తెలంగాణ: 'ప్రైవేటు వర్సిటీలు ప్రజల కోసమా, మార్కెట్ కోసమా?'

  • దీప్తి బత్తిని
  • బీబీసీ ప్రతినిధి
పుస్తకాలు, విద్యార్థులు
ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు వీలు కల్పించే బిల్లును శాసనసభ ఇటీవల ఆమోదించింది. బిల్లులోని ముఖ్యాంశాలు ఏమిటి? దీనిపై ప్రభుత్వం ఏమంటోంది? విద్యావేత్తలు ఏమంటున్నారు?

తెలంగాణ విద్యార్థులకు ప్రైవేటు రంగంలో నాణ్యమైన విద్యను అందించేందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నియంత్రణ బిల్లుకు శాసనసభ మార్చి 28న ఆమోదం తెలిపింది.

''అంతర్జాతీయస్థాయి పోటీ, ఆర్థిక ఎదుగుదల ఒకదానితో ఒకటి ముడిపడిన ప్రస్తుత కాలంలో యువతకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడం అవసరం. అందుకు ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు రాష్ట్రానికి రావాలి'' అని బిల్లు చెబుతోంది.

గుణాత్మక, పరిశోధనాత్మక దృక్పథంతో కూడిన విద్యను అందించగలిగే విద్యాసంస్థలు తెలంగాణలో ఏర్పాటయ్యేలా చూడటం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సభలో చెప్పారు.

తెలంగాణకు చెందిన విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్, విశ్వవిద్యాలయ కార్యకలాపాలు మొదలయ్యాక ఐదేళ్లలోగా ... 'నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (‌ఎన్‌ఏఏసీ-నాక్)' గుర్తింపు పొందడం లాంటి నిబంధనలు పొందుపరిచారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వీఐటీ, ఎస్‌ఆర్ఎం వర్సిటీల ఏర్పాటు

గోవా, జమ్మూకశ్మీర్, కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం లభించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపాక, 11 విశ్వవిద్యాలయాలు వర్సిటీల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. వేలూరు ‌ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)', ఎస్‌ఆర్ఎం విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి.

భారత్‌లో పెరిగిన ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు

ఐదేళ్లుగా భారత్‌లో ప్రైవేటు రంగంలో ఉన్నత విద్యాసంస్థలు పెరుగుతూ వస్తున్నాయి.

2015-16 గణాంకాల ప్రకారం దేశంలో 799 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అందులో 277 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు.

2010-11లో 87 ప్రైవేటు విశ్వవిద్యాలయాలుండేవి.

సుబ్రహ్మణ్యం కమిటీ ఏమంది?

టీఎస్‌ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటైన 'కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ' 2016లో ప్రైవేటు విద్యాసంస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విద్యాసంస్థలు అవినీతికి పాల్పడుతూ, రాజకీయ పలుకుబడి ఉపయోగించి అనుమతులు తెచ్చుకుంటున్నాయని నివేదికలో పేర్కొంది.

విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చుక్కా రామయ్య: 'ఇవి పేదరికం లాంటి సమస్యలపై పరిశోధనలు చేస్తాయా?'

విద్యావేత్త చుక్కా రామయ్య బీబీసీతో మాట్లాడుతూ- ''ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మార్కెట్ కోసమా లేక ప్రజల కోసమా? అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు అంటున్నారు.. మరి ఈ విశ్వవిద్యాలయాలు పేదరికం లాంటి సమస్యలపై పరిశోధన చేసేందుకు ముందుకు వస్తాయా? వృత్తివిద్య (ప్రొఫెషనల్) కోర్సులు డబ్బుతో కూడుకున్నవి. మరి అలాంటి చదువు అందరికీ అందుబాటులో ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారు'' అని ప్రశ్నించారు.

తెలంగాణ విద్యార్థి వేదిక: 'ఫీజు అందరికీ అందుబాటులో ఉండదు'

తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి బీబీసీతో మాట్లాడుతూ- ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఎవరి కోసమని ప్రశ్నించారు.

''ఇప్పటికీ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై ఆధారపడి ఉన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఫీజు నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో ఉండదు. అలాంటపుడు ఆ విద్య అందరికీ అందుబాటులో ఉండదు. ఇప్పటికే విద్యార్థులు పరిశోధనలకు తగిన నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

కొందరు విద్యార్థి నాయకులు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది కొరతను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

శాసనసభలో మంత్రి కడియం శ్రీహరి ఈ అంశంపై మాట్లాడుతూ- ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే 1,528 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఇంకా 1016 ఖాళీలను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)