ప్రెస్‌ రివ్యూ: ఎన్డీయే ఎంపీలు ఆ 23 రోజుల వేతనం తీసుకోరు!

పార్లమెంట్

ఫొటో సోర్స్, wikipedia

పార్లమెంటులో గత 23 రోజులుగా గందరగోళం వల్ల సమావేశాలు జరగకపోవడంతో, బీజేపీ లేదా ఎన్డీయే ఎంపీలెవరూ ఈ 23 రోజుల వేతన భత్యాలు తీసుకోవద్దని నిర్ణయించినట్టుగా 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం తెలిపింది.

ఈ 23 రోజుల సమయం వృథా అయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ తెలిపారు.

ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్టు ఇద్దరు ఎన్డీయే నేతలు తెలిపారు.

ఇందుకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని నిందిస్తూ కుమార్ ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు.

గత నెలలో దిల్లీ ఎంపీ మనోజ్ తివారీ పార్లమెంటులో 'నో వర్క్ నో పే' (పని చేయకుంటే వేతనం లేదు) అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Professor kodandaram fans page/facebook

‘గడీ గోడలను బద్దలు కొడదాం‘

ప్రజల ప్రభుత్వం కోసం ప్రగతిభవన్‌ గడీలను బద్దలు కొడదామని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ఎం.కోదండరాం పిలుపునిచ్చినట్లు 'సాక్షి' పేర్కొంది.

పాలపిట్ట, ఆకుపచ్చ రంగులతో రూపొందించిన టీజేఎస్‌ జెండాను బుధవారం హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ''పాలపిట్టకు అపజయం తెలియదు. పాలపిట్ట రంగును అద్దుకున్న టీజేఎస్‌ ఎక్కడైనా విజయం సాధిస్తుంది. స్వరాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉంటుందనుకున్నాం.

భావ వ్యాప్తి కోసం, ప్రజలకు న్యాయం చేయడం కోసం పార్టీ అవసరం. ఇప్పటిదాకా 99 శాతం నడిచాం. ఇంకా ఒక్క శాతం మిగిలి ఉంది.

1996 నుంచి ఆచార్య జయశంకర్‌ సార్‌తో తెలంగాణ ప్రయాణం ప్రారంభించాం. అవే ఆశయాలను కచ్చితంగా సాధించి తీరుతామని కోదండరాం పేర్కొన్నట్లు సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, prakash javadekar/ facebook

‘వియ్ లవ్ ఆంధ్రా!’

ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లినా.. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు పూర్తి చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ చెప్పారని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

''వియ్‌ లవ్‌ ఆంధ్రా.. మాకు ఆంధ్రా అన్నా.. అక్కడి ప్రజలన్నా అభిమానం. 'సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్‌' అనే విధానం అనుసరిస్తున్నాం అని స్పష్టం చేశారు.

2014 ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదర్చడంలో తన పాత్ర ఉందని, ఇప్పుడు విడిపోవడం బాధ కలిగించే విషయమేనని చెప్పారు.

వైసీపీకి తమ పార్టీ దగ్గరవుతుందనేది కూడా అవాస్తవమని చెప్పారు.

ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులు ఏపీకే ఇచ్చాం. మిగతా రాష్ట్రాలు ఈ విషయం అడుగుతుంటే.. ప్రత్యేక పరిస్థితుల వల్లే ఇస్తున్నామని చెప్పాం అని తెలిపార''ని ఆంధ్రజ్యోతి వెల్లడిచింది.

ఫొటో సోర్స్, ISRO

'జీశాట్‌-6ఏ' విఫల ప్రయోగమే!

''భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్‌ నుంచి మార్చి 29న సాయంత్రం 4.56 గంటలకు ప్రయోగించిన జీశాట్‌-6ఏ ఉపగ్రహంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ఈ ఉపగ్రహ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తల్లో నైరాశ్యం నెలకొంది'' అని 'సాక్షి' ఒక కథనాన్ని ప్రచురింది.

తాజా పరిస్థితుల నేపథ్యంలో రూ.260 కోట్లతో నిర్మించి ప్రయోగించిన ఈ ఉపగ్రహం మరో అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోనుందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

మొబైల్‌ టెక్నాలజీతో పాటు సమాచార రంగం బలోపేతం కోసం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌08 రాకెట్‌ ద్వారా జీశాట్‌-6ఏను 170 కి.మీ పెరిజీ (భూమికి దగ్గరగా) 35,975 కి.మీ అపోజీ (భూమికి దూరంగా) భూ బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు.

ఈ ఉపగ్రహం కక్ష్యను 3 దశల్లో పెంచాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. మార్చి 30, 31 తేదీల్లో జీశాట్‌-6ఏ కక్ష్యను రెండుసార్లు విజయవంతంగా పెంచారు.

ఏప్రిల్‌ 1న మూడోసారి కక్ష్యను పెంచే క్రమంలో ఉపగ్రహంలోని ఎలక్ట్రిక్‌ వ్యవస్థలో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో జీశాట్‌-6ఏ మూగబోయిందని సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, Janasena Party/Facebook

'రెండేళ్ల క్రితం చేయాల్సింది!'

ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ వెళ్లి ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు కనీసం రెండేళ్ల ముందు చేసి ఉండాల్సిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అభిప్రాయపడ్డారని 'ఈనాడు' తెలిపింది.

''భాజపా ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేస్తోంటే తెదేపా, వైకాపాలు పరస్పరం నిందించుకుంటూ రాష్ట్ర ప్రజలకు హాని చేస్తున్నాయని అన్నారు.

విజయవాడలో బుధవారం జనసేన కార్యాలయంలో సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు.

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ముందుకు వెళ్లకుండా చేస్తున్న కుట్రను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా మేం భావిస్తున్నాం.

సభ సజావుగా నడవవలసిన బాధ్యతను భాజపా ప్రభుత్వం విస్మరించడం ప్రజాస్వామ్యానికే చేటుగా భావిస్తున్నాం అని సమావేశంలో తీర్మానం చేశార''ని ఈనాడు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)