ప్రత్యేక హోదా డైరీ: దిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు; కేజ్రీవాల్ మద్దతు

టీడీపీ ఎంపీలతో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, FACEBOOK/TDP

ప్రధాని నివాసం ఎదుట టీడీపీ ఎంపీల ధర్నా

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరుతూ తెలుగు దేశం పార్టీ ఎంపీలు ప్రధాన మంత్రి మోదీ నివాసం ఎదుట బైఠాయించారు.

రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి నివాసం నుంచి ర్యాలీగా బయలు దేరిన టీడీపీ ఎంపీలు ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగారు.

ప్లకార్డులు పట్టుకొని ఏపీకి న్యాయం చేయాలంటూ నినదించారు. అయితే, ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అక్కడి నుంచి తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/TDP

ప్రత్యేక హోదాకు కేజ్రీవాల్ మద్దతు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఎంపీలను కలసిన ఆయన ప్రత్యేక హోదాపై మీడియాతో మాట్లాడారు.

''టీడీపీ డిమాండ్ న్యాయమైంది. ఏపీకి ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలి. ఎంపీలు ప్రధానిని కలవడానికి వెళ్తే వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించడం బాధకరం. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. టీడీపీ డిమాండ్‌కు మేం మద్దతిస్తున్నాం'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, FACEBOOK/YSRCPONLINETV/YSRCP

ప్రత్యేక హోదా ఏపీ హక్కు: విజయమ్మ

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు.

దిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న పార్టీ ఎంపీలను ఆమె పరామర్శించారు.

తమ పార్టీ ప్రత్యేక హోదా కోసం అన్ని విధాలుగా పోరాడుతోందని తెలిపారు.

పార్టీలకతీతంగా పోరాటానికి ముందుకు రావాలని కోరారు. ప్రత్యేక హోదా సాధించుకునే పరిస్థితి ఇంకా చేజారిపోలేదని అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/YSRCP

కొనసాగుతున్న వైఎస్సార్ సీపీ ఎంపీల దీక్ష

ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలంటూ దిల్లీలోని ఏపీ భవన్ వద్ద వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్నారు.

శనివారం ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.

ఆదివారం నాడు ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం కూడా క్షీణించడంతో పోలీసులు దీక్షా స్థలానికి వెళ్లి ఆయనను అక్కడి నుంచి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)