ఈ ‘డాక్టర్’ స్వర్ణానికి గురిపెట్టారు.. సాధించారు.

  • 8 ఏప్రిల్ 2018
హీనా సిద్ధు Image copyright Getty Images

షూటింగ్‌ను ఇష్టపడేవారందరికీ హీనా సిద్ధూ పేరు సుపరిచితమే. 2016లో ఇరాన్‌లో ఓ టోర్నీలో పాల్గొన్నప్పుడు అక్కడ మొహానికి హిజాబ్ ధరించే ప్రసక్తే లేదని చెప్పడం ద్వారా ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు.

డెంటల్ సర్జరీ పూర్తి చేసిన హీనా తండ్రి బాటలోనే షూటింగ్‌లోకి అడుగుపెట్టి ఓ దశలో వరల్డ్ నంబర్ వన్ స్థానాన్నీ చేరుకున్నారు.

పంజాబ్‌లోని లూధియానాలో పుట్టిన హీనా మొదట న్యూరాలజిస్ట్‌గా మారి వైద్య వృత్తిలోనే స్థిరపడాలనుకున్నారు. కానీ కాలేజీలో చదివే రోజుల్లో కాస్త ఆటవిడుపు కోసం తన అంకుల్ దగ్గర షూటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టారు.

అలా ఆటవిడుపుగా మొదలైన షూటింగ్‌పైన క్రమంగా ఆమెకు ఆసక్తి పెరిగింది. దాంతో కాలేజీ రోజుల్లోనే పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించారు. ఆపై నెమ్మదిగా ఆ ఆటనే తన కెరీర్‌గా మలచుకున్నారు.

Image copyright Getty Images

19ఏళ్ల వయసులో హంగేరియన్ ఓపెన్ టైటిల్, 2009 వరల్డ్ కప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. తరవాత తన కోచ్ రోనక్ పండిట్‌నే హీనా పెళ్లి చేసుకున్నారు.

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 10మీ ఎయిర్ పిస్టోల్ విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకున్న తొలి భారతీయురాలు హీనానే. 2013లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి మరీ ఆమె ఈ ఘనతను సాధించారు. అదే ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లో కూడా హీనా స్వర్ణాన్ని సాధించారు.

తరవాత షూటింగ్‌లో ప్రపంచ నంబర్ 1 స్థానానికీ చేరుకున్నారు. తన జీవితంలో బాగా గర్వించిన క్షణం అదేనంటారు హీనా.

‘స్థిరత్వం, టైమింగ్, ట్రిగ్గర్‌పై నియంత్రణ.. షూటింగ్‌లో రాణించడానికి ఈ మూడు నైపుణ్యాలు కీలకం’ అని హీనా గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి ఆమె రకరకాల వ్యాయామాలు చేస్తారు.

షూటింగ్ ప్రధానంగా శరీర దృఢత్వానికి సంబంధించిన అంశం కాకపోయినా, హీనా తన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పోటీ రోజున కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా తీసుకుంటారు. టీ, కాఫీలకు దూరంగా ఉంటారు.

Image copyright Heenasidhu

చాలామంది క్రీడాకారుల్లానే హీనా కెరీర్‌లో కూడా ఎత్తుపల్లాలున్నాయి. 2017లో వేలి గాయం కారణంగా ఆమె కొన్నాళ్లు ఆటకు దూరమయ్యారు. చికిత్స అనంతరం మళ్లీ షూటింగ్‌లోకి అడుగుపెట్టి పతకాలకు గురిపెట్టారు.

ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, గతేడాది కామన్వెల్త్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, గతేడాది వరల్డ్ కప్‌లో జితు రాయ్‌తో కలిసి స్వర్ణం.. ఇలా అనేక విజయాలు హీనా ఖాతాలో ఉన్నాయి.

ఈ ఏడాది ఫోర్బ్స్ అండర్-30 ఎచీవర్ల జాబితాలోనూ హీనాకు చోటు దక్కింది.

షూటింగ్ కాకుండా పుస్తకాలు చదవడం, పర్యటించడం అన్నా హీనాకు ఇష్టం. ఆమె చేతులకు గురి తప్పకుండా కాల్చడమే కాదు, అందమైన పెయింటింగ్‌లు వేయడం కూడా తెలుసు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)