'అమరావతి'పై పుస్తకాల పాలిటిక్స్!

  • శ్యాంమోహన్‌
  • బీబీసీ కోసం
ఎవరి రాజధాని

ఫొటో సోర్స్, IYR KRISHNARAO

అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి తీరును తప్పుపడుతున్న ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు తాజాగా 'ఎవరి రాజధాని అమరావతి' పేరుతో పుస్తకం రాశారు.

దీన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో ఆవిష్కరించారు.

'హూజ్‌ క్యాపిటల్‌ అమరావతి?' పేరుతో ఇంగ్లీషులో, 'ఎవరి రాజధాని అమరావతి?' పేరుతో తెలుగులో ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

అమరావతి పరిపాలన రాజధానిగా ఉండాలా? లేక మెగాసిటీగా ఉండాలా అన్నదానిపై ఈ పుస్తకం రాసినట్లు ఐవైఆర్ బీబీసీకి చెప్పారు.

ఏపీకి పరిపాలనా రాజధాని సరిపోతోందని పేర్కొన్నారు.

విజయవాడతోపాటు ముఖ్య నగరాల్లో సమాంతర అభివద్ధి జరగాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, IYR KRISHNARAO

ఈ పుస్తకంలో ఐవైఆర్ పలు అంశాలను ప్రస్తావించారు.

1. అమరావతి స్థల నిర్ణయ సమయంలో ఎలాంటి పరిశీలన జరగలేదు!

ఏపీ రాజధానిగా అమరావతి ఎంపికలో విస్తత చర్చగానీ, అధ్యయనం గానీ జరుగలేదు.

పూర్తి ప్రతికూలమైన ప్రదేశంలో, భూమి విలువలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసేలా అమరావతి స్థల నిర్ణయం జరిగింది.

2. అమరావతి తటస్థ రాజధాని కాదు!

తటస్థ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిపాలనా రాజధానులు చక్కగా అభివృద్ధి చెందాయి.

వాషింగ్టన్ డి.సి.తో మొదలైన ఈ ఒరవడి ఒట్టావ, కానబెర నగర నిర్మాణాల వరకు ఇదే పద్ధతిలో కొనసాగింది.

కొన్నిసార్లు వెనక బడిన ప్రాంతాల అభివద్ధిని దృష్టిలో ఉంచుకొని రాజధానుల ఏర్పాటు చేశారు.

కానీ, అమరావతి అందరి ఆమోదంతో చర్చల ద్వారా ఏర్పడిన రాజధాని కాదు. అందువల్ల దాన్ని తటస్థ రాజధాని అనలేం. అలాగే ఇది వెనుక బడిన ప్రాంతంలో ఏర్పడలేదు.

ఫొటో సోర్స్, Amaravathi / twitter

3. అమరావతి ఎంపికలో చంద్రబాబు వ్యూహాత్మక విధానం

అమరావతి స్థల నిర్ణయంలో చంద్రబాబు వ్యూహత్మకంగా వ్యవహరించారు.

విజయవాడ పరిసరాల్లో ఏర్పాటు చేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయించారు.

ఈ విషయం తెలిసి అప్పటికే కొద్దిమంది పెట్టుబడులు పెట్టిన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేశారు.

4. మహానగరం కాదు.. పరిపాలనా నగరం!

భారతదేశంలో ఇంతవరకు ఏ రాజధానినీ మహానగరంగా ఊహించి ప్రణాళిక రచించలేదు. అన్నింటినీ పరిపాలనా రాజధానులుగానే రూపకల్పన చేశారు.

మహానగరంగా అమరావతి రూపకల్పనే ఒక శాపంగా మారుతుంది.

ఇంత పెద్ద ఎత్తున చేసిన భూసమీకరణకు అదే స్థాయిలో ఆర్థికమైన కార్యక్రమాలు రాకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.

5. భయపెట్టి భూసమీకరణ చేశారు!

రాజధాని భూసమీకరణ రైతుల ఇష్టానుసారం జరగలేదు. భయపెట్టి భూమిని సమీకరించారు.

స్థూలంగా అందరితో చర్చించి ఒక అంగీకారం మీద ఏర్పడిన రాజధాని కాదు కాబట్టి దీనిని ప్రజా రాజధాని అనలేం.

దీన్ని మహానగరంగా నిర్మించాలన్న తలంపు రాష్ట్రాభివృద్ధికే గుదిబండగా మారే ప్రమాదం ఉంది.

ఫొటో సోర్స్, facebook / amaravathi

రాజధానిపై ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు?

చంద్రబాబు హయాంలో ఐవైఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

రాజధాని ఎంపికపై ఆనాడు ఎందుకు సీఎం దృష్టికి తీసుకెళ్లలేదు? అన్న బీబీసీ ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.

''రాజధానిపై ప్రభుత్వ నిర్ణయాలను తాను విభేదిస్తానని వారికి ముందే తెలుసు. అందుకే నన్ను పక్కన పెట్టారు. రాజధాని ఎంపికలో వారొక ఎజెండాతో ముందుకు వచ్చారు. అందులో కొందరి ప్రయోజనాలు ఉన్నాయి.''

ఎవరీ ఐవైఆర్‌?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పలువురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన 1979 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఐవైఆర్‌ కష్ణారావు.

ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఆయన కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం పంచాయితీరాజ్‌ శాఖ కార్యదర్శిగా, ఫైనాన్స్‌ సెక్రటరీగా కూడా పనిచేశారు. టీటీడీ ఈవోగా, సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్‌కు బాధ్యతలు కట్టబెట్టారు.

2016లో ఐవైఆర్‌ కష్ణారావు రిటైరయ్యాక, ప్రభుత్వం ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించింది.

కొంతకాలం తరువాత ముఖ్యమంత్రితో విభేదాలు రావడంతో ఆ పదవి నుంచి ఆయనను తప్పించారు.

ఫొటో సోర్స్, tdp.ncbn.official/facebook

ఐవైఆర్‌ వెనక అదృశ్య శక్తులు!

ఐవైఆర్‌ రాసిన 'ఎవరి రాజధాని అమరావతి?' కి పోటీగా అదే రోజు 'ప్రజా రాజధానిపై కుట్ర-అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న దుష్ట చతుష్టయం' పేరిట మరో పుస్తకం విడుదలైంది.

రాజధాని రైతు సమాఖ్య, బ్రాహ్మణ చైతన్య వేదిక, ఏపీ హక్కుల సాధన సమితిల ఆధ్వర్యంలో ఏపీ గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు వర్ల రామయ్య దీన్ని విడుదల చేసినట్లు స్థానిక వార్తా పత్రికలు పేర్కొన్నాయి.

రాజధానిని అద్భుతంగా నిర్మించాలని చంద్రబాబు చూస్తుంటే.. దాన్ని అడ్డుకోవాలని జగన్, పవన్, మోదీ, ఐవీఆర్ కృష్ణారావులు ప్రయత్నిస్తున్నారని ఆ పుస్తకంలో ఆరోపించారు.

'ఎవరి రాజధాని అమరావతి?' పుస్తకాన్ని కనీస అవగాహన లేకుండా రాశారని, రాజధాని జోలికి వస్తే ఊరుకునేది లేదని వారన్నారు.

ఐవైఆర్ పుస్తకం వెనక కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయని టీడీపీ నేతలు విమర్శించారు.

అమరావతి కాదు..భ్రమరావతి!

అమరావతి నిర్మాణంపై పలువురు పుస్తకాలు రాశారు. భ్రమరావతి పేరుతో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవలే ఒక బుక్‌లెట్ విడుదల చేశారు.

రాజధాని నిర్మాణంపై కేంద్ర కమిటీ నివేదిక ఇవ్వకముందే చంద్రబాబు మరో కమిటీ వేశారని ఉండవల్లి ఆరోపించారు.

ఉండవల్లి ప్రస్తావించిన అంశాలు:

1. అమరావతిలో రాజధాని పెట్టొద్దని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పినా వినకుండా చంద్రబాబు ప్రభుత్వమే స్వయంగా అక్కడ రాజధాని నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది.

2. రాజధాని నిర్మాణం కోసం రైతులందరినీ భ్రమపెట్టి వారి భూములు లాక్కున్నారు. అమరావతి నిర్మాణం ఇప్పుడు రైతులపాలిట భ్రమరావతిగా మారింది.

3. అవినీతి కుంభకోణాల్లో ఉన్న కంపెనీలకు అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించింది.

4. స్విస్‌ చాలెంజ్‌ విధానంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా లెక్కచేయకుండా వారి ఇష్టమొచ్చిన రీతిలో దానిని అమలు చేస్తున్నారు.

5. రాజధాని నిర్మాణంలో లోపాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఉండవల్లి తన భ్రమరావతి బుక్‌లెట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, YS Jaganmohan Reddy/Facebook

ఖైదీ నెంబర్ 6093

కేవలం అమరావతిపైనే కాదు. చంద్రబాబు పాలనపై వైసీపీ, జగన్ కేసులపై టీడీపీ పోటాపోటీగా పలు పుస్తకాలు ప్రచురించాయి.

వైసీపీ అధినేత జగన్ గతంలో జైలుకు వెళ్లినప్పుడు ఖైదీ నెంబర్ 6093 పేరుతో టీడీపీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది.

అందులో జగన్‌పై ఉన్న కేసుల వివరాలు, ఆయనపై ఉన్న అభియోగాలను ఇందులో పొందుపరిచింది.

చంద్రబాబు అవినీతి చక్రవర్తి!

టీడీపీకి పోటీగా వైసీపీ కూడా చంద్రబాబు పాలనపై 'అవినీతి చక్రవర్తి' పేరుతో ఒక పుస్తకం విడుదల చేసింది.

'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పేరుతో ఉన్న ఈ పుస్తకాన్ని జాతీయ స్థాయి రాజకీయ నాయకులకు సైతం వైసీపీ నేతలు అందించారు.

  • చంద్రబాబు హయాంలో మూడేళ్లలో 3లక్షల 75వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని జగన్ ఆరోపించారు.
  • ఒక్క రాజధాని భూముల విషయంలోనే లక్ష కోట్ల స్కామ్ జరిగిందని అన్నారు.
  • విశాఖ భూముల విషయంలో మరో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పారు.

ప్రాజెక్టులు, ఇసుక, మద్యం నుంచి మట్టి అన్నింటిలో అవినీతి జరిగిందని వైసీపీ అధ్యక్షడు విమర్శించారు.

ఈ పుస్తకంలో ఇసుక మాఫియా మొదలు రాజధాని నిర్మాణం, వివిధ పథకాల్లో లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని ప్రస్తావించారు.

'మోసగాడు'

ఏపీకి ప్రత్యేక హోదా కోసం మంగళగిరిలో జగన్ దీక్ష చేసిన సమయంలో వైసీపీ మరో పుస్తకం విడుదల చేసింది.

హోదా విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్రానికి 'మోసగాడు' పేరుతో ఆ పుస్తకాన్ని ముద్రించింది వైసీపీ.

'రాజా ఆఫ్ కరప్షన్'

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భారీ అవినీతి జరిగిందంటూ టీడీపీ గతంలో ఒక పుస్తకం ముద్రించింది.

'రాజా ఆఫ్ కరప్షన్' పేరుతో వైఎస్ హయాంలో అవినీతి జరుగుతోందని జాతీయ స్థాయిలో చెప్పేందుకు ఆ పుస్తకాన్ని టీడీపీ నేతలు ఉపయోగించుకున్నారు.

ఇవేకాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజనపైనా పలువురు పుస్తకాలు రాశారు. జైరాం రమేష్ 'ఓల్డ్‌ హిస్టరీ-న్యూ జ్యాగ్రఫీ', ఉండవల్లి 'విభజన కథ- నా డైరీలో కొన్ని పేజీలు' పేరుతో పుస్తకాలు ప్రచురించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)