సల్మాన్ ఖాన్‌ను జైలుకు పంపించిన బిష్నోయిలు ఎవరు?

  • నారాయణ బారేఠ్
  • బీబీసీ కోసం, జైపూర్ నుంచి
బిష్నోయి సముదాయం

ఫొటో సోర్స్, AFP/Getty Images

నిర్జన ఎడారి ప్రాంతంలో వన్య ప్రాణులనూ, చెట్లను కాపాడడానికి నడుం బిగించిన జన సముదాయం బిష్నోయిలది.

బిష్నోయి సముదాయానికి చెందిన వారు అటవీ జంతువులను, చెట్లను కాపాడడం కోసం తమ ప్రాణాలివ్వడానికైనా వెనుకాడరని ప్రతీతి.

అందుకే, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల్ని వేటాడారన్న విషయం తెలియగానే ఈ సముదాయానికి చెందిన జనాలంతా రోడ్డెక్కారు.

బిష్నోయి సముదాయానికి చెందిన వారు తమ ఆరాధ్య గురువు జంభేశ్వర్ బోధించిన 29 నియమాలను పాటిస్తారు. పశుపక్ష్యాదులనూ, చెట్లను కాపాడడం అన్నది వీటిలో ఒకటి.

బిష్నోయిలు కేవలం ఎడారి ప్రాంతంలోనే లేరు. రాజస్థాన్‌తో పాటు హరియాణా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వారు ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

తమ సముదాయానికి చెందిన త్యాగధనులను గుర్తు చేసుకోవడం కోసం బిష్నోయిలు ఏటా రాజస్థాన్‌లోని ఖేజ్‌డలీ గ్రామంలో మేళాలో పాల్గొంటారు.

బిష్నోయి సముదాయం

జోధ్‌పూర్ నుంచి గతంలో ఎంపీగా ఉన్న జస్వంత్ సింగ్ ఈ విషయంపై మాట్లాడుతూ, "మా సంస్థాపకుడు జంభేశ్వర్ భూతదయను బోధించారు. ప్రాణులను కాపాడాలి. చెట్లను రక్షించాలి అన్నది ఆయన మాకు నేర్పిన పాఠం. ఈ పనులు చేసిన వ్యక్తికి వైకుంఠం ప్రాప్తిస్తుందని ఆయన బోధించారు" అని అన్నారు.

రాజరికపు రోజుల్లో ఈ సముదాయానికి చెందిన వారు చెట్లనూ, పశుపక్షులను కాపాడడం కోసం రాజ్యంతో సైతం పోరాడిన సందర్భాలున్నాయి.

బిష్నోయి సమాజానికి చెందిన పర్యావరణ కార్యకర్త హనుమాన్ బిష్నోయి మాట్లాడుతూ, "జోధ్‌పూర్ రాజ్యంలో నాటి పాలకులు చెట్లు నరకాలని ఆదేశించినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ బిష్నోయి సమాజం వారు ఆందోళన చేపట్టారు. ఇది 1787 నాటి విషయం. ఆ సమయంలో ఈ రాజ్యాన్ని అభయ్‌సింగ్ పాలించేవాడు" అని చెప్పారు.

"ఆ సమయంలో - సర్ సాఠే రూంఖ్ రహే తో భీ సస్తో జాన్ - అనే నినాదం ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే, తల నరుక్కొని అయినా సరే చెట్లు కాపాడుదాం. ఎందుకంటే చెట్ల కంటే మన తలలే చౌక" అని జోధ్‌పూర్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి జస్వంత్ బిష్నోయి అన్నారు.

ఫొటో సోర్స్, iStock

'పూర్వీకుల త్యాగాలు'

"రాజభటులు వచ్చి చెట్లు నరకడానికి ప్రయత్నించగా జనం జోధ్‌పూర్ దగ్గరలో ఉన్న ఖేజ్‌డలీకి చేరుకొని దానికి నిరసన తెలిపారు" అని బిష్నోయి చెప్పారు.

"ఆ సమయంలో బిష్నోయి సమాజానికి చెందిన అమృతాదేవి నిరసన ప్రదర్శనలకు నేతృత్వం వహించారు. చెట్టుకు బదులు తనను నరకండని ఆమె ముందుకొచ్చారు."

ఆ సందర్భంగా చెట్లను కాపాడేందుకు మొత్తం 363 మంది ప్రాణాలు అర్పించారు. వారిలో 111 మంది మహిళలు."

"నాడు ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తు చేసుకోవడం కోసం ఖేజ్‌డలీలో ప్రతి ఏటా మేళా జరుగుతుంది. జనం తమ పూర్వీకుల బలిదానాలను గుర్తు చేసుకొని వారికి శ్రద్ధాంజలి ఘటిస్తారు."

"తమ సంకల్పాన్ని ప్రకటించడానికే కాకుండా, వన్య ప్రాణులనూ, చెట్లనూ రక్షించాల్సిన బాధ్యత గురించి కొత్త తరాలకు అవగాహన కల్పించడం కోసం కూడా ఈ మేళాను నిర్వహిస్తుంటారు."

ఫొటో సోర్స్, Youtube

గురు జంభేశ్వర్ - బిష్నోయిల గురువు

గురు జంభేశ్వర్ 1451లో జన్మించారు. బీకానేర్ జిల్లాలోని సమర్‌స్థల్ గురువు జన్మస్థలం. అది బిష్నోయిలకు ఓ తీర్థ స్థలం.

ఆ ప్రాంతంలో ఉన్న మకామ్‌లో గురు జంభేశ్వర్ సమాధి కూడా ఉంది. అక్కడ కూడా ప్రతి ఏటా మేళా జరుగుతుంది.

మార్వాడ్ రాజ్యంలో జనగణన సూపరింటిండెంట్ (సెన్సస్ సూపరింటిండెంట్)గా ఉన్న మున్షీ హర్‌దయాల్ బిష్నోయి సముదాయం గురించి ఓ పుస్తకం రాశారు.

"బిష్నోయి సమాజం సంస్థాపకుడైన జంభోజీ పవార్ (జంభేశ్వర్) నిజానికి రాజ్‌పుత్ కులానికి చెందిన వాడు. 1487లో తీవ్రమైన కరవు ఏర్పడినప్పుడు జంభోజీ ప్రజలను ఆదుకోవడానికి బాగా కృషి చేశారు" అని ఆయన ఆ పుస్తకంలో రాశారు.

"ఆ సమయంలో జాట్ సముదాయం వాళ్లు కూడా జంభోజీతో ప్రభావితులై, బిష్నోయి సంప్రదాయాన్ని స్వీకరించారు."

ఫొటో సోర్స్, iStock

'బీస్ (ఇరవై), నౌ (తొమ్మిది) కలిస్తే బిష్నోయి'

జంభోజీ హిందువుల దేవుడైన విష్ణువు అవతారమని బిష్నోయి సముదాయం వారు విశ్వసిస్తారని మున్షీ హర్‌దయాల్ రాశారు.

జంభోజీ బోధించిన మొత్తం 29 జీవన నియమాల సారమే బిష్నోయి అని వ్యాఖ్యానిస్తారు. ఇరవై (బీస్), తొమ్మిది (నౌ) కలిసి బిష్నోయి అయ్యింది.

బిష్నోయి సమాజంలో చనిపోయిన వారిని ఖననం చేస్తారు.

మాజీ ఎంపీ బిష్నోయి ఇలా అంటారు: "రాజస్థాన్, హరియాణా, పంజాబ్ మొదలైన రాష్ట్రాల్లో ఎవరైనా చనిపోతే శవాన్ని ఖననం చేస్తారు. యూపీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం దహనం చేస్తారు."

ఎడారిలో వన్య ప్రాణుల విషయంలో బిష్నోయిలు చాలా కచ్చితమైన వైఖరితో ఉంటారు. జింకల్ని వేటాడే వారితో బిష్నోయిలు తలపడ్డారన్న వార్తలు తరచుగా వినవస్తుంటాయి.

ఫొటో సోర్స్, iStock

ప్రగాఢ బంధం

బిష్నోయిలు ఎక్కువగా ఉండే గ్రామాల్లో బిష్నోయి మహిళలు అనాథ జింకపిల్లను చంకలోకి ఎత్తుకొని స్తన్యం ఇచ్చే దృశ్యాలు కూడా కనిపిస్తాయి.

"మూగజీవాలతో బిష్నోయి సమాజానికి ఎంత లోతైన సంబంధాలుంటాయనడానికి ఇది ఉదాహరణ మాత్రమే" అని మాజీ ఎంపీ బిష్నోయి అంటారు.

సాధారణంగా బిష్నోయిలకు వ్యవసాయం, పశుపాలనలే ప్రధాన వ్యాపకం. అయితే కాలగమనంతో పాటు బిష్నోయిలు కూడా పరిశ్రమల్లోకి, వ్యాపారంలోకి అడుగుపెట్టారు.

"ప్రకృతిని గౌరవించాలని జంభోజీ మాకు నేర్పించారు. మేం సమస్త ప్రాణుల సహఅస్తిత్వాన్ని విశ్వసిస్తాం" అని బిష్నోయి సమాజానికి చెందిన హనుమాన్ బిష్నోయి అంటారు.

"మానవ జీవితం ఎంత విలువైందో, ప్రకృతిని కాపాడడం కూడా అంతే విలువైంది."

"జంభోజీ జీవితంతో, బోధనలతో ప్రభావితులైన అనేక కులాల వారు బిష్నోయి జీవన విలువల పట్ల విశ్వాసం ప్రకటించారు. బిష్నోయిలుగా మారిపోయారు" అని ఆయనంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)