రూపాలీ: ఆమె పులితో పోరాడింది.. సెల్ఫీ తీసుకుంది!

ఫొటో సోర్స్, RUPALI MESHRAM
పులితో పోరాడిన తర్వాత రూపాలి తన తల్లితో కలిసి సెల్ఫీ తీసుకుంది
కేవలం ఒక కర్రముక్కను ఆయుధంగా ఉపయోగించిన రూపాలీ.. పులితో పోరాడి స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమె చాలా అదృష్టవంతురాలని వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు.
రూపాలీ మేష్రామ్ వయసు 23 సంవత్సరాలు. ఆమెది తూర్పు మహారాష్ట్రలోని భండారా జిల్లా, సాకోలి తాలూకా, ఉస్‌గాం గ్రామం. గత వారం కిందట అకస్మాత్తుగా తన మేక ప్రాణభయంతో అరవటం విని ఇంట్లో నుంచి పరుగున వెళ్లి చూసింది.
పులి మేక మీద దాడిచేస్తూ కనిపించింది. ఆమె వెంటనే ఒక కర్ర తీసుకుని పులిని కొట్టింది. దీంతో పులి ఆమెపై దాడి చేసింది. ఇంతలో ఆమె తల్లి కూడా అక్కడికి వచ్చింది. పులి ఆమె మీద కూడా దాడి చేసింది.
రూపాలి పులితో పోరాటం కొనసాగిస్తుండగా.. ఆమె తల్లి రూపాలిని ఇంట్లోకి లాక్కెళ్లి కాపాడింది. ఇద్దరూ గాయాల పాలయ్యారు. ఆస్పత్రిలో వారికి చికిత్స చేశారు. ఇద్దరూ కోలుకుని ఇంటికి తిరిగివెళ్లారు. కానీ వారి మేక మాత్రం బతకలేదు.
పులి దాడిలో రక్తసిక్తమైన తన రూపాన్ని.. రూపాలీ సెల్ఫీ తీసుకుంది. ఆ ఫొటో ఇటీవల వెలుగులోకి వచ్చింది.
ఫొటో సోర్స్, SANAY TIWARI
ఆస్పత్రి డిస్చార్జ్ రికార్డులో రూపాలీ మీద 'అడవి జంతువు (పులి) దాడి' చేసినట్లు పేర్కొన్నారు
పులితో పోరాడిన ఆ యువతి ‘‘అసమాన ధైర్యశాలి’’ అని ఆమెకు చికిత్స చేసిన డాక్టర్ ప్రశంసించారు. అయితే.. పులి ఆమె మీద దాడిచేసినపుడు తన కోరలతో గాయపరచకపోవటం వల్ల రూపాలి బతికిపోయారని ఆ విధంగా ఆమె లక్కీ అని ఆయన వ్యాఖ్యానించారు.
పులి దాడిలో రూపాలీకి తల, నడుము, చేతులు, కాళ్ల మీద గాయాలయ్యాయి. అయితే అవన్నీ పై పై గాయాలే కావటంతో ఆమె త్వరగానే పూర్తిగా కోలుకున్నారు.
తలకు గాయమవటం వల్ల ఆమెకు సీటీ స్కాన్ చేసి.. కొన్ని రోజులు వైద్య పర్యవేక్షణలో ఉంచారు.
‘‘నా కూతురు చనిపోతుందేమోనని నాకు భయమేసింది’’ అని ఆమె తల్లి జిజాబాయి బీబీసీ హిందీ ప్రతినిధి సంజయ్ తివారీతో చెప్పారు. ’’రక్తమోడుతున్న నా కూతురు చేతిలో చిన్న కర్ర పట్టుకుని పులితో పోరాడటం చూసి నేను నిలువెల్లా వణికిపోయాను’’ అని ఆమె చెప్పారు.
ఫొటో సోర్స్, SANJAY TIWARI
రూపాలీ తలకు అయిన గాయాలు తగ్గిపోయాయి.. ఆమె తల్లి కూడా కోలుకుంటున్నారు
పులితో రూపాలీ పోరాడిన పది రోజుల తర్వాత బీబీసీ తీసిన ఆమె ఫొటోలో గాయాల గుర్తులేవీ పెద్దగా కనిపించలేదు.
రూపాలి తల్లి తన కుమార్తెను పులి దగ్గర నుంచి లాగివేస్తున్న క్రమంలో.. పులి ఆమెపై దాడిచేసినపుడు ఆమెకు కంటి దగ్గర గాయమైంది. ఆమె గాయాలు కూడా మానుతున్నాయి.
పులి దాడి చేసిన వెంటనే తాము ఫారెస్ట్ గార్డ్‌కు సమాచారం అందించామని వారు చెప్పారు. అయితే.. ఫారెస్ట్ గార్డ్ రావటానికి 30 నిమిషాల సమయం పట్టిందని అప్పటికే పులి మాయమైపోయిందని పేర్కొన్నారు.
వైల్డ్‌లైఫ్ పార్క్ సమీపంలో ఉన్న వీరి గ్రామంలోకి తరచుగా అడవిలోని జంతువులు వస్తూ ఉంటాయి.
‘‘మా ఊరికి వెళ్లాలంటే కొంచెం ఆందోళనగా ఉంది. కానీ భయపడటం లేదు’’ అని రూపాలీ బీబీసీతో పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి:
పులి ఎలుగుబంటి.. అరుదైన పోరు.. ఇంతకీ ఎవరు గెలిచారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)