BBC SPECIAL: దళితుల 'భారత్ బంద్' రోజున మధ్యప్రదేశ్ కాల్పుల వైరల్ వీడియో వెనకున్న అసలు కథ ఇదీ!

  • ఫైసల్ మహ్మద్ అలీ
  • బీబీసీ ప్రతినిధి
రివాల్వర్‌తో యువకుడు

ఫొటో సోర్స్, Social Media/Viral Post

ఫొటో క్యాప్షన్,

వైరల్ వీడియోలో కాల్పులు జరిపింది రాజా చౌహాన్ అని భావిస్తున్నారు.

దళితుల పిలుపు మేరకు ఏప్రిల్ 2న జరిగిన భారత్ బంద్ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న హింసకు సంబంధించి తుపాకీ పేలుస్తున్న ఒక వ్యక్తి వీడియో వైరల్ అయ్యింది. అతడు దళిత నిరసనకారుడని మొదట్లో ప్రచారమైంది. తర్వాత అతడు దళితుడే కాదని, అతడి పేరు రాజా చౌహాన్ అని తేలింది. దీనిపై బీబీసీ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది.

రాజా చౌహాన్‌కు క్రికెట్‌, గిటార్, డాన్స్‌తో పాటు గన్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఇప్పుడా చివరి ఇష్టమే అతడిని సమస్యల్లోకి నెట్టింది.

ఓ వ్యక్తి తుపాకీతో ఓ గుంపుపైకి కాల్పులు జరిపే దృశ్యం టీవీలో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో కాల్పులు జరిపిన వ్యక్తి రాజానే అని చాలామంది భావిస్తున్నారు.

ఆ వీడియోలో ఉన్నది ఓ దళిత ఉద్యమకారుడని మీడియాలో మొదట ప్రచారం జరిగింది.

ఏప్రిల్ 2న గ్వాలియర్‌లో చోటు చేసుకున్న హింస నేపథ్యంలో మొత్తం 40 ఎఫ్‌ఐఆర్‌‌లు నమోదు చేశారు. వాటిలో ఒకటి రాజాపైన కూడా ఉంది.

అతడిపైన ఐపీసీ సెక్షన్ 308 కింద కేసు నమోదు చేసినట్లు గ్వాలియర్ ఎస్పీ డా. ఆశిష్ తెలిపారు.

ఫొటో సోర్స్, Social Media/Viral Post

ఫొటో క్యాప్షన్,

హింస తరవాత సోషల్ మీడియాలో రాజా చౌహాన్ ఫొటో వైరల్ అయింది.

దీపక్ అనే 22 ఏళ్ల దళిత యువకుడి హత్యకు కారణమయ్యాడంటూ 'అగ్ర' కులానికి చెందిన బాబీ తోమర్ అనే యువకుడిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 2న జరిగిన కాల్పుల్లో దీపక్ మృతి చెందారు.

అయితే, ఇదంతా కుళ్లు రాజకీయాల ఫలితమనీ, స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినందుకే తన సోదరుడైన బాబీ తోమర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని రాజేష్ సింగ్ తోమర్ ఆరోపించారు.

గ్వాలియర్‌లో తోమర్‌లది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబ సభ్యులు ఎక్కువగా హోటల్, నిర్మాణ రంగాల్లో ఉన్నారు. గత మూడు తరాలుగా తోమర్‌ కుటుంబానికి చెందిన 450 మంది ఒక కిలోమీటర్ పరిధిలో విస్తరించిన తోమర్ బిల్డింగ్‌లోనే ఉంటున్నారు.

ఏప్రిల్ 2న జరిగిన హింసలో మృతి చెందిన ఇద్దరు దళితులు దీనికి సమీపంలో ఉన్న గల్లకోటర్, కుమ్హార్‌పారా కాలనీలలో ఉండేవారు.

తోమర్‌ల భవంతికి అవతలి వైపు రాజా చౌహాన్ నివాసం ఉంది.

హింస చెలరేగిన ఏప్రిల్ 2న రాజా చౌహాన్ అసలు గ్వాలియర్‌లోనే లేడని అతడి తండ్రి సురేంద్ర చౌహాన్ అంటున్నారు. ‘నా కొడుకు బీ.ఈ. చదివాడు. స్కిల్ ఇండియా కోసం పనిచేస్తున్నాడు. ఆ పని మీదే వేరే ఊరికి వెళ్లాడు’ అని ఆయన చెబుతున్నారు.

టీవీలో చూపించిన దృశ్యాల గురించి ప్రస్తావిస్తే అది పాత వీడియో అని ఆయన అంటున్నారు.

మరోపక్క రాజా బంధువు నరేంద్ర సింగ్ చౌహాన్ మాత్రం ఆ రోజున కాల్పులు చోటు చేసుకున్నాయని అంగీకరిస్తూనే, అయితే ఆ గుంపులో రాజా లేడని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Manoj Thakur

‘కాల్పులు జరిపిన వారి చేతుల్లో నాటు తుపాకులన్నాయి. వాళ్లంతా తమ మొహాలను గుడ్డలతో కప్పేసుకున్నారు. వాళ్లక్కడ విధ్వంసం సృష్టించడానికి యత్నించారు’ అని నరేంద్ర చౌహాన్ చెప్పారు. ‘అటు పక్క నుంచి తూటాలను ఫైర్ చేసినప్పుడు ఆత్మ రక్షణ కోసం ఇటుపక్క నుంచి కూడా కాల్పులు జరపాలి కదా’ అని తెలిపారు.

నరేంద్ర చౌహాన్ గతంలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్)లో పనిచేసి రిటైరయ్యారు.

ఈ కాల్పుల ఉదంతం గురించి గ్వాలియర్‌లోని జీవాజీ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ఏపీ చౌహాన్‌తో మాట్లాడినప్పుడు దళిత ఉద్యమకారుల దగ్గర తుపాకులు ఉన్నాయని ఆరోపించడం పూర్తిగా తప్పని అన్నారు.

కొందరు వ్యక్తులు దళితుల నిరసనను బలవంతంగా అడ్డుకోవడానికి ప్రయత్నించారనీ, దాంతో వారు అనివార్యంగా ప్రతిఘటించారనీ, అందుకే హింస చెలరేగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో క్యాప్షన్,

చనిపోయిన దళిత యువకుడు దీపక్ సోదరుడు రాజన్ (నీలి రంగు చొక్కా)

కాల్పుల్లో చనిపోయిన దీపక్ సోదరుడు రాజన్ మాట్లాడుతూ, "అటు నుంచి తూటాలు మావైపు దూసుకొచ్చినప్పుడు మమ్మల్ని మేం కాపాడుకోవడానికి రాళ్లు విసరాల్సి వచ్చింది" అని అన్నారు.

"ఏప్రిల్ 2న జరిగిన దళిత ఉద్యమాన్ని కులాల కొట్లాటగా మార్చేందుకు కొందరు ముందుగానే పథకం రచించారు" అని దళిత హక్కుల కార్యకర్త సుధీర్ మండలియా పేర్కొన్నారు.

నిరసనల సందర్భంగా రాష్ట్ర మంత్రి లాల్ సింగ్ ఆర్యా నివాసంపైనా కొందరు రాళ్లు విసిరారు.

మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు కారణం దళితులే అని కొన్ని మీడియా సంస్థలు చిత్రించే ప్రయత్నం చేశాయి. కొందరు స్థానికులు కూడా అదే మాట చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో ఘర్షణల్లో చనిపోయిన ఏడుగురిలో ఆరుగురు దళితులే!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)