ప్రెస్ రివ్యూ : 'సిమ్‌కార్డుల కోసం ఉగ్రవాదులు దరఖాస్తు చేసుకుంటారా?’

ఆదార్ ఫింగర్ ఫ్రింట్స్

ఫొటో సోర్స్, AFP

ఆధార్ సర్వరోగ నివారిణి కాదు : సుప్రీంకోర్టు

ఆధార్‌ సర్వరోగ నివారిణి కాదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసిందని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఉగ్రవాదం, బ్యాంకింగ్‌ మోసాలు వంటి అన్ని సమస్యలకు ఆధారే విరుగుడు అని కేంద్రం చేస్తున్న వాదనతో విభేదించింది. కొద్దిమంది ఉగ్రవాదులను పట్టుకోవడానికి మొత్తం ప్రజలందరి మొబైల్‌ ఫోన్లను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని అడగడమేమిటని ప్రశ్నించింది.

ఆధార్‌ పథకం, ఆధార్‌ చట్టం రాజ్యాంగబద్ధతపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.కె.సిక్రి, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌తో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.

''మోసగాళ్ల గుర్తింపు గురించి సందేహం ఏమీ ఉండదు. ఎవరికి రుణం ఇస్తున్నదీ బ్యాంకులకు తెలుసు. మోసగాళ్లతో బ్యాంకు అధికారులే చేతులు కలుపుతున్నారు. ఈ మోసాలను ఆధార్‌ నిలువరించలేదు. ఒకటి కన్నా ఎక్కువ గుర్తింపుపత్రాలు ఉండడం వల్ల బ్యాంకింగ్‌ మోసాలు జరగడం లేదు.'' అని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌కు ధర్మాసనం చెప్పింది.

ఉపాధి హామీ లాంటి పథకాల్లో నకిలీ లబ్ధిదారులను గుర్తించడానికి మాత్రం ఆధార్‌ సహకరించవచ్చంది. మొబైల్‌తో ఆధార్‌ అనుసంధానం వల్ల ఉగ్రవాదులను పట్టుకోవడానికి వీలవుతుందని వేణుగోపాల్‌ చెప్పగా..

''ఉగ్రవాదులు సిమ్‌కార్డుల కోసం దరఖాస్తు చేస్తారా?''అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్దేశంలో న్యాయబద్ధమైన దేశ ప్రయోజనాలు ఇమిడి ఉండవచ్చని, అంతమాత్రాన పట్టుకోవడానికి 120 కోట్ల మందిని ఆధార్‌తో మొబైల్‌ ఫోన్లను అనుసంధానించుకోవాలని అడగడం సబబుకాదని పేర్కొంది.

అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదనలు ముగియలేదు. ఆయన తదుపరి వాదనలను ఈనెల 10న వినిపిస్తారని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, facebook/YSRCP

నేడు వైఎస్ఆర్‌సీపీ హోదా దీక్షలు, పాదయాత్రలు..

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, ఆమరణ దీక్ష చేపట్టబోతున్నారని సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

శుక్రవారం నాడు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేసి, ఆ తర్వాత దిల్లీలోని ఏపీ భవన్ చేరుకుని అక్కడ ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారని తెలిపింది.

మరోవైపు.. ప్రత్యేక హోదా కోసం శుక్రవారం నాడు విజయవాడలో జనసేన పాదయాత్ర చేపట్టనున్నట్లు సాక్షి తెలిపింది.

ఈ పాదయాత్రలో పవన్ కల్యాణ్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణ నిర్వహించనున్నారు.

శుక్రవారం ఉదయం 10గంటలకు బెంజ్ సర్కిల్‌లో పాదయాత్ర ప్రారంభంకానుందని సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, facebook/ktr

2019లో అధికారం రాకుంటే కేటీఆర్ సన్యాసం!

2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేసినట్లు 'నవతెలంగాణ' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఈ సవాల్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమా? అని కేటీఆర్ సవాల్ విసిరారు.

హైదరాబాద్ నుంచి 200 మందిని వెంటబెట్టుకుని నియోజకవర్గాల్లో బస్సుయాత్రలు చేస్తే కాంగ్రెస్‌కు 80 సీట్లు ఎలా వస్తాయన్నారు. 80 ఏమోకానీ.. 8 సీట్లు కూడా రావని, రాష్ట్రంలో 80 గ్రామపంచాయితీలను కూడా గెలిచే స్థితిలో కాంగ్రెస్ లేదని ఆయన ఎద్దేవా చేశారు.

2014 ఎన్నికల్లో.. రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీచేత ప్రకటన చేయించినా, 1లక్ష మాత్రమే రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్‌కే ప్రజలు పట్టం కట్టారని కేటీఆర్ మాట్లాడినట్లు నవతెలంగాణ ప్రచురించింది.

ఫొటో సోర్స్, facebook

బీసీసీఐ జాక్‌పాట్

ఐదేళ్లలో భారత జట్టు స్వదేశంలో ఆడబోయే మ్యాచ్‌ల ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

2018- 2023 మధ్య జరిగే మొత్తం 102 మ్యాచ్‌ల గ్లోబల్‌ కన్సాలిడేటెడ్‌ రైట్స్‌ (భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్త టీవీ, డిజిటల్‌ హక్కులు)ను ఎవరూ ఊహించని విధంగా స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.6,138 కోట్లకు దక్కించుకుంది.

ఇది క్రితంసారి కన్నా 59 శాతం (రూ.2,287 కోట్లు) అత్యధికం కావడం విశేషం. ఈ ఏడాది జూన్‌ నుంచి మార్చి 2023 వరకు తాజా ఒప్పందం అమల్లో ఉంటుంది.

ఈ సమయంలో భారత్‌.. తొమ్మిది జట్లతో 22 టెస్టులు, 45 వన్డేలు, 35 టీ20లు ఆడనుంది. మూడు రోజుల పాటు తొలిసారిగా జరిగిన ఈ-వేలంలో జియో, సోనీ కూడా స్టార్‌ గ్రూప్‌నకు గట్టి పోటీనిచ్చాయి. ఇక ఈ ఒప్పందంలో భాగంగా దేశవాళీ పోటీలతో పాటు మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లను కూడా స్టార్‌ ప్రసారం చేయాల్సి ఉంటుంది.

గతంలో రూ.3,851 కోట్లు

2012-2018 హక్కుల కోసం ఇదే స్టార్‌ గ్రూప్‌ రూ.3,851 కోట్లు మాత్రమే బోర్డుకు చెల్లించింది. ఈసారి భారత్‌ పటిష్ట జట్లతో తలపడనుండడంతో హక్కుల కోసం కాస్త గట్టి పోటీ ఎదురైంది.

దీంతో దూకుడును ప్రదర్శించిన స్టార్‌.. పోటీదార్లను వెనక్కినెట్టి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అటు ఐపీఎల్‌ హక్కులను కూడా ఐదేళ్ల పాటు స్టార్‌ గ్రూప్‌ రూ.16,347 కోట్లకు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

దీంతోపాటు ఐసీసీ అన్ని టోర్నమెంట్స్‌ (పురుషుల, మహిళల వన్డే, టీ20 ప్రపంచక్‌పలు) హక్కులు కూడా స్టార్‌ స్పోర్ట్స్‌ దగ్గరే ఉన్నాయని ఆంధ్రజ్యోతి కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)