#BBCShe: ‘జర్నలిజం కోర్సుల్లో అమ్మాయిలు ఎక్కువ.. ఉద్యోగాల్లో మాత్రం తక్కువ’

  • 9 ఏప్రిల్ 2018
BBCShe, జలంధర్

జలంధర్ నగరం చిన్నదే అయినా ఇక్కడి అమ్మాయిల కలలు మాత్రం చాలా పెద్దవి. #BBCShe చర్చలో పాల్గొనేందుకు దొవాబా కాలేజీకి వచ్చిన విద్యార్థినులు జర్నలిజం కోర్సు చదువుకుంటున్నారు.

వాళ్ల వయసు 22-23 ఏళ్లే, కానీ వాళ్ల అవగాహనా స్థాయి మాత్రం చాలా ఎక్కువ.

ఈ సమావేశానికి వచ్చిన వాళ్లు - తమకు ఒక సామాన్యుడు తీవ్రవాది ఎందుకు అవుతాడో తెలుసుకోవాలని ఉందన్నారు. కేసు విచారణ సందర్భంగా జైలులో ఉన్న నిందితుల పరిస్థితి ఎలా ఉంటుందో రిపోర్టు చేయాలని ఉందన్నారు.

అయితే, చదువుకుంటూనే పని నేర్చుకుంటున్న వీరికి కేవలం విద్య, మహిళలకు సంబంధించిన వార్తా కథనాలు చేయడం మాత్రమే అనుమతిస్తున్నారు.

'ఇలాంటివన్నీ మీ కోసం కాదు. అవి పక్కన బెట్టి ఏవైనా ప్రెస్ రిలీజ్‌ల పనులుంటే చూసుకోండి' అని అంటుంటారని ఆ అమ్మాయిలు తెలిపారు.

వీళ్లంతా హిందీ, పంజాబీ వార్తాపత్రికల్లో, వెబ్‌సైట్లలో పని చేస్తున్నారు.

మగ జర్నలిస్టులకే పెద్ద బాధ్యతలు

జలంధర్‌లో అనేక మీడియా కంపెనీల కార్యాలయాలున్నాయి. పంజాబ్‌లో జలంధర్‌ నగరాన్ని న్యూస్ మీడియా కోటగా భావిస్తారు.

కానీ ఈ సంస్థలలో పని చేసే మహిళల సంఖ్య మాత్రం చాలా తక్కువ. కొన్నిసార్లు వంద మంది సిబ్బందిలో పదిమంది మహిళలు, అరవై మందిలో నలుగురు మహిళలు మాత్రమే ఉంటారు.

నేరాలు, పరిశోధనాత్మక జర్నలిజం, రాజకీయాల విషయంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు పలువురిని కలవాల్సి ఉంటుంది. మహిళలు ఈ పని చేయలేరనే అభిప్రాయం ఉంది.

ఎక్కువ గంటలు పని చేయడం, అదీ తక్కువ జీతానికి, ఈ అమ్మాయిల కుటుంబాలకు అస్సలు ఇష్టం ఉండదు.

మొత్తం మీద అర్థం అయ్యేదేమిటంటే, అమ్మాయిలు చదువు పూర్తయ్యాక రెండు, మూడేళ్లు ఉద్యోగం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు.

తమ కెరీర్ విషయంలో సీరియస్‌గా ఉండరు. వాళ్లకు అదొక హాబీ మాత్రమే. దాన్ని కొద్దికాలం కొనసాగించి ఆ తర్వాత దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.

'పెద్ద బాధ్యతలను మగ జర్నలిస్టులకు అప్పగించడం మేలు...' 20 ఏళ్ల క్రితం ఇలాంటి సంభాషణ వినిపించేది.

మరిప్పుడు పరిస్థితి ఏమైనా మారిందా?

పెద్ద నగరాలలోని మీడియా సంస్థలలో లేదా ఇంగ్లీష్ మీడియాలో పని చేసే వాతావరణం వేరు. అక్కడ మహిళలకు ఎక్కువ అవకాశాలుంటాయి. వాళ్లు తమకు నచ్చిన పని కోసం పోరాడే అవకాశం ఉంటుంది.

అయితే జలంధర్ లాంటి చిన్న పట్టణాలలో, ప్రాంతీయ భాషల్లో వెలువడే మీడియాలో జర్నలిస్టుల సంఖ్య తక్కువ కావడం వల్ల నిర్ణయాధికారంలో తమ పాత్ర చాలా స్వల్పమని వారు తెలిపారు.

అయితే పూర్తిగా మార్పు లేదని కాదు. 20 ఏళ్ల క్రితం వంద మంది ఉండే న్యూస్ రూమ్‌లో ఒకరో, ఇద్దరో మహిళలు ఉండేవాళ్లు. ఇప్పుడు వారి సంఖ్య పది వరకు ఉంటోంది. అయినప్పటికీ అది తక్కువే.

తిరగబడుతున్న నిష్పత్తి

జలంధర్‌లో ఆరు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటన్నిటిలో జర్నలిజం కోర్సును బోధిస్తున్నారు. వాటిల్లో అబ్బాయిల సంఖ్యకన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువ. అయితే కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాలలో మాత్రం ఈ నిష్పత్తి తిరగబడుతుంది.

ఒక విద్యార్థిని మాతో మాట్లాడుతూ, "ఎండల్లో తిరుగుతూ ఇదేం పని? పెద్దగా డబ్బులు కూడా రావు, దీనికన్నా టీచర్ ఉద్యోగం మేలు అని. ఇలా అయితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అని మా అమ్మ అంటుంది'' అని తెలిపారు.

అయితే ఈ యువతులను తమ తల్లిదండ్రుల ఆలోచనావిధానం కన్నా, మీడియాలో పాతుకుపోయిన స్టీరియోటైప్ విధానాలే ఎక్కువ బాధిస్తున్నాయి

''జర్నలిస్టులు చాలా విశాల దృక్పథం కలిగి ఉంటారని, ముందు ముందు ఏం జరుగుతుందో వాళ్లు ఊహించగలరనీ అంటుంటారు. కానీ వాస్తవం మాత్రం అలా లేదు'' అని ఓ యువతి తెలిపింది.

''మహిళా సమస్యల మీద గళం విప్పుతున్నవారు, వ్యాసాలు రాస్తున్నవాళ్లు, వాళ్లు స్వయంగా ఏం చేస్తున్నారో ఆలోచించుకోవాలి.''

జలంధర్‌లో పని చేస్తున్న ఒక సీనియర్ మహిళా జర్నలిస్టు దీనిపై మాట్లాడుతూ, ''మీపై మీకు నమ్మకం ఉండడం చాలా ముఖ్యం. నేను మహిళను, ఎడిటర్ ఒక పురుషుడు - ఇలాంటి దృష్టి ఉండకూడదు. మనమంతా జర్నలిస్టులం. మన హక్కుల కోసం పోరాడడం మన చేతుల్లోనే ఉంది'' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పోలవరం పనుల రివర్స్ టెండరింగ్.. ఇంతకీ రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటే ఏమిటి

అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?

‘అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు’

ముగిసిన గవర్నర్ డెడ్‌లైన్.. ఓటింగ్ జరపని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్

జింబాబ్వేను సస్పెండ్ చేసిన ఐసీసీ.. క్రికెట్‌లో రాజకీయ జోక్యంతో జట్టుపై నిషేధం

ప్రెస్ రివ్యూ: ‘రోడ్డు మీద పడుకుంటా’.. ‘40 ఏళ్ల ఇండస్ట్రీ అంటే ఇదేనా’

కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షను పాకిస్తాన్ ఎలా సమీక్షిస్తుంది

హత్యకేసులో జీవిత ఖైదు పడిన శరవణ భవన్ యజమాని గుండెపోటుతో మృతి