ప్రత్యేక హోదా డైరీ: ఏప్రిల్ 6న జనసేన, సీపీఎం, సీపీఐ పాదయాత్ర

మధు, పవన్‌కళ్యాణ్, రామకృష్ణ

ఫొటో సోర్స్, Janasena Party/Facebook

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల డిమాండ్లతో ఏప్రిల్ 6వ తేదీన (శుక్రవారం) సీపీఐ, సీపీఎంలతో కలిసి ఏపీలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించారు.

పవన్ బుధవారం సీపీఎం కార్యదర్శి పి.మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణలతో విజయవాడలో సమావేశమై చర్చించారు. అనంతరం ముగ్గురు నాయకులూ మీడియాతో మాట్లాడారు. ''ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ద్రోహం చేస్తోంది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లకుండా జరుగుతున్న కుట్రను ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా మేం భావిస్తున్నాం. నమ్మకద్రోహాన్ని, అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ ఈ నెల 6వ తేదీన జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో ముఖ్య కూడళ్లలో పాదయాత్ర చేస్తున్నాం'' అని వెల్లడించారు.

సీపీఎం, సీపీఐ కార్యదర్శులతో కలిసి తాను విజయవాడలో పాదయాత్రలో పాల్గొంటున్నట్లు పవన్ చెప్పారు. ‘‘పూర్తి శాంతియుత పద్ధతులలో మా నిరసన ఢిల్లీని తాకేలా ఉంటుంది. ఆ తర్వాత అనంతపురం, విజయనగరం, ఒంగోలులో కూడా మేధావులతో చర్చలు, సభలు కూడా నిర్వహించబోతున్నాం’’ అని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లటం.. రెండేళ్ల ముందే చేసి ఉంటే బాగుండేదని పవన్ వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బలహీన పరచటాన్ని జనసేన, సీపీఐ, సీపీఎంలు తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు. ఈ విషయంలో దళితులకు పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు.

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/Facebook

జగన్‌తో ప్రత్యేక హోదా సాధన సమితి నేతల భేటీ

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాసరావు, తాడి నరేష్‌, కొండా నర్సింగరావు, సదాశివరెడ్డి తదితరులు బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌‌రెడ్డితో సమావేశమయ్యారు.

గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను వారు కలిశారు. హోదాపై ఇప్పటికే కార్యాచరణ ప్రకటించామని, త్వరలో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని వారితో జగన్‌ పేర్కొన్నారు. హోదా కోసం పోరాడే వారందరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని.. హోదా కోసం కాదని జగన్ ఈ సందర్భంగా విమర్శించారు. అన్ని రాజకీయ పక్షాలు, సంఘాలను కలుపుకుని ప్రత్యేక హోదా పోరాటానికి నాయకత్వం వహించాలని జగన్‌ను హోదా సాధన సమితి నేతలు కోరారు.

ఇదిలావుంటే.. చంద్రబాబు ఫొటో షూటింగ్ కోసమే ఢిల్లీ వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు విమర్శించారు.

ఫొటో సోర్స్, I&PR, GOVT OF AP

కేజ్రీవాల్‌తో చంద్రబాబు భేటీ.. ఢిల్లీలో ప్రెస్ మీట్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలో పలు పార్టీల నాయులను కలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు.

అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా హామీ వివాదం గురించి జాతీయ మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయటం లేదని, అదేమని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతోందని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల పాటు తాను ఓపికగా వేచిచూసినా ఫలితం లేకపోవటంతో ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్నాన్నారు.

ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో, కేంద్ర ప్రభుత్వంతో తాను పోరాడుతున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Bharatiya Janata Party/Facebook

హోదాపై చంద్రబాబు రాజకీయాలు: ప్రకాశ్‌జావదేకర్

ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవమని కేంద్రమంత్రి ప్రకాశ్‌జావదేకర్ ఖండించారు. అవాస్తవాలతో రాజకీయాలు చేయటం సరికాదన్నారు. ఎన్‌డీఏ నుంచి టీడీపీ వైదొలగినా ఏపీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.

ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జి.వి.ఎల్.నరసింహారావు విమర్శించారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక సాయం అందిస్తామని చెప్తున్నా హోదానే కావాలనటం సమంజసం కాదన్నారు.

‘‘ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకున్నట్లయితే మళ్లీ అడిగే అవకాశం ఉంటుంది. మీరు ఎట్లా ఖర్చు పెట్టారో మాకు వివరాలు ఇవ్వాలని, లేకపోతే మళ్లీ నిధులు ఇవ్వటం కష్టమవుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ వారు అడిగారు. ఖర్చు పెట్టిన వాటికి వివరాలు అడిగితే కనీసం స్పందన లేదు’’ అని నరసింహారావు పేర్కొన్నారు.

కేవం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని తప్పుపట్టారు.

ఫొటో సోర్స్, Andhra Pradesh Congress Committee/Facebook

రెండో రోజు కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు

ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం రెండో రోజు కూడా దీక్షలను కొనసాగించారు.

హోదా ఉద్యమంలో భాగంగా మూడు రోజుల పాటు రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయా దీక్షా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీల మీద విమర్శలు గుప్పించారు.

ఫొటో సోర్స్, Getty Images

11వ రోజూ చర్చకు రాని అవిశ్వాస తీర్మానం

ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు ఇచ్చిన అవిశ్వాసం నోటీసులు బుధవారం కూడా లోక్‌సభలో చర్చకు రాలేదు. అన్నా డీఎంకే సభ్యులు కావేరీ జలాల విషయంలో వెల్‌లో నిరసనకు దిగటంతో.. స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో వరుసగా 11 రోజులు అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా, మరే అంశంపై చర్చ జరగకుండా సభ వాయిదా పడింది.

షెడ్యూలు ప్రకారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఇక రెండు రోజులే మిగిలివున్న నేపథ్యంలో.. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్‌సీపీ తదితర పార్టీల నాయకులు బుధవారం సమావేశమయ్యారు.

పీపీకి ప్రత్యేక హోదా హామీ, కావేరీ జలాల మేనేజ్‌మెంట్ బోర్డు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై తీర్పు, బ్యాంకుల్లో మోసాలు, సీబీఎస్‌ఈ పేపర్ లీక్ వంటి ప్రజా అంశాలపై చర్చకు అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే రెండు రోజులు సమావేశాలను పొడిగించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)