మధ్యప్రదేశ్ 'శివరాజ'కీయం: సాధువులకు మంత్రి హోదా!

  • షురైహ్ నియాజీ
  • బీబీసీ కోసం, భోపాల్ నుంచి
కంప్యూటర్ బాబా

ఫొటో సోర్స్, shuriah niazi/bbc

ఫొటో క్యాప్షన్,

కంప్యూటర్ బాబా

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు హిందూ సాధువులకు సహాయ మంత్రి పదవులు కట్టబెట్టడంతో వివాదం తలెత్తింది.

వీరిలో ఇద్దరు సాధువులు ఇటీవలే శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'నర్మదా కుంభకోణం రథయాత్ర' నిర్వహిస్తామని ప్రకటించిన వారు కావడం గమనార్హం.

ఆ యాత్రలో వారు ప్రభుత్వం నిర్వహిస్తున్న 'నర్మద యాత్ర'పై ప్రశ్నలు లేవనెత్తాలని భావించారు. ఈ యాత్ర సందర్భంగా జరిగిన కుంభకోణాన్ని కూడా బహిర్గతం చేయాలని వారు భావించారు.

కానీ ఆ యాత్ర మొదలవడానికి ముందుగానే ప్రభుత్వం మంగళవారం నాడు ఓ ఆదేశం జారీ చేస్తూ వారికి సహాయ మంత్రి హోదాలు ఇస్తున్నట్టు ప్రకటించింది. దాంతో వారు తమ యాత్రను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

ఇది అవకాశవాద రాజకీయం అని కాంగ్రెస్ విమర్శించింది. ఎన్నికలకు ముందు ఈ సాధువుల నోళ్లు మూయించి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

ఫొటో సోర్స్, shuriah niazi/bbc

'నర్మదా కుంభకోణం రథయాత్ర'

ప్రభుత్వం సహాయ మంత్రి హోదా ఇచ్చిన వారిలో భయ్యూ మహారాజ్, కంప్యూటర్ బాబా, నర్మదానంద్ మహారాజ్, హరిహరానంద్ మహారాజ్, యోగేంద్ర మహంత్‌లు ఉన్నారు.

ప్రభుత్వం జారీ చేసిన ఆదేశం ప్రకారం, 2018 మార్చి 31న రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల్లో, ప్రత్యేకించి నర్మదా నదీతీర ప్రాంతాల్లో చెట్లు నాటడం, నీటి సంరక్షణ, స్వచ్ఛత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడానికి గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలోని ఐదుగురు విశిష్ట సభ్యులకు సహాయ మంత్రి హోదా ఇచ్చారు.

కమిటీలో భాగమైన కంప్యూటర్ బాబా ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 'నర్మదా కుంభకోణం రథయాత్ర' నిర్వహించి నర్మదా నది ఎదుర్కొంటున్న దుస్థితిని ప్రజల ముందు పెట్టాలని భావించారు.

ముఖ్యంగా, నర్మదా నదీ తీరంలో ఆరు కోట్ల చెట్లు నాటినట్టు ప్రభుత్వం చేస్తున్న వాదనను కంప్యూటర్ బాబా సవాల్ చేశారు. అంతేకాదు, నర్మదలో సాగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాల గురించి కూడా ఆయన చర్చించడానికి సిద్ధమయ్యారు.

ఫొటో సోర్స్, shuriah niazi/bbc

స్వరం మారింది...

అయితే కంప్యూటర్ బాబా ఇప్పుడు గొంతు మార్చారు. "ప్రభుత్వం సాధువులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు యాత్ర నిర్వహించడం ఏ మాత్రం సబబు కాదు" అని ఆయన అన్నారు.

ఇప్పుడు ప్రభుత్వ సదుపాయాలతో నర్మదను సంరక్షించే పనిని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని ఆయన చెప్పారు.

మహంత్ యోగేంద్ర కూడా 'నర్మదా కుంభకోణం రథయాత్ర' కన్వీనర్‌గా పని చేశారు. ఇప్పుడు ఆయన తనకు సహాయమంత్రి హోదా లభించడం పట్ల హర్షం ప్రకటించారు.

"కమిటీ ఏర్పాటు చేయాలన్న మా డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చింది. ఇప్పుడు మేం యాత్రను నిర్వహించబోవడం లేదు" అని ఆయన చెప్పారు.

భయ్యూ మహారాజ్‌కు బీజేపీకి దగ్గరివాడని పేరు. మహారాష్ట్రలో కూడా భయ్యూ మహారాజ్‌ ప్రభావం బాగానే ఉంటుంది.

ఫొటో సోర్స్, facebook@DigvijayaSinghOfficial

మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తన నర్మదా యాత్రను వచ్చే వారం ముగించనున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలం కానున్నారు.

గత కొద్ది నెలలుగా 'నర్మదా యాత్ర' నిర్వహిస్తున్న దిగ్విజయ్ ప్రభుత్వ 'నర్మదా యాత్ర' సందర్భంగా జరిగిన అవకతవకలకు సంబంధించిన సాక్ష్యాలు సేకరిస్తున్నారని సమాచారం.

ఈ సాధువులను దిగ్విజయ్ సింగ్‌ దగ్గరకు వెళ్లకుండా ఆపడం కోసం కూడా ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, shuriah niazi/bbc

ఎన్నికల సంవత్సరంలో ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు, నిర్ణయాలు అన్నీ కూడా రాష్ట్రాన్ని దోచిపెట్టేవిగా, అమ్మేసేవిగా ఉంటున్నాయని ప్రతిపక్ష నేత అజయ్ సింగ్ ఆరోపించారు.

"మతం, రాజకీయాలు రెండూ వేర్వేరు విషయాలు. రెండింటి కార్యక్షేత్రాలు కూడా వేరు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ జారీ చేసిన ఈ తుగ్లక్ తరహా ఆదేశం ఆయనలో గూడుకట్టుకున్న ఫ్యూడల్ మనస్తత్వానికే నిదర్శనం" అని ఆయన అన్నారు.

రాజకీయ విశ్లేషకుడు గిరిజా శంకర్ దీనిపై మాట్లాడుతూ, "సాధారణంగా సాధువుల పాత్ర చాణక్యుడి పాత్రలా ఉంటుంది. సాధువుల పని రాజుకు దిశానిర్దేశనం చేయడం. అంతే తప్ప అధికార పీఠాన్ని చేతుల్లోకి తీసుకోవడం కాదు" అని అన్నారు.

"వారు రాజ్యంలో భాగంగా మారిపోతే ఇక వారు సాధువులు కానట్టే. దీంతో రాజకీయ నేతలకూ, సాధువులకూ మధ్య ఉండాల్సిన పవిత్ర సంబంధం కాస్తా అపవిత్రంగా కనిపిస్తుంది" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)