సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష, పదివేల జరిమానా

  • 5 ఏప్రిల్ 2018
సల్మాన్ ఖాన్ Image copyright Getty Images

20 ఏళ్ల క్రితం కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో జోధ్‌పూర్ కోర్టు సల్మాన్‌ ఖాన్‌ను దోషిగా ప్రకటించింది. ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

సల్మాన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.

ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న తక్కిన నటులు సైఫ్‌ అలీ ఖాన్, సొనాలీ బెంద్రె, తబు, నీలమ్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

1998 సెప్టెంబర్ 26వ తేదీన 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు సమీపంలో కంకనీ అనే గ్రామం వద్ద కృష్ణ జింకలను వేటాడిన రెండు కేసులు నమోదయ్యాయి.

అందులో.. సల్మాన్‌పై ‘భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం’ సెక్షన్ 51, సైఫ్ అలీ ఖాన్, తబు, సొనాలీ బెంద్రె, నీలమ్‌లపై సెక్షన్ 51 రెడ్ విత్ సెక్షన్ 149 కింద కేసులు నమోదయ్యాయి.

Image copyright SUNIL VERMA/Getty Images
Image copyright SUNIL VERMA/AFP/Getty Images

ఈ చట్టం కింద కృష్ణ జింకలను అంతరించిపోతున్న ప్రాణులుగా భారత ప్రభుత్వం గుర్తించింది.

ఈ కేసులో 2006 ఏప్రిల్ 10న సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఎనిమిది రోజులున్నారు.

Image copyright SUNIL VERMA/AFP/Getty Images

20 ఏళ్ల కిందట తొలిసారి అరెస్ట్

ఈ కేసులో సల్మాన్ ఖాన్ తొలిసారిగా 1998 అక్టోబర్‌లో సల్మాన్ ఖాన్ అరెస్టయ్యారు.

సెప్టెంబర్ 26వ తేదీన కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు రాగా.. అక్టోబర్ 2వ తేదీన తేదీన బిష్ణోయి వర్గానికి చెందిన కొందరు సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు.

కేసు నమోదైన పది రోజుల తర్వాత సల్మాన్ ఖాన్‌ను అరెస్ట్ అయ్యారు.

అయితే, వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. తర్వాత ఈ కేసు విచారణ న్యాయస్థానంలో కొనసాగింది. గురువారం జోధ్‌పూర్ కోర్టు ఈ కేసులో తుది తీర్పు ఇచ్చింది.

తాను నిర్దోషినని సల్మాన్ ఖాన్ వాదించారు.

సల్మాన్‌ వాదనల్ని తిప్పికొట్టేందుకు పోలీసులు 28 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.

సల్మాన్ ఖాన్ గతంలో ఇదే కేసులో అరెస్టయ్యి ఎనిమిది రోజుల పాటు జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో గడిపారు. ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తుదితీర్పు వెలువడిన నేపథ్యంలో గురువారం పోలీసులు ఆయన్ను కోర్టు నుంచి జైలుకు తరలించనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)