గ్రౌండ్ రిపోర్ట్: మీరట్‌లో ‘దళితులపై హిట్ లిస్ట్’ నిజానిజాలు

  • 9 ఏప్రిల్ 2018
గోపి పరియా Image copyright PRASHANT PARIYA
చిత్రం శీర్షిక ‘సమాజానికి ఉపయోగపడే ఇలాంటి యువకులు చాలా అరుదు’ అని గోపి గురించి ఆ గ్రామ దళితులు చెప్తున్నారు

ఉత్తరప్రదేశ్‌ మీరట్ జిల్లాలోని శోభాపూర్‌లో దళితులపై ఒక హిట్ లిస్ట్’ జారీ చేశాక హత్యకు గురైన దళిత యువకుడి అస్తికలను శనివారం గంగ (బ్రజ్‌ఘాట్)లో కలిపారు.

ఈ నెల మొదట్లో దళితులు చేపట్టిన భారత్ బంద్‌లో పాల్గొన్న వారిని హత్య చేయటం లక్ష్యంగా ఈ ‘హిట్ లిస్ట్’ను తయారు చేసినట్లు వార్తలు వచ్చాయి.

జనజీవనానికి దూరంగా ఉన్నట్లుండే శోభాపూర్‌‌లో పీఏసీ (ప్రొవిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టబుల్రీ)కి చెందిన గోధుమ రంగు ట్రక్కులు ఇప్పుడు ‘గోపీ భయ్యా’ ఇంటి కోసం వెదుకుతున్నాయి. గ్రామ దళితులు ప్రేమగా గోపీ భయ్యా అని పిలుచుకునే గోపి పరియాను.. శోభాపూర్ గ్రామానికే చెందిన గుర్జర్లు బుధవారం తుపాకీతో కాల్చి చంపారు.

నేషనల్ హైవే నంబర్ 58 మీద.. మీరట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోని గ్రామం శోభాపూర్. ఇక్కడ దళితుల జనాభాదే ఆధిక్యం. కానీ.. గోపీ భయ్యా హత్యానంతరం ఈ దళిత సమాజంలో ఆగ్రహావేశాల కన్నా భయాందోళనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మూడేళ్ల కిందట గుర్జర్లతో గొడవ

ఇది పాత కక్షలకు సంబంధించిన గొడవని గ్రామస్తులు కొందరు చెప్తున్నారు. మూడేళ్ల కిందట హోలీ పండుగ రోజు.. గ్రామంలోని గుర్జర్ వర్గానికి చెందిన మనోజ్ గుర్జార్, గుల్వీర్ గుర్జార్‌ల మీద దళిత యువకుడైన గోపీ పరియా దాడి చేసి వారి తలలు పగులగొట్టాడని వారు అంటున్నారు.

ఆ గొడవ విషయంలో ఎలాంటి క్రిమినల్ కేసులూ నమోదు కాలేదు. గ్రామ పంచాయతీయే ఆ వివాదాన్ని పరిష్కరించింది. అయితే.. గోపి పరియా హత్యకు ఆ ఘటనే అసలు కారణమనటం సరికాదని గ్రామస్తులు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

గ్రామంలో ఇటువంటి గొడవలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయని.. ఈ హత్యకు ముందు ఎన్నడూ ఇలాంటి గొడవలను ‘కులాల గొడవ’గా చూడలేదని వారు చెప్తున్నారు.

ఏదేమైనా.. దళితుల ఆవాసానికి దారీతీసే అన్ని మార్గాల్లోనూ పోలీసులను మోహరించారు.

‘ఈ పోలీసులను దళితుల రక్షణ కోసం మోహరించారా?’ అని ఒక వ్యక్తిని ప్రశ్నించాం.

‘‘జాటవ్‌లు చాలా కోపంగా ఉన్నారు. వాళ్లు అగ్రకులాల వారి మీద దాడి చేయకుండా ఈ పోలీసులు మోహరించారు. వీళ్లు మాకు కాదు.. వాళ్లకి రక్షణగా ఉన్నారు’’ అని అతడు జవాబిచ్చాడు.

భారత్ బంద్ సందర్భంగా ఏం జరిగింది?

ఏప్రిల్ రెండో తేదీన దళితులు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించినపుడు.. శోభాపూర్ గ్రామానికి చెందిన సుమారు 25-30 మంది యువకులు (పోలీసులు కథనం ప్రకారం) కూడా నేషనల్ హైవే - 58 మీద ప్రదర్శన నిర్వహించారు. వారికి గోపి పరియా నేతృత్వం వహించారు. గోపి, అతడి తండ్రి తారాచంద్ పరియాలు బీఎస్‌పీలో క్రియాశీల కార్యకర్తలుగా ఉన్నారు. తారాచంద్ రెండు సార్లు బీఎస్‌పీ టికెట్‌తో కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు.

‘‘భారత్ బంద్ సందర్భంగా నిరసనకారుల ప్రదర్శన పూర్తి శాంతియుతంగా సాగుతోంది. కానీ పోలీసులు కులం పేరుతో తిడుతూ లాఠీ చార్జి చేశారు’’ అని తారాచంద్ చెప్తున్నారు.

దీంతో హింస చెలరేగింది. యూపీ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఒక బస్సును కాల్చేశారు. శోభాపూర్‌లో పోలీస్ ఔట్‌పోస్టును దహనం చేశారు. కొన్ని వాహనాలను పగుల గొట్టటం, దుకాణాల మీద డాడులు జరిగాయి.

అయితే.. ఈ హింసకు పాల్పడింది బయటివారని దళితులు ఆరోపిస్తున్నారు. ఆ పనులు చేసిన ‘‘వాళ్లు శోభాపూర్ జనమే’’ అని పోలీసులు అంటున్నారు.

‘‘హింస చెలరేగినపుడు మేం ఆయుధాలు, రాళ్లు పట్టుకుని దళితులను ఆపాం. ఎందుకంటే మాకు (దుకాణాలు, వాహనాలు) నష్టం జరుగుతోంది కనుక’’ అని అగ్రవర్ణాల వారు చెప్తున్నారు.

గోపి హత్యలో ప్రధాన నిందితుడు మనోజ్ గుర్జర్ అన్న ఓమ్‌వీర్ సింహ్ గుర్జర్.. దుకాణాల యజమానులు కొందరి పేర్లు చెప్తూ.. కూడలిలో వారి దుకాణాలను దళితులు లూటీ చేశారని ఆరోపించారు. మహిళలను దళితులు అవమానించారని.. కాబట్టి వారిని నిలువరించాల్సిన అవసరం వచ్చిందని ఆయన వాదించారు.

చిత్రం శీర్షిక గోపి హత్య కేసులో ప్రధాన నిందితుడు మనోజ్ కుమార్ అన్న ఓమ్‌వీర్ సింహ్ గుర్జర్.. ఆ ‘జాబితా’ను పోలీసులకు ఇవ్వాలని రూపొందించిన వారు భావించినట్లు చెప్తున్నారు

ఆ తర్వాత దళితుల ‘హిట్ లిస్ట్’ తయారు చేశారు...

‘‘భారత్ బంద్’ రోజు రాత్రి.. జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. గ్రామానికి చెందిన గుర్జర్లు, బ్రాహ్మణులు, బనియాలు గ్రామంలోని గుడి దగ్గర సమావేశమయినట్లు చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం కొంత, తమకు అనుమానం ఉన్న వాళ్లు కొందరిని చేర్చి ‘అల్లర్లకు పాల్పడిన వారి’ జాబితాను తయారు చేశారు’’ అని గోపి హత్య కేసులో మరో నిందితుదు కపిల్ రాణా అన్న, ఓంవీర్ సింహ్ గుర్జర్లు వివరించారు.

‘‘వాళ్లు ఈ లిస్టును పోలీసులకు సమర్పించాలనుకున్నారు. ఆ జాబితా పేరు ‘దళిత సమాజంలో రౌడీల జాబితా’. అందులో దాదాపు 100 మంది (దళితులతో పాటు కొందరు ముస్లింలు కూడా) పేర్లు ఉన్నాయి’’ అని వారు పేర్కొన్నారు.

కానీ ఈ లిస్టు పోలీసులకు అందించటానికి ముందు వాట్సాప్‌లో సర్క్యులేట్ అయింది. అది దళితులకు కూడా చేరింది.

‘‘మూడో తేదీ సాయంత్రానికల్లా ఈ లిస్టు మా పిల్లల్లో చాలా మంది దగ్గర ఉంది’’ అని దళిత కాలనీలోని ఒక వృద్ధుడు రాజేంద్రకుమార్ చెప్పారు.

‘‘ఈ జాబితాను పోలీసులు జారీ చేశారని, ఇక పోలీసులు దాడులు చేస్తారని అందరూ అనుకున్నారు. దళిత యువకులు లిస్టులో తమ పేరు ఉందేమోనని చెక్ చేసుకున్నారు. లిస్టులో ఎవరెవరి పేర్లున్నాయో వారందరూ ఇళ్ల నుంచి పారిపోయారు’’ అని ఆయన తెలిపారు.

చిత్రం శీర్షిక గోపి తమ్ముడు ప్రశాంత్ పరియా.. ‘హిట్ లిస్ట్’లో ఇతడి పేరు ఐదో స్థానంలో ఉంది

దళితుల లిస్టు మాత్రమే ఎందుకు తయారు చేశారు?

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. శోభాపూర్‌ చుట్టూ పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో.. అందులోనూ దళితుల జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో ఇలాంటి ‘జాబితా’లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి.

శోభాపూర్‌తో పాటు సమీపంలోని దాయమ్‌పూర్, డాబ్‌కా, మీర్‌పూర్, రోహటా, ఫజల్‌పూర్ వంటి పలు గ్రామాల్లో దళిత యువకులను అరెస్ట్ చేయాలంటూ పోలీసులు నిరంతరం గాలిస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి దళిత యువకులు పరారయ్యారు.

ఇటువంటి జాబితాలతో ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని మీరట్ ఎస్‌ఎస్‌పీ మంజిల్ సైనీ స్పష్టం చేశారు. కానీ మరో ఆసక్తికరమైన విషయం.. పోలీసులు నమోదు చేస్తున్న ఎఫ్‌ఐఆర్‌లలో ఉన్న పేర్లు.. సోషల్ మీడియాలో పంపిణీ అవుతున్న లిస్టులతో సరిపోతున్నాయి.

ఉత్తరప్రదేశ్ పోలీసులు అగ్ర కులాల వారి సూచనల ప్రకారం పనిచేస్తున్నారని ఈ ప్రాంతానికి చెందిన చాలా మంది దళితులు ఆరోపించటానికి ఇదే కారణం.

గోపి పరియా సోదరుడు అరుణ్ పరియా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

కంకర‌ఖేడా పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొందరు యువకులను కొడుతున్న వీడియోను అతడు చూపించాడు. ‘‘యోగీ సర్కారు పోలీసులు చాలా క్రూరమైన వారు. ఇన్ని ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఇలా కొడుతున్నారు. కేవలం పేరు వచ్చిందంటే మమ్మల్ని తీసుకెళ్లి తీవ్రంగా కొడతారు. మా మాట ఏమాత్రం వినరు. అందుకే చాలా మంది యువకులు భయపడి పారిపోయారు’’ అని అతడు పేర్కొన్నాడు.

చిత్రం శీర్షిక ‘అమ్మా భయపడకు.. నాకు బాగైపోతుంది’ అని తన కొడుకు ఆస్పత్రిలో తనతో చివరిగా చెప్పిన మాటలను గోపి తల్లి గుర్తుచేసుకుని రోదిస్తున్నారు

గోపి హత్య ఎలా జరిగింది?

గోపి పరియా కూడా ఏప్రిల్ రెండో తేదీ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయాడని అతడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నాలుగో తేదీ మధ్యాహ్నం బట్టలు మార్చుకోవటానికి గోపి ఇంటికి వచ్చాడని వారు తెలిపారు.

హత్య కేసులో నిందితుడైన కపిల్ తండ్రి, మాజీ రైల్వే ఉద్యోగి సుఖ్‌దేవ్ సింహ్ మాట్లాడుతూ.. హింస విషయంలో పోలీసులకు సాక్ష్యం చెప్పవద్దని, దానివల్ల దళితుల సమస్యలు పెరుగుతున్నాయని తన కుమారుడు కపిల్‌తో గోపి చెప్పినట్లు పేర్కొన్నారు.

మనోజ్ గుర్జార్ మాట్లాడటానికి పిలుస్తున్నాడని చెప్తూ గ్రామానికే చెందిన సునీల్ అనే యువకుడు గోపిని ఇంటి నుంచి తీసుకెళ్లాడని గోపి తండ్రి తారాచంద్ చెప్తున్నారు. ఆ మనోజ్‌నే గోపి మూడేళ్ల ముందు కొట్టాడు.

ఆ తర్వాత సుమారు నాలుగున్నర గంటల ప్రాంతంలో.. గ్రామం మొత్తానికీ ఆరు సార్లు ఫైరింగ్ శబ్దం వినిపించింది. గ్రామంలోని శ్రీరాం విహార్ కాలనీ సమీపంలో ఆలయ పరిసరాల దగ్గర గోపి పరియార్ మీద కాల్పులు జరిపారు. బుల్లెట్లు తగిలిన తర్వాత గోపి ఇంటి వైపుగా పరుగెత్తాడు. సుమారు రెండు వందల మీటర్లు పరుగెత్తిన తర్వాత గోపి కింద పడిపోయాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత చనిపోయాడు.

బీఎస్‌పీ, ఎస్‌పీ ప్రభుత్వాల హయాంలో దళితులు గుర్జర్ల కౌన్సిల్ స్థానాలకు పోటీ చేశారని, రెండు సమాజాలూ కలిసి నిలబడ్డాయని ఇరు పక్షాల వారూ చెప్తున్నారు. కానీ ఏప్రిల్ 4వ తేదీన సూర్యాస్తమయం అయ్యేసరికి గ్రామంలో రాజకీయ, సామాజిక సమీకరణాలు మారిపోయాయి.

Image copyright PRASHANT PARIYA
చిత్రం శీర్షిక దళిత సమాజంలో గోపికి మంచి పేరుంది

గోపీ పరియా ఎవరు?

శోభాపూర్ గ్రామలో 6,000 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ గుర్జర్ల ఓట్లు 200 కన్నా తక్కువే ఉన్నాయి.

ముస్లింలు, పాల్, బనియా, పండితుల ఇళ్లు కూడా ఉన్నాయి. అందరికంటే దళితుల సంఖ్య చాలా ఎక్కువ. మూడు దళిత కాలనీలు ఉన్నాయి. అన్నీ హైవే వెంటే ఉన్నాయి. మొదటి కాలనీ దళితులు చేతివృత్తులు చేస్తుంటారు.

రెండో కాలనీ వారు చర్మవృత్తిలోని వారు. మూడో కాలనీలోని వారు పండితులు, గుర్జార్లు, బనియాల దగ్గర పనిచేస్తుంటారు.

మిగతా కాలనీలతో పోలిస్తే చేతివృత్తులు చేసే దళితుల కాలనీ మెరుగుగా ఉంటుంది. ఇక్కడి వారు కొందరు ఇప్పుడు వ్యాపారం కూడా చేయటం మొదలుపెట్టారు. 27 ఏళ్ల గోపి పరియా వారిలో ఒకడు.

క్రీడా వస్తువుల ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచిన నగరం మీరట్. గోపి మీరట్‌లో బ్యాడ్మింటన్ రాకెట్ల అల్లిక పని చేస్తున్నాడు.

దళిత సమాజంలో గోపికి మంచి పేరుంది. గోపి తల్లిదండ్రులకు సానుభూతి తెలియజేయటానికి వచ్చే వాళ్లలో సగం మంది అంటున్న మాట.. ’’సామాజానికి ఉపయోగపడే ఇటువంటి యువకులు తక్కువగా ఉంటారు’’.

కానీ గుర్జర్ కాలనీలో గోపి గురించి వినిపించిన చివరి మాటలు.. ‘‘ఈ కుర్రాడు దుస్సాహసం చేస్తున్నాడు. సింహాలపై పిడికిలి ఎత్తుతున్నాడు. వాడు చనిపోవాల్సిందే. మా వాళ్లు కాకపోతే ఇంకెవరి కుర్రాడైనా అతడిని చంపేవాడు’’.

చిత్రం శీర్షిక గోపి హత్య కేసులో మరో నిందితుడు కపిల్ అన్న.. తమ వాళ్లు కాకపోతే ఇంకెవరైనా గోపిని చంపేవారని గ్రామంలోని అగ్రవర్ణాల వారు అంటున్నారు

గోపి మరణం తర్వాత...

గోపికి ఐదేళ్ల కిందట పెళ్లయింది. అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కూతురు ఇంకా తల్లి ఒడిలోనే ఉంది. గోపి తల్లి తన పెద్ద కొడుకును గుర్తుచేసుకుని ఎన్నోసార్లు స్పృహ కోల్పోతూ ఉంటుంది.

గోపి హత్య కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు (మనోజ్ గుర్జర్, కపిల్రాణా, గిర్‌ధారీ, ఆశిష్ గుర్జర్) ఉరి శిక్ష విధించాలని కోరుతున్నాడు. ఈ కేసులో త్వరగా చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని పోలీస్ దర్యాప్తు అధికారి పంకజ్ కుమార్ సింహ్ చెప్తున్నారు.

అదే సమయంలో.. ఈసారి డాక్టర్ అంబేడ్కర్ జయంతిని నిర్వహించటం లేదని దళిత సమాజం ప్రకటించింది. సోషల్ మీడియాలోని దళిత గ్రూపుల్లో ''మనం గోపీ పరియాను కాదు.. మన ముఖాన్ని కోల్పోయాం'' అని పోస్ట్ చేస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బోరిస్ జాన్సన్: మళ్లీ ప్రధానిగా కన్జర్వేటివ్ నేత.. బ్రిటన్ ఎన్నికల్లో టోరీల విజయం

గొల్లపూడి మారుతీరావు (1939-2019): "ఒక్క జీవితంలోనే పది జీవితాలు చూసిన మనిషి"

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

పార్లమెంటుపై దాడికి 18ఏళ్లు: బులెట్లు దూసుకొస్తున్నా, ప్రాణాలకు తెగించి గేటు నంబర్ 1 మూసేశాడు

ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు

'విజయవాడ, విశాఖపట్నం మెట్రోలపై ఏపీ ప్రభుత్వ అనాసక్తి'

అస్సాంలో ఆందోళనలు: పౌరసత్వ సవరణ బిల్లుపై పెరిగిన నిరసనలు... ఇద్దరు మృతి