కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి బంగారు పతకం

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను బంగారం పతకం సాధించింది. 48 కిలోల విభాగంలో 196 కిలోల బరువెత్తి కామన్వెల్త్ రికార్డ్ సృష్టించింది.
గత రికార్డు నైజీరియాకు చెందిన అగస్టీన్ న్వోకోలో పేరిట నమోదై ఉంది. 2010 కామన్వెల్త్ క్రీడల్లో ఆమె 175 కిలోల బరువెత్తారు.
2018 కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఇది రెండో పతకం. కొద్ది గంటల ముందు పి. గురురాజా పురుషుల 56 కిలో కేటగిరీలో రజత పతకం గెల్చుకున్నారు.
ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్‌గా ఉన్న ఆమె రియో ఒలింపిక్స్‌లో విఫలమై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఆ వైఫల్యం తరువాత డిప్రెషన్‌కు లోనై ఒక దశలో ఏకంగా వెయిట్ లిఫ్టింగ్‌కే దూరమవ్వాలని నిర్ణయించుకున్న ఆమె, మళ్లీ కుటుంబ సభ్యులు, కోచ్ ప్రోత్సాహంతో కొనసాగడమే కాకుండా ఏకంగా ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకుంది.
ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లోనూ సత్తా చాటి రియో వైఫల్యాన్ని అందరి మనసుల నుంచి చెరిపేయగలిగింది.
ఫొటో సోర్స్, Dean Mouhtaropoulos/Getty Images
ఓటమి నుంచి విజయం వైపు..
గతేడాది మీరా అద్భుత ప్రదర్శనతో క్రీడాభిమానుల్ని మురిపించింది. తన బరువుకు దాదాపు నాలుగింతల బరువు.. అంటే 194కేజీలను ఎత్తి 2017 వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుంది. గత 22ఏళ్లలో ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ మీరానే.
స్వర్ణపతకాన్ని మెడలో వేసుకున్న సమయంలో మీరా కంట జారిన కన్నీరు, ఒలింపిక్స్‌లో వైఫల్యం అనంతరం ఆమె అనుభవించిన బాధకు సాక్ష్యంగా నిలిచాయి.
వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీ రోజున శరీర బరువులో తేడా రాకూడదని మీరా భోజనం కూడా చేయలేదు. తన సోదరి పెళ్లికి కూడా వెళ్లకుండా పోటీలో పాల్గొంది. ఆ త్యాగం తాలూకు ఫలితం స్వర్ణ పతకం రూపంలో ఆమెకు లభించింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలవడమే లక్ష్యం పెట్టుకున్న మీరా తన అభిమానులను ఏ మాత్రం నిరాశకు గురి చెయ్యలేదు.
4.1అడుగుల ఎత్తుండే మీరాను చూడగానే చాలామందికి ఆమె వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్ అని అనిపించడం కష్టం. 24ఏళ్ల మీరా మణిపుర్ రాజధాని ఇంఫాల్‌కు 200కి.మీ. దూరంలో ఓ చిన్న పల్లెలో పుట్టింది.
ఫొటో సోర్స్, Getty Images
ఒలింపిక్స్‌లో విఫలమైనా వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం మీరా సొంతమైంది.
పరికరాలు కొనలేక వెదురు బొంగులతో సాధన
మణిపుర్‌కే చెందిన భారతీయ స్టార్ వెయిట్‌లిఫ్టర్ కుంజురాణి దేవికి మీరా పెద్ద అభిమాని. కుంజురాణి స్ఫూర్తితోనే మీరా వెయిట్లిఫ్టింగ్ని తన కెరీర్‌గా ఎంచుకుంది.
మొదట్లో మీరాకు సాధన చేయడానికి కనీసం ఐరన్ బార్స్ కూడా అందుబాటులో లేవు. దాంతో వెదురు బొంగులతోనే ఆమె వెయిట్ లిఫ్టింగ్ సాధన చేసింది. దగ్గర్లోని శిక్షణా కేంద్రానికి రోజూ 50-60 కి.మీ. ప్రయాణించాల్సి వచ్చేది.
మీరాకు రోజూ పాలు, చికెన్ లాంటి పోషకాహారాన్ని అందించే పరిస్థితి కూడా అప్పట్లో ఆమె తల్లిదండ్రులకు లేదు. కానీ ఇవేవీ ఆమె సాధనకు అడ్డురాలేదు.
పదకొండేళ్ల వయసులో మీరా అండర్-15 ఛాంపియన్‌గా ఎదిగింది. పదిహేడేళ్ల వయసులో నేషనల్ జూనియర్ ఛాంపియన్‌గా అవతరించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)