కామన్వెల్త్ డైరీ: సైనాకు కోపమెందుకు వచ్చింది? మీరా ఆస్ట్రేలియన్లకు ఎందుకు నచ్చింది?

  • 7 ఏప్రిల్ 2018
మీరాబాయ్ చాను Image copyright Getty Images

స్వర్ణ పతకాన్ని గెలిచే క్రమంలో మీరా తన బరువుకంటే రెండింతల బరువును ఎత్తారు. వెయిట్ లిఫ్టింగ్ ప్లాట్‌ఫాంపైకి అడుగుపెడుతూనే భూమిని ముద్దాడి, ప్రేక్షకులకు అభివాదం చేసి, ఐరన్ బార్‌కి తన నుదుటిని ఆనించి వెయిట్‌లిఫ్టింగ్‌పై తనకున్న గౌరవాన్ని మీరా చాటారు.

స్టేడియంలో ఉన్నంత సేపూ మీరా మొహంపై చిరునవ్వు చెరగలేదు. ఆ నవ్వుకు ఆస్ట్రేలియా ప్రేక్షకులు కూడా అభిమానులైపోయారు. ఆమె విజయాన్ని ప్రకటించగానే అంతా నిలబడి చప్పట్లు చరిచారు. తన మెడలో బంగారు పతకం పడే సమయానికి పైకి లేచిన త్రివర్ణ పతాకాన్ని చూసి ఆనందంతో మీరా కంట కన్నీరు ఆగలేదు.

ఆమె స్టేడియంనుంచి బయటకు రాగానే ఇంటర్వ్యూ కోసం ఆస్ట్రేలియా టీవీ కరస్పాండెంట్ ఒకరు మీరా దగ్గరికొచ్చారు. ఆయన అడిగిన ప్రశ్నలు ఆమెకు అర్థం కాలేదు. దాంతో నేనే ఆమెకు ట్రాన్స్‌లేటర్‌లా మారా. అతడి ప్రశ్నలను హిందీలోకి, ఆమె జవాబులను ఇంగ్లిష్‌లోకి అనువదించి చెప్పా.

రియో ఒలింపిక్స్‌లో సరైన ప్రదర్శన చేయనందుకు చాలా బాధపడ్డాననీ, ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తేవాలనే పట్టుదల తనలో ఏమాత్రం తగ్గలేదనీ ఆమె పేర్కొన్నారు.

గోల్డ్ కోస్ట్‌లో సాధించిన విజయాన్ని మీరా తన కుటుంబ సభ్యులకు, కోచ్ విజయ్ శర్మకు, భారత దేశ ప్రజలకు అంకితమిచ్చారు. జకార్తాలో జరగనున్న ఆసియన్ గేమ్స్‌లో, టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణ పతకాన్ని అందించడమే తన తదుపరి లక్ష్యమని చెప్పారు.

Image copyright Robertus Pudyanto

సైనాకు ఎందుకు కోపమొచ్చింది?

సైనా తండ్రి హర్‌వీర్ సింగ్ పేరును భారత అధికారిక బృందం జాబితా నుంచి తొలగించారు. దాంతో సైనాకు కోపమొచ్చింది.

మొదట సైనా తండ్రినీ, పీవీ సింధు తల్లినీ గోల్డ్‌కోస్ట్‌కు వెళ్లే భారతీయ అధికారిక బృందం జాబితాలో చేర్చారు. వాళ్ల ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. కానీ అక్కడికి వెళ్లేసరికి హర్‌వీర్ సింగ్ పేరు భారత బృందం జాబితాలో కనిపించలేదు.

ఆయన్ను గేమ్స్ విలేజ్‌లోకి కూడా రానివ్వలేదు. దాంతో సైనా తన కోపాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘నా తండ్రితో కలిసుంటే నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడాయన గేమ్స్ విలేజ్‌లోకి రాలేరు. నా మ్యాచ్‌ను చూడలేరు. ఆయన పేరును తొలగించిన విషయాన్ని ముందుగానే నాతో చెప్పాలి కదా’ అని సైనా ట్వీట్ చేశారు.

హర్‌వీర్‌ని భారత బృందంలో చేర్చిన మాట వాస్తవమేననీ, దానర్థం ఆయనకు భారత క్రీడాకారుల జట్టుతో కలిసి గేమ్స్ విలేజ్‌లో ఉండే హక్కు ఉంటుందని కాదనీ భారత ఒలింపిక్ సంఘం పేర్కొంది.

మరోపక్క పీవీ సింధు తల్లి విజయకు మాత్రం గేమ్స్ విలేజ్‌లోకి రావడానికి సులువుగా అనుమతి లభించింది. దాంతో సైనా కోపం మరింత పెరిగింది. తన తండ్రిని క్రీడా గ్రామంలోకి అనుమతించకపోతే తాను కామన్‌వెల్త్ గేమ్స్ నుంచే తప్పుకుంటానని భారత ఒలింపిక్ సంఘానికి సైనా లేఖ రాశారు. చివరికి ఒలింపిక్ సంఘం ఒప్పుకోవడంతో ఆమె తండ్రికి కూడా క్రీడా గ్రామంలో ఉండటానికి అనుమతి లభించింది.

Image copyright Getty Images

ఆడకుండానే మెడల్

కామన్వెల్త్ లాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో ఆడకుండానే పతకం రావడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆస్ట్రేలియన్ మహిళా బాక్సర్ టెలా రాబర్ట్‌సన్ విషయంలో అదే జరిగింది.

మహిళల 51కేజీల బాక్సింగ్ విభాగంలో ఏడుగురు మాత్రమే పోటీ పడుతున్నారు. దాంతో 19ఏళ్ల టెలాకు ‘బై’ వచ్చి నేరుగా సెమీ ఫైనల్స్‌కు చేరారు. బాక్సింగ్ నిబంధన ప్రకారం సెమీఫైనల్స్ చేరిన వారికి కచ్చితంగా కనీసం కాంస్యమైనా వస్తుంది. అలా పంచ్ విసరకుండానే టెలా మెడలో పతకం వచ్చి పడనుంది.

1986 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు చాలా ఆఫ్రికన్ దేశాలు పోటీలను బాయ్‌కాట్ చేయడంతో ‘సూపర్ హెవీ వెయిట్’ విభాగంలో కేవలం ముగ్గురు బాక్సర్లు మాత్రమే మిగిలారు. దాంతో వేల్స్‌కి చెందిన ఎన్రిక్ ఎవాన్స్ నేరుగా ఫైనల్స్ చేరుకొని పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అదృష్టమంటే అదే మరి..!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు: అమరావతిపై నాకెలాంటి కోపం లేదు, నా ఇల్లు అక్కడే ఉంది - వైఎస్ జగన్

వసతి గృహంలో బాలికలపై అత్యాచారం కేసు: 19 మందిని దోషులుగా తేల్చిన కోర్టు

జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు

థీమ్ పార్క్ ప్రారంభోత్సవానికి పందితో బంగీ జంప్ చేయించారు

మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన ఫొటోలను గాంధీ స్మృతి మ్యూజియంలో నుంచి ఎందుకు తీసేశారు

‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. పిల్లల ఫొటో చూసి ఆగిపోయా’ - టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్

భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి బదిలీ

భవిష్యత్తులో యంత్రాలు మనుషుల్లా మాట్లాడగలవా, జంతువులు కూడా నొప్పితో బాధపడుతాయా