయింది. డిపాజిట్లూ కూడా దక్కలేదు. అప్పుడు ద్రోహానికి గురయ్యామన్న బాధ జనంలో ఉంది.
 • ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత కూడా నమ్మకద్రోహానికి గురయ్యామని ప్రజలు భావిస్తున్నారు. కేంద్రం తీరువల్ల ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. మనం సెంటిమెంట్‌ సమస్యలు సృష్టించకూడదు.
 • మేం నాలుగేళ్లు ఎందుకు వేచి ఉన్నామని మీరు అడగొచ్చు. మాది కొత్త రాష్ట్రం. కొత్తగా పుట్టిన బేబీ. అందుకు కేంద్రం నుంచి సాయం అవసరం. అందుకే ఓపికగా వేచివున్నాం. ఇప్పుడు నేను ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ప్రత్యేక హోదా.. వాస్తవ స్ఫూర్తితో ఇవ్వాలన్నది మా డిమాండ్. ఆ హోదాతో వచ్చే అన్ని ప్రయోజనాలనూ ఆంధ్రప్రదేశ్‌కు అందించాలి.

చంద్రబాబుది రాజకీయ అభద్రత: బీజేపీ

రాజకీయ అభద్రతా భావంతోనే బీజేపీపైన చంద్రబాబు నాయుడు నిందలు వేస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు.

చంద్రబాబు ప్రెస్‌మీట్ ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబుతో కలసి ఆయన పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌కు నిధులు విడుదల చేయలేదనటం అవాస్తవమన్నారు. ‘‘ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకున్నట్లయితే మళ్లీ అడిగే అవకాశం ఉంటుంది. మీరు ఎట్లా ఖర్చు పెట్టారో మాకు వివరాలు ఇవ్వాలని, లేకపోతే మళ్లీ నిధులు ఇవ్వటం కష్టమవుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ వారు అడిగారు. ఖర్చు పెట్టిన వాటికి వివరాలు అడిగితే కనీసం స్పందన లేదు’’ అని నరసింహారావు పేర్కొన్నారు.

‘‘టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనేది మాకు సంబంధం లేని విషయం. అయితే.. ఆంధ్రప్రదేశ్ దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణం. ఆ పార్టీకి ఏపీలో విశ్వసనీయత లేదు. చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలని అనుకుంటే.. ఆయనను ప్రజలు అవకాశవాదిగా భావిస్తారు’’ అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఏపీ ప్రయోజనాల కోసం మాట్లాడుతోంటే.. కేంద్రం నా మీద ఎదురు దాడి చేస్తోందన్న చంద్రబాబు ఆరోపణ వాస్తవం కాదని కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. ’’బీజేపీ కానీ, కేంద్రం కానీ.. ఏపీకి ఏ రకంగా సహాయం చేసిందీ, చట్టంలోని అంశాలను ఏ రకంగా అమలు చేసిందీ, చట్టంలో లేకపోయినా చేసిన పనులు ఏమిటి, ఇంకా చేయాల్సివున్న పనులు ఏమిటి అనేది వివరించటానికి ప్రయత్నం చేసింది. అంతే’’ అని ఆయన చెప్పారు.

‘‘ఏపీలోని ఒక కళంకిత పార్టీతో కలవటానికి బీజేపీ ఇలా చేసిందని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు మనసులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌తో బీజేపీకి రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదు’’ అని ఆయన ఉద్ఘాటించారు.

‘‘ఒకే విషయాన్ని భావం మారకుండా చెప్పటం చంద్రబాబుకే సాధ్యం’’

ఎన్‌డీయేతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా ఒకే సంగతి పునరుద్ఘాటిస్తున్నారని సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు భండారు శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ‘‘ఒకే విషయాన్ని పలుమార్లు చెప్పడం ద్వారా ఆ విషయాన్నీ బలంగా తీసుకువెళ్లవచ్చు అని చంద్రబాబు నాయుడు అనుకుంటారని ఆయన్ని దగ్గరగా తెలిసినవాళ్ళు చెబుతుంటారు’’ అని ఆయన బీబీసీ ప్రతినిధితో పేర్కొన్నారు.

‘‘చంద్రబాబు క్యాబినెట్లో మాట్లాడినా, అసెంబ్లీలో ప్రసంగించినా, బహిరంగసభలో ఉపన్యసించినా ఆయన ఒకే విషయాన్ని భావం మారకుండా గట్టిగా చెప్పగలరు. జనంలోకి తన ఉద్దేశ్యాలను బలంగా పంపుతున్నారో తెలియదు కానీ విషయాలను ఏమాత్రం దాటవేయకుండా చెప్పగలగడం ఆయనకే సాధ్యం’’ అని భండారు వ్యాఖ్యానించారు.

‘‘మొన్నటి వరకు బీజేపీని పల్లెత్తి మాట అనని చంద్రబాబు.. ఆంద్ర‌ప్రదేశ్ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష మీద, మోదీ ప్రభుత్వం మీద ఏకంగా దిల్లీ లోనే ఆరోపణలు గుప్పించారు. విచిత్రం ఏమిటంటే ఇపుడు చంద్రబాబు మాటల్ని తప్పుబట్టిన జావదేకర్ గతంలో వాజపేయి హయాంలో టీడీపీకి, బీజేపీకి సయోధ్య కుదర్చడంలో కీలక చర్చల్లో పాలుపంచుకున్నారు’’ అని ఆయన గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)