#BBCShe: అబ్బాయిగా జీవించడం ఎంత కష్టమో!
- దివ్య ఆర్య
- బీబీసీ ప్రతినిధి

అమ్మాయిల గురించి అబ్బాయిల అభిప్రాయం ఏమిటి? అబ్బాయిల దృష్టిలో అమ్మాయి అంటే ఓ 'వస్తువా'?
"అందరూ మహిళల గురించే మాట్లాడుతుంటారు. మా హక్కుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు."
"మహిళా దినోత్సవం పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తారు. కానీ, పురుషుల దినోత్సవం అన్న మాటే ఎత్తరు."
"మహిళలు అన్ని హక్కులనూ సాధించుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని వస్తువులుగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది."
#బీబీసీ షి ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్ వెళ్లినప్పుడు కాలేజీలో అమ్మాయిలతో ముచ్చటించిన తర్వాత అబ్బాయిలతోనూ మాట్లాడాను.
అప్పుడు వాళ్లు చేసిన ఫిర్యాదులే పైన పేర్కొన్నవి.
కొద్ది మంది అబ్బాయిల వల్ల, అందరికీ చెడ్డపేరు వస్తోందని ఆ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అబ్బాయిగా జీవించడం చాలా కష్టంగా మారిందని అన్నారు.
అమ్మాయిలతో ఎంతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాల్సి వస్తోందని, లేదంటే వారు తప్పుగా అర్థం చేసుకుంటారేమో అన్న భయం కలుగుతోందని చెప్పుకొచ్చారు.
"వాళ్లు హీరోలుగా ఫీలవుతారు"
అయితే, అదే కళాశాలకు చెందిన అమ్మాయిలతో మాట్లాడినప్పుడు.. సూటిపోటి మాటలతో అబ్బాయిలు తమను ఎలా వేధిస్తారో వివరించారు.
"అబ్బాయిలు మమ్మల్ని వేధిస్తారు. మీ తీరు నచ్చట్లేదన్నా వినరు. వాళ్లకు వాళ్లే హీరోలుగా ఫీలవుతూ పోజులిస్తారు. అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు" అని కళాశాల విద్యార్థినులు తెలిపారు.
సుమారు 20 లక్షల జనాభా ఉన్న పట్టణం రాజ్‌కోట్.
ఇక్కడి రోడ్లపై అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి నడవడం చాలా అరుదు.
కలిసి చదువుకుంటారు. అయినా, కళాశాలల్లో చాలావరకు అమ్మాయిలు, అబ్బాయిలు వేరువేరు బృందాలుగా ఉంటారు.
మంచి ఇంటర్నెట్ సదుపాయం ఉంది. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఇక్కడ చాలా పాపులర్.
కానీ, ఫేస్బుక్లో అమ్మాయిలు తమ ఖాతాలను 'ప్రైవేట్'గానే ఉంచుకుంటారు. సోషల్ మీడియాలో వేధింపుల భయంతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే జాగ్రత్తగా పరిశీలిస్తామని ఓ యువతి చెప్పారు.
"అమ్మాయిలను అబ్బాయిలు ఓ 'వస్తువు'గా చూస్తారు"
ఈ విషయాన్ని అబ్బాయిల ముందు ప్రస్తావించినప్పుడు, కొద్ది మంది అబ్బాయిల వల్లనే అలాంటి సమస్య వస్తోందని అన్నారు.
అమ్మాయి 'నో' చెబితే, 'యెస్' అనుకునే వారు మాత్రమే అలా వేధింపులకు పాల్పడతారని వివరించారు.
అందుకు బాలీవుడ్ సినిమాలు కూడా కారణమే అని మరో యువకుడు వ్యాఖ్యానించారు.
"అమ్మాయిలను ఎప్పుడూ ఫాలో అవుతుండాలి. ఆమె అంగీకరించకపోయినా అలాగే వెంటపడుతూ ఉండాలి. ఎప్పటికైనా ఆమె మనసు కరుగుతుంది, ప్రేమలో పడుతుంది. తర్వాత పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతాం. అంటూ.. ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో చూపిస్తున్నారు. మొదట్లో నేను కూడా సినిమాల్లో చూపించేది నిజమే అనుకునే వాడిని. కానీ, చాలామంది అమ్మాయిలు నన్ను తిరస్కరించిన తర్వాత బలవంతపెడితే, వేధిస్తే వాళ్లు ఇష్టపడరన్న విషయం అర్థమైంది'' అని ఆ యువకుడు వివరించారు.
మరి ఆ విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఎందుకంత కష్టం?
ఈ ప్రశ్న అడగ్గానే అందరూ కొద్దిసేపు సైలెంట్ అయిపోయారు.
తర్వాత "నిజానికి అమ్మాయిలను అబ్బాయిలు ఓ 'వస్తువు'గానే చూస్తారు తప్ప మనుషులుగా చూడరు" అని ఓ యువకుడు మెల్లగా అన్నాడు.
"ఇద్దరు అబ్బాయిలు కలిసి కూర్చుని ఉన్నప్పుడు వారి ముందుగా ఓ అమ్మాయి వెళ్తోందంటే వాళ్లు ఆమె గురించే మాట్లాడుకుంటారు" అని అతడు మొహమాటం లేకుండా చెప్పాడు.
అప్పుడు ఏం మాట్లాడుకుంటారో కూడా వివరంగా చెప్పేందుకు ఆ అబ్బాయి సిద్ధంగానే ఉన్నాడు.
కానీ, మాట్లాడకు అంటూ తన స్నేహితుడు సైగ చేయడంతో ఆగిపోయాడు. ఎలా ఉందో అలా ఉండనీయండి. ఇక ఏమీ అడగకండి అన్నాడు.
ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే 'తోపు'
వారి నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నించాను.
ఓ అబ్బాయి లేచి.. "మాకు రెండు అభిప్రాయాలు లేవు. అబ్బాయి ఒక అమ్మాయికి బ్రేకప్ చెప్పేసి మరో అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్‌గా చేసుకుంటే ఓకే. కానీ, బ్రేకప్ తర్వాత అమ్మాయి మరో వ్యక్తితో స్నేహంగా ఉంటే మాత్రం ఆమెది 'చీప్' క్యారెక్టర్ అన్న ముద్ర వేస్తారు" అని వివరించారు.
ఆ యువకుడు వాస్తవాన్ని గ్రహించాడు. తప్పు ఎక్కడుందో తెలుసుకున్నాడు. అందుకే అందరి ముందు చెప్పగలిగాడు.
ఇలాంటి అభిప్రాయమే నాగ్‌పూర్ వెళ్లినప్పుడు కూడా ఓ అమ్మాయి వ్యక్తం చేశారు. "ఒక అబ్బాయికి ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అతన్ని 'తోపు' అంటారు. అదే అమ్మాయికి ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఆమెను 'చీప్' అంటారు" అని ఆ యువతి తెలిపారు.
నాగ్‌పూర్, రాజ్‌కోట్‌కు చెందిన ఈ యువతీ యువకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను గమనిస్తే, వారిలో వాస్తవాలను అంగీకరించే తత్వం పెరుగుతోందన్న విషయం అర్థమవుతుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)