'అసలు కోదండరామ్ పార్టీని లెక్కలోకే తీసుకోం!'

  • ప్రవీణ్ కాసం
  • బీబీసీ ప్రతినిధి
కోదండరామ్

ఫొటో సోర్స్, NOAH SEELAM/Getty Images

తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకుడు కోదండరామ్ 'తెలంగాణ జన సమితి' పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. బుధవారం నాడు ఆయన తన పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ నెల 29న తమ పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుందని ఆయన ప్రకటించారు.

కేవలం పాలకుల్లో మార్పు కాదు, పాలనలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అయితే, కోదండరామ్ పార్టీపై వివిధ పార్టీలు భిన్న రకాలుగా స్పందించాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ శూన్యతే లేదని, ఈ పరిస్థితుల్లో కోదండరామ్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని టీఆర్ఎస్ పేర్కొనగా, కోదండరామ్ పార్టీతో కలిసి పనిచేస్తామని సీపీఐ స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Professor kodandaram fans page/facebook

'రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదు'

తెలంగాణ జన సమితితో తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ శూన్యతే లేదని, ఈ పరిస్థితిలో పార్టీ పెట్టినా దానికి మనుగడ ఉండబోదని అన్నారు.

''ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరనప్పుడు కొత్త పార్టీలకు అవకాశం ఉంటుంది. వాటిని ప్రజలు ఆదరిస్తారు. కానీ, నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలన ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుస్తోంది. ఉద్యమ కలలను సాకారం చేస్తోంది. ఈ సమయంలో కొత్త పార్టీ అవసరం తెలంగాణలో లేదు'' అని ఆయన పేర్కొన్నారు.

కోదండరామ్ పార్టీని అన్ని పార్టీల మాదిరిగానే చూస్తామని, అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ మాత్రమే తమకు ప్రధాన ప్రత్యర్థి అని పల్లా స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Facebook/jaconline

'ఆ పార్టీ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది'

టీఆర్ఎస్ పార్టీ కోదండరామ్‌కు సరైన గుర్తింపు ఇవ్వలేదని అందుకే ఆయన పార్టీ పెట్టారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఎన్ని పార్టీలు వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

''ప్రొఫసర్ కోదండరామ్‌ను వ్యక్తిగతంగా గౌరవిస్తాం. ఆయన కూడా మా లాగే తెలంగాణ కోసం ఉద్యమించారు. అయితే, ఆయన పార్టీని అన్ని పార్టీల మాదిరిగానే మా ప్రత్యర్థిగానే చూస్తాం'' అని పొన్నం తెలిపారు.

కోదండరామ్ పార్టీ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.

'కోదండరామ్‌తో కలిసి పనిచేస్తాం'

కోదండరామ్ ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి పార్టీతో తాము కలిసి పని చేస్తామని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.

ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రస్తుతం ఆత్మవంచన పాలన నడుస్తోందని ఆయన విమర్శించారు.

''ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉద్యమ నాయకుడిగా పని చేసిన కోదండరామ్ పార్టీ పెట్టడం సరైన చర్య. ఆయన పార్టీతో కలిసి నడుస్తాం. మా మధ్యన భావసారూప్యత ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీజాక్‌తో సీపీఐ పార్టీ కలిసి పోరాటాలు చేసింది'' అని చాడ పేర్కొన్నారు.

కోదండరామ్ పార్టీని తాము మిత్రపక్షంగానే చూస్తామని ఆయన తెలిపారు.

రెండు మూడు నెలల్లో కోదండరామ్ పార్టీ, వామపక్షాలు, ఇతర సంఘాలు ఒక వేదికగా ఏర్పడే అవకాశం ఉందని చాడ చెప్పారు.

ఆ పార్టీ వల్ల టీఆర్ఎస్‌కే లాభం

కోదండరామ్ పెట్టిన పార్టీ వల్ల టీఆర్ఎస్‌కే లబ్ధి చేకూరుతుందని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అభిప్రాయపడ్డారు.

''అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో టీఆర్ఎస్ పార్టీ పెద్దగా చేసిందేమీ లేదు. అధికార పార్టీపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అసంతృప్తి నెలకొంది. ఈ దశలో కొత్త పార్టీ ఏర్పాటు వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం ఉంది. అంతిమంగా అది టీఆర్ఎస్ పార్టీకే ఉపయోగపడుతుంది'' అని ఆయన తెలిపారు.

తెలంగాణ జన సమితి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో ఆ పార్టీతో కలిసి పోరాడేందుకు సిద్ధమని రాంచందర్ రావు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)