#CWG2018: ఈ అమ్మాయిలు డాక్టర్లు అవుదామనుకొని షూటర్లయ్యారు!

  • 8 ఏప్రిల్ 2018
Image copyright Getty Images

ఈ ఇద్దరమ్మాయిల ఆశయం డాక్టర్ కావాలన్నదే. ఒకరు ఇప్పటికే డెంటల్ సర్జన్ కాగా, మరో అమ్మాయి మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతోంది. ఇద్దరూ పిస్టల్ చేతపట్టారు! ఆటవిడుపు కోసం నేర్చుకున్న విద్య వారికిప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు తెచ్చిపెట్టింది.

ఒకరిది హర్యానా, మరొకరిది పంజాబ్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఒకరు బంగారం, ఇంకొకరు రజతం అందుకుని కామన్వెల్త్‌లో మెరిశారు.

ఈ ఇద్దరమ్మాయిల ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం రండి!

మను భాకర్

ఆమె వైద్య విద్య ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అవుతోంది. ఈ లోగా కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం కొట్టేసింది! ఆమే మను భాకర్.

మను వయసు 16. హర్యానాలోని గొరియా స్వగ్రామం. రెండేళ్ల క్రితమే క్రీడా రంగంలో అడుగు పెట్టింది.

కామన్వెల్త్ క్రీడల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకం సాధించింది. ఇదే ఈవెంట్‌లో మరో భారతీయ యువతి హీనా సిద్ధూ రెండో స్థానంలో నిలిచింది.

బంగారు పతకాలు సాధించడం మనుకు ఇది తొలిసారేమీ కాదు. ఇటీవల జరిగిన సీనియర్ వరల్డ్ కప్‌లోనూ రెండు పతకాలను సాధించింది.

అయితే 10 నెలల క్రితం జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో పాల్గొన్న మను నిరాశతో వెనుదిరిగింది. కానీ ఆ తర్వాతే ఆమె నిజమైన ఛాంపియన్‌గా మారింది.

2017లో జరిగిన నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మను భాకర్ 17 మెడల్స్ సాధించి రికార్డు సృష్టించింది.

మను బకర్ Image copyright Getty Images

స్కూలు విద్యార్థినిగా ఉన్నపుడే బాక్సింగ్, స్విమ్మింగ్, మరికొన్ని క్రీడలు ఆడేది. కానీ గాయం కారణంగా బాక్సింగ్ మానేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత మణిపురీ మార్షల్ ఆర్ట్స్‌ 'థంగ్ త' పై మక్కువ పెంచుకుంది.

ఓసారి మను స్కూల్లో పిల్లలు షూటింగ్ నేర్చుకోవడం ఆమె తండ్రి గమనించారు. అంతే.. కొద్ది కాలానికే మను భాకర్ కూడా తుపాకీ గురి పెట్టింది.

షూటింగ్‌లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో టోర్నమెంట్లలో గెలిచింది. అలా.. అలా.. ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో మను భాకర్ బంగారు పతకం సాధించింది.

మను భాకర్ విజయాల వెనుక కఠోర శ్రమ దాగుంది. అట్లాగే ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తక్కువేమీ కాదు.

మను తండ్రి రామక్రిష్ణ భాకర్ మెరైన్ ఇంజినీర్‌గా పని చేసేవారు. కూతురి క్రీడా నైపుణ్యాన్ని, ప్రతిభను గమనించాక ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి సమయాన్ని ఆమె కోసమే వెచ్చించారు.

మను బకర్ Image copyright Getty Images

క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి వెళ్లడానికి చాలా కష్టపడతారు. కానీ మను భాకర్ మాత్రం చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించింది.

ఆమె ఎక్కడకు వెళ్లినా తండ్రి రామక్రిష్ణ వెన్నంటే ఉంటారు. మను భాకర్ కోసం తుపాకీ కొనడానికి కూడా రామక్రిష్ణ చాలా కష్టపడాల్సి వచ్చింది.

షూటింగ్‌లో ఏకాగ్రత చాలా ముఖ్యం. ఒత్తిడిని కూడా నియంత్రించుకోవాలి. అందుకోసం మను భాకర్ నిత్యం యోగాతో పాటు ధ్యానం కూడా చేస్తుంది.

కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన మను గురి ఇప్పుడు 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్ మీద ఉంది!

హీనా సిధు Image copyright facebook/Heena Sidhu

హీనా సిద్ధూ..

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించిన మరో భారతీయ యువతి హీనా సిద్ధూ. హీనా పేరును చాలా మంది ఇదివరకే వినివుండొచ్చు.

2016లో క్రీడల్లో పాల్గొనడానికి ఇరాన్ వెళ్లిన హీనా సిద్ధూ హిజాబ్ ధరించి క్రీడల్లో పాల్గొనాలన్న నిబంధనను వ్యతిరేకించిన ఘటనతో వార్తల్లోకెక్కింది.

అంతేకాదు, ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్న మొదటి భారతీయ మహిళా పిస్టల్ షూటర్ కూడా ఆమే.

హీనా కేవలం ఓ క్రీడాకారిణి మాత్రమే అనుకుంటే పొరబాటే. ఆమె ఓ డెంటల్ సర్జన్, పెయింటర్ కూడా!

Image copyright facebook/Heena Sidhu

పంజాబ్‌కు చెందిన హీనా 1989లో లుథియానాలో జన్మించింది. ఈమె తండ్రి కూడా షూటరే. కానీ షూటింగ్ పట్ల ఈమె సహజంగానే ఆకర్షితురాలయ్యింది.

న్యూరాలజిస్ట్ అవ్వాలన్నది హీనా కోరిక. అందుకోసం రోజూ గంటల తరబడి చదివేది.

ఈ నేపథ్యంలో.. చదువు ఒత్తిడిని అధిగమించడం కోసం షూటింగ్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసేది. ఈ క్రమంలోనే హీనా షూటింగ్ పట్ల ఆకర్షితురాలయ్యింది.

కాలేజి రోజుల్లోనే చాలా పతకాలను సాధించింది హీనా. తన 19 ఏళ్ల వయసులో 'హంగేరియన్ ఓపెన్' గెలిచుకుంది. 2009లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో కాంస్యం అందుకుంది.

Image copyright facebook

శిక్షకుడే భర్తగా మారాడు..

హీనాకు రౌనక్ పండిట్ శిక్షణ ఇచ్చేవాడు. అలా..అలా.. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

2013లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ జరిగింది. అందులో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకం సాధించిన మొదటి మహిళగా హీనా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరల్డ్ నెంబర్ వన్‌గా నిలిచింది.

2017లో చేతి వేలి గాయం కారణంగా కెరీర్‌లో కాస్త ఇబ్బంది పడింది హీనా. గాయం తర్వాత షూటింగ్ చేయడానికి ఇబ్బంది పడేది. షూటింగ్ చేస్తున్నపుడు తన వేలు వణికేదని ఆమె అన్నారు.

చేతి వేలికి చికిత్స చేయించుకున్న తర్వాత మళ్లీ పిస్టల్ గురి పెట్టింది హీనా.

Image copyright facebook/Heena Sidhu

షూటింగ్‌తోపాటు హీనాకు ప్రయాణాలన్నా, పుస్తకాలన్నా చాలా ఇష్టం.

తుపాకీ పేల్చే ఆమె చేతి వేళ్లు కుంచెను చేతపట్టి అద్భుతమైన బొమ్మలు కూడా గీస్తాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి.. జరిగే నష్టమేంటి

ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్ట్.. నాలుగేళ్ల కిందటి కేసులో అదుపులోకి తీసుకున్న గజ్వేల్ పోలీసులు

అసలు పుతిన్ ఎవరు.. ఆయన ఏం కోరుకుంటున్నారు?

కీటకాలు అంతరిస్తున్నాయి.. అవి లేకపోతే మనిషి కూడా బతకలేడు

ఎవరి శవపేటికను వాళ్లే ఎందుకు తయారు చేసుకుంటున్నారు

ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?

CAA: కేరళ దారిలో పంజాబ్... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం

ఆస్ట్రేలియా కార్చిచ్చు: కంగారూల ద్వీపాన్ని కమ్మేసిన మంటలు

IndVsAus: రాజ్‌కోట్ వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ సూపర్ హిట్... మూడు సెంచరీలు మిస్