#BBCShe: వితంతు పింఛన్లలో కానరాని ‘గుజరాత్ అభివృద్ధి’

  • 10 ఏప్రిల్ 2018
హసీనా Image copyright Roxy Gagdekar

శిథిలావస్థలో ఉన్న చిన్న గుడిసె, విరిగిపోయిన మంచం, అతుకుల దుస్తులు, జీవం కోల్పోయిన మొహాలు.. హసీనా ఇంట్లో అడుగుపెడితే కనిపించిన పరిస్థితి ఇదీ.

నీళ్లు లేవు, విద్యుత్తు లేదు, గ్యాస్ లేదు.. నిజానికి చాలా రోజులుగా హసీనాకు కడుపునిండా తినడానికి తిండి కూడా లేదు. గుజరాత్‌లో ఉండే హసీనా భర్త చనిపోయి చాలా కాలమైంది. అయినా ఆమెకు అందాల్సిన వితంతు పింఛను ఇప్పటికీ అందట్లేదు.

హసీనా లాంటి బాధితులు గుజరాత్‌లో చాలామంది ఉన్నారు. సరైన ఆదాయం లేక, పింఛను అందక వాళ్లెలా జీవిస్తున్నారో తెలుసుకునేందుకు #BBCShe బృందం హసీనాతో పాటు పుష్ప అనే మరో మహిళను పలకరించింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption#BBCShe: వాళ్ల నాన్నే ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు కదా?

హసీనా భర్త 2015లో చనిపోయారు. అప్పట్నుంచీ హసీనాతో పాటు ఆమె నలుగురు పిల్లలు చుట్టుపక్కల వారి దయాదాక్షిణ్యాల మీదే బతుకుతున్నారు. ఇతరులు చేసే సాయంతోనే పూట గడుపుతున్నారు.

కొన్నిసార్లు ఖాళీ కడుపులతోనే నిద్రపోతున్నారు. ‘ప్రభుత్వం ఇచ్చే వితంతు పింఛను హసీనా లాంటి వాళ్లకు ఉపయోగపడనప్పుడు ఇంకెందుకు?’ అని ప్రశ్నిస్తారు జ్యోత్స్నా జడేజా అనే స్థానిక సామాజిక కార్యకర్త.

సౌరాష్ట్ర ప్రాంతంలోని జుమ్మావడి అనే చిన్న పల్లెటూళ్లో ఉండే హసీనాను బీబీసీ కలిసినప్పుడు ‘నాకు పింఛను అందితే నా పిల్లలకు రెండు పూటలా అన్నం పెట్టే అవకాశం దొరుకుతుంది. కళ్ల ముందే కన్నబిడ్డలు ఆకలితో నిద్రిస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం’ అన్నారామె చెమర్చిన కళ్లతో.

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వితంతువులంతా రూ.1000 పింఛనుకు అర్హులు. కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకుంటే నెల నెలా వాళ్లకా పింఛను అందుతుంది. కానీ వ్యవస్థలో ఉన్న అనేక ‘అడ్డుగోడల’ ఫలితంగా ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధిదారుల చేతికి చేరకుండానే ఆ పింఛను మాయమవుతోంది.

Image copyright Roxy Gagdekar

రాష్ట్రంలో 1.52 లక్షలమంది వితంతు పింఛను లబ్ధిదారులున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 2016లో చెప్పారు. మరి ఆ జాబితాలో హసీనా పేరు ఎందుకు లేదో?

హసీనా భర్త సాదిక్ 2015, నవంబర్‌లో చనిపోయారు. ఆ తరవాత కొన్ని రోజులకే ఆమె వితంతు పింఛనుకు దరఖాస్తు చేశారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆమెకు పింఛను అందట్లేదు. ‘నేను కలెక్టరేట్‌కు వెళ్లిన ప్రతిసారీ నాకో లేఖ పంపిస్తామని చెబుతారు. కానీ ఇప్పటిదాకా నాకెలాంటి లేఖా రాలేదు’ అంటారామె.

హసీనా పింఛను దరఖాస్తుకు సంబంధించి మాలియా తాలూకా ఎగ్జిక్యుటివ్ మెజిస్ట్రేట్‌ ఎం.ఎన్.సోలంకితో #BBCShe మాట్లాడింది. ‘హసీనా ఉండే ఊరికి సర్పంచ్ లేరు. అందుకే ఆమె దరఖాస్తుపై ఎవరూ సంతకం చేయలేదు. ఇప్పుడు నేనే సాక్షిగా ఉండి ఆమె దరఖాస్తుపై సంతకం చేశా. ఆమెకు పింఛను అందేలా చూసే బాధ్యత నాది’ అని సోలంకి చెప్పారు.

Image copyright Roxy Gagdekar

ఎక్కడో మారుమూల పల్లెలో ఉండే హసీనాదే కాదు, గుజరాత్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన అహ్మదాబాద్‌లో ఉండే పుష్పాదేవి రఘువంశీది కూడా ఇదే సమస్య. ఆమె కూడా 2016నుంచి వితంతు పింఛను కోసం ఎదురుచూస్తున్నారు.

‘ప్రతిసారీ ప్రభుత్వాధికారులు ఏదో ఒక డాక్యుమెంట్ అడుగుతారు. నేను అన్ని పత్రాలూ అందించా. ఇప్పటిదాకా దాదాపు రూ.3వేలు ఖర్చుపెట్టా. అయినా నా పింఛను రాలేదు’ అంటారామె.

పుష్పాదేవికి 14ఏళ్ల కూతురు, 16ఏళ్ల కొడుకు ఉన్నారు. ‘నా కొడుకు పనిలో చేరడానికి ప్రయత్నించినా, బాలకార్మికుల చట్టం కారణాంగా వాడినెవరూ చేర్చుకోవట్లేదు. ఒకవేళ దొరికినా ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు’ అని పుష్ప చెప్పారు.

పుష్ప కూతురు 9వ తరగతి చదువుతోంది. సమయానికి ఫీజు చెల్లించలేని కారణంగా స్కూళ్లో ఆమె చాలాసార్లు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

‘నా కూతురు తెలివైంది. బాగా చదువుతుంది. నాకు పింఛను అందితే తనని బాగా చదివించే అవకాశం వస్తుంది’ అని పుష్ప #BBCSheతో చెప్పారు. రెడీమేడ్ దుస్తులపైన పూసలు కుట్టే పని చేస్తూ పుష్ప రోజుకి రూ.200దాకా సంపాదిస్తారు. కానీ అహ్మదాబాద్‌లాంటి నగరంలో బతకడానికి అది సరిపోదు.

పుష్ప కూతురు కుంకుమ్.. 2016లో తన తండ్రి చనిపోయినప్పటి నుంచి స్కూల్‌కి ఏ రోజూ లంచ్ బాక్స్ తీసుకెళ్లలేదు. ‘నా స్నేహితులే వాళ్లు తెచ్చుకున్న అన్నంలో కొంచెం నాకు పెడతారు’ అంటోంది కుంకుమ్.

Image copyright Roxy Gagdekar

‘నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న 90రోజుల్లోగా వితంతు పింఛను అందాలి. కానీ ఆ వ్యవస్థపైన ఎవరూ నిఘా పెట్టట్లేదు. సరిగ్గా పనిచేయని అధికారులకు పెనాల్టీ పడుతుందనే భయం లేదు. అందుకే ఆ పథకం సరిగ్గా అమలుకావడం లేదు. పేదలకు దాని ఫలాలు అందట్లేదు’ అంటారు అంకితా పాంచల్‌ అనే స్థానిక సామాజిక కార్యకర్త.

‘గుజరాత్ అభివృద్ధి అంతా నగరాలు, వ్యాపార వర్గాల్లోనే కనిపిస్తుంది. వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకునే వాళ్లలో ఎక్కువమంది సామాజికంగా వెనకబడ్డ వర్గానికి చెందిన మహిళలే. వాళ్లు తమ గొంతును బలంగా వినిపించలేరు. దాంతో అధికారులు ఆ దరఖాస్తులను సీరియస్‌గా తీసుకోరు.

ఈ పింఛను వితంతువుల హక్కు. కానీ ప్రభుత్వోద్యోగులు దీన్ని ఓ సేవా కార్యక్రమంగా భావిస్తారు. అందుకే ఆ దరఖాస్తుల పరిశీలనలో జాప్యం చేస్తారు’ అని గౌరంగ్ జనీ అనే సామాజికవేత్త అభిప్రాయపడతారు.

ఈ అంశం గురించి గుజరాత్ రాష్ట్ర సాధికారత, సామాజిక న్యాయ శాఖ మంత్రి ఈశ్వర్ పర్మార్‌తో #BBCShe బృందం మాట్లాడింది.

‘వితంతు పింఛన్లకు సంబంధించి మాకు కూడా చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి కాబట్టి అధికారులతో మాట్లాడి ప్రభుత్వోద్యోగులు మరింత బాధ్యతాయుతంగా పింఛన్ల దరఖాస్తులపై స్పందించేలా కఠినతర నియమ నిబంధనలు రూపొందిస్తాం’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...

అనంతపురం హత్యలు: శివాలయంలో గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా