కామన్వెల్త్ క్రీడలు: వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం సాధించిన భారత టీనేజర్ దీపక్

దీపక్ లాథేర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దీపక్ లాథేర్

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడాపోటీల్లో శుక్రవారం పురుషుల 69 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ దీపక్ లాథేర్ భారత్‌కు కాంస్య పతకాన్ని సాధించి పెట్టాడని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. దీపక్‌‌కు 18 సంవత్సరాలు.

''దీపక్ 'స్నాచ్' విధానంలో 136 కేజీలు, 'క్లీన్ అండ్ జర్క్' విధానంలో 159 కేజీలు మొత్తమ్మీద 295 కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు’’ అని పీటీఐ చెప్పింది.

'స్నాచ్‌'లో బరువును భుజాలపై ఆపుకోకుండా నేరుగా పైకెత్తాల్సి ఉంటుంది. 'క్లీన్ అండ్ జెర్క్‌'లో బరువును తలకన్నా పైకి ఎత్తడానికి ముందు భుజంపైన కాసేపు నిలుపుకుంటారు.

దీపక్ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడం ఇదే ప్రథమం. ప్రస్తుత కామన్వెల్త్ పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం. ఇంతకుముందు భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది.

భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:45 గంటల సమయానికి పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

సంజీతా చాను

ఇంతకుముందు భారత వెయిట్‌లిఫ్టర్ సంజీతా చాను వరుసగా మూడు ప్రయత్నాల్లో 81, 83, 84 కిలోల బరువునెత్తారు. 'క్లీన్ అండ్ జెర్క్‌'లో ఆమె 104, 108 కిలోల బరువునెత్తారు. మూడోసారి ఆమె 112 కేజీల బరువునెత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా ఆమె తన సమీప ప్రత్యర్థిని 10 కిలోల తేడాతో ఓడించి స్వర్ణం గెల్చుకున్నారు.

స్నాచ్ పోటీలో సంజీత తన సమీప ప్రత్యర్థి కన్నా మూడు కిలోలు ఎక్కువ బరువెత్తారు.

గురువారం భారత్‌కు చెందిన మీరాబాయి చాను 48 కిలోల విభాగంలో స్వర్ణం, పి. గురురాజా 56 కిలోల విభాగంలో రజతం గెల్చుకున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)