సల్మాన్ ఖాన్ వేటాడిన జింకల స్మారక చిహ్నం కట్టింది ఇక్కడే!
- నారాయణ్ బారేఠ్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, NARAYAN BARETH/BBC
ఇరవై యేళ్ల కిందట కృష్ణజింకల్ని వేటాడిన కేసులో శిక్షపడిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ముంబయిలో అభిమానులు ఆయన విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చారు.
కానీ రాజస్థాన్‌లోని కాంకాణీ గ్రామంలో రెండు రోజుల క్రితం సల్మాన్‌కు శిక్ష పడిందని తెలియగానే ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమ ఇరవై యేళ్ల న్యాయపోరాటం వృథా కాలేదని సంతృప్తి చెందారు.
1998లో సల్మాన్ రెండు కృష్ణజింకల్ని వేటాడింది జోధ్‌పూర్‌కు సమీపంలోని కంకాణీ గ్రామంలోనే. ఆ గ్రామస్థులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఆయనపై కేసు నమోదైంది. చివరకు ఆయనకు శిక్ష పడేలా చేసింది కూడా ఆ గ్రామస్థులే.
నోరులేని మూగజీవాల ఉసురు తీసిన సల్మాన్ ఖాన్‌కు శిక్ష పడాలని స్థానికులు - బిష్నోయి సముదాయం వారు - బలంగా కోరుకున్నారు. అంతే కాదు, నాడు చనిపోయిన ఆ రెండు జింకల జ్ఞాపకార్థం సల్మాన్ ఖాన్ వేటాడిన స్థలంలోనే ఓ సమాధి కూడా నిర్మించుకున్నారు.
అదేమంత భారీ స్మారక చిహ్నమేమీ కాదు. అయితే కాంకాణీ గ్రామ సమీపంలోని ఆ మామూలు సమాధి వన్య ప్రాణులను కాపాడడం కోసం జరిగిన అసాధారణ పోరాటాన్ని గుర్తు చేస్తుంది.
ఈ ఎడారి ప్రాంతంలో పరుగులు తీసే జింకలు, పక్షుల కిలకిలరావాలు సర్వసాధారణ దృశ్యాలు. అవి తమ రక్షకుల్ని గుర్తు చేసుకుంటున్నాయేమో అనిపిస్తుంది.
రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతంలో బిష్నోయి సముదాయానికి చెందిన గ్రామాలే ఎక్కువ. ఈ గ్రామాల్లో పలు చోట్ల వన్య ప్రాణుల కోసం నిర్మించిన చెరువులున్నాయి. ఇక్కడి గ్రామీణులు అటవీ జంతువులను వేటగాళ్ల బారి నుంచి కాపాడడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉంటారు.
జోధ్‌పూర్‌లోని ఓ న్యాయస్థానం గురువారం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష విధించినట్టు తెలియగానే బిష్నోయి సముదాయానికి చెందిన గ్రామాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
ఫొటో సోర్స్, NARAYAN BARETH/BBC
జోధ్‌పూర్ జిల్లాలోని ఇదే కాంకాణీ గ్రామంలో 1998లో సల్మాన్ ఖాన్ రెండు కృష్ణజింకల్ని వేటాడి చంపారు.
"గ్రామంలో ప్రతి ఒక్కరూ తీర్పు కోసం ఎదురు చూశారు. సల్మాన్‌కు శిక్ష పడిందని తెలియగానే అందరిలో సంతోషం వెల్లి విరిసింది" అని కాంకాణీ గ్రామస్తుడు మోహన్ లాల్ బిష్నోయి అన్నారు.
ఈ కేసులో తాము రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నామని ఆయన తెలిపారు.
ఇరవై ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్ రెండు కృష్ణజింకలను వేటాడిన స్థలాన్ని కాంకాణీ గ్రామస్థులు నాకు చూపించారు. ఆ పక్కనే ఆ రెండు జింకలనూ వారు పూర్తి గౌరవమర్యాదలతో సమాధి చేశారు.
అక్కడే ఒక స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించారు.
ఫొటో సోర్స్, NARAYAN BARETH/BBC
రాళ్లు, సిమెంట్‌తో కట్టిన ఆ స్మారక చిహ్నం నిర్మాణం గొప్పగా లేకపోవచ్చు గానీ ఈ సమాధి బిష్నోయి సముదాయానికి వన్య ప్రాణుల రక్షణ పట్ల ఉన్న సంకల్పాన్ని గుర్తు చేస్తుంది.
గ్రామ ప్రజలు ప్రతి రోజూ అక్కడ పక్షులకు గింజలు వేస్తారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్భయంగా సంచరించే జింకల్ని వారు రక్షిస్తారు.
అప్పటికే అంతరించిపోతున్న కృష్ణజింకల్ని సల్మాన్ ఖాన్ వేటాడారని కాంకాణీ గ్రామస్థుడు బన్షీలాల్ అన్నారు.
ఈ గ్రామస్థులు ఇచ్చిన సాక్ష్యం ఆధారంగానే కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి, శిక్ష విధించింది.
వీరిలో పూనమ్ చంద్, భార్మల్ - వీరిద్దరూ ఇచ్చిన సాక్ష్యం కీలకమైంది.
ఆరోజు రాత్రి తుపాకీ చప్పుళ్లు వినబడగానే ఎవరో జింకలను వేటాడి ఉంటారని గ్రామస్థులకు వెంటనే అనుమానం వచ్చింది.
"గ్రామస్థులు వెంటనే తుపాకీ శబ్దం వచ్చిన వైపు పరుగెత్తారు. వాహనాల్లో పారిపోతున్న వారిని వెంటాడారు. అయితే వేటాడిన వారు తప్పించుకొని పారిపోగలిగారు" అని మోహన్ లాల్ బిష్నోయి తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
అటవీ జంతువులనూ, ప్రకృతినీ కాపాడాలని తమ ఆరాధ్య గురువు జంభోజీ తమకు బోధించారని దినేష్ బిష్నోయి అన్నారు.
"అక్కడికి వెళ్లగా మాకు ప్రాణాలు పోయి నిర్జీవంగా పడి ఉన్న రెండు జింకలు కనిపించాయి. పక్కన ఉన్న రాళ్లపై వాటి నెత్తురు ధారకట్టింది" అని శ్రీ బిష్నోయి చెప్పారు.
వెంటనే పోలీసులకు, అటవీ శాఖ వారికి ఘటన గురించి సమాచారం అందించామని ఆయనన్నారు.
అటవీ శాఖ అధికారులు పంచనామా చేసిన తర్వాత జింకల కళేబరాలను తమకు అప్పగించారని ఆయన చెప్పారు.
ఆ రెండు జింకలకూ అక్కడే అంత్యక్రియలు జరిపామని గ్రామస్థులు చెప్పారు.
జింకల సమాధి తమకు పవిత్ర స్థలమని బన్షీలాల్ అన్నారు. ఇక్కడ ప్రతిరోజూ తాము పక్షులు తినడానికి గింజలు వెదజల్లుతామని ఆయన చెప్పారు.
కాంకాణీ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గుఢా బిష్నోయియాన్, ఖేజ్‌డలీ వంటి అనేక గ్రామాల్లో నేటి ఎండాకాలంలో సైతం చెరువుల్లో నీరు నిండి ఉంది.
జింకలు, పశువులు, పక్షులు అన్నీ దప్పికను తీర్చుకోవడం కోసం రోజూ ఈ చెరువుల్లోకి వస్తుంటాయి.
శీతాకాలంలో పక్షులు దూర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడే గడుపుతాయని బిష్నోయిలు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)