‘అప్పుడు అంబేడ్కర్ పేరు పలకడానికి సిగ్గుపడేదాన్ని.. ఇప్పుడు గర్వపడుతున్నా’

  • 10 ఏప్రిల్ 2018
ముంతాజ్ షేక్ Image copyright CORO
చిత్రం శీర్షిక ముంతాజ్ షేక్

ముంతాజ్ షేక్.. మహారాష్ట్రలోని ఓ పేద ముస్లిం కుటుంబంలో పుట్టిన మహిళ. పెద్దగా చదువుకోలేదు. అయినా రాష్ట్రంలోని వయోజన విద్య ప్రచారోద్యమంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

గృహహింస, అత్యాచార బాధితుల పునరావాసం కోసం పనిచేస్తున్నారు. మహిళలకు పబ్లిక్ టాయిలెట్ల కోసం పోరాడుతున్న ‘రైట్ టు పీ’ క్యాంపైన్‌లోనూ కీలకంగా ఉన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ చూపిన దారిలో నడవడం వల్లే తానివన్నీ చేయగలుగుతున్నట్లు ముంతాజ్ చెబుతారు.

‘చైతన్యపరుచు, సమీకరించు, పోరాడు’ అన్న అంబేడ్కర్ నినాదమే తన జీవన విధానాన్ని మార్చిందంటారు ముంతాజ్. ఇప్పుడు అంబేడ్కర్‌ను ఆరాధిస్తున్న ముంతాజ్ ఒకప్పుడు మాత్రం ఆయన్ను అంతగా ఇష్టపడలేదు.

‘‘స్కూల్లో చదువుకున్న పాఠాలు మినహా అంబేడ్కర్ గురించి ఒకప్పుడు నాకు పెద్దగా తెలీదు. ‘జై భీమ్’ అనడానికి కూడా నేను సిగ్గుపడేదాన్ని. అలా నినాదం చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు. అంబేడ్కర్ దళితులకు మాత్రమే ప్రాధాన్యమున్న వ్యక్తి అనీ, వాళ్లకోసమే రాజ్యాంగం రాశారానీ అనుకునేదాన్ని.

మేం నీలం రంగు దుస్తుల్ని కూడా ధరించేవాళ్లం కాదు. అది ‘వాళ్ల’ రంగు అని మాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు నాలాంటి మహిళలందర్నీ చైతన్యపరిచి, ఒక్కతాటిపైకి తెచ్చి, వివిధ ఉద్యమాలను నిర్వహించగలుగుతున్నానంటే అది అంబేడ్కర్ సూచించిన ‘చైతన్యపరుచు, సమీకరించు, పోరాడు’ అనే నినాద ఫలితమే’’ అంటారు ముంతాజ్.

Image copyright CORO

‘నా జీవితం ఓ సినిమా కథ’

ముంతాజ్ జీవితం ఎక్కడ ప్రారంభమైందో తెలిస్తే ఆమె జీవితంలో ఎంత ముందుకొచ్చారో అర్థమవుతుంది.

ముంతాజ్ చిన్నప్పుడే.. భార్యనూ, కూతురిని వదిలేసి కొడుకును తీసుకొని ఆమె తండ్రి వెళ్లిపోయాడు. అప్పట్నుంచీ ముంతాజ్ తల్లి తెలిసిన వాళ్లింట్లో తల దాచుకుంది. ముంతాజ్ తన మేనమామ ఇంట్లో పెరిగింది.

9వ తరగతి వరకూ ముంతాజ్‌ను చదివించినా, ఆ తరవాత చాలా ముస్లిం కుటుంబాల్లోలానే ఆమెను స్కూల్ మాన్పించారు. 15ఏళ్లకే ఆమెకు పెళ్లి చేశారు.

‘‘నా జీవితం ఓ సినిమా కథలా అనిపిస్తుంది. 15ఏళ్లకే పెళ్లయింది. తరవాతి ఏడాదే కూతురు పుట్టింది. కాలం అలా సాగిపోతోంది కదా అనుకుంటుండగా ‘కోరో’ నా జీవితంలోకి ప్రవేశించింది. దాంతో నా ప్రయాణం కీలక మలుపు తీసుకుంది’ అంటారు ముంతాజ్.

‘‘ఓసారి కోరో(కమిటీ ఆఫ్ రిసోర్స్ ఆర్గనైజేషన్) సభ్యులు మేముండే ప్రాంతానికి వచ్చి ఏదో సర్వే చేశారు. నేను కిటికీలోంచి వాళ్లను చూశా. అప్పట్లో నేను బయటికి వెళ్లి నీళ్లు తేవాలన్నా, కాలకృత్యాలకు వెళ్లాలన్నా ఇంట్లో వాళ్ల అనుమతి తీసుకోవాల్సిందే. దాంతో కోరో సభ్యులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నా బయటకు వెళ్లే అవకాశం ఉండేది కాదు.

కానీ ఓ రోజు ధైర్యం చేసి రహస్యంగా వాళ్లు నిర్వహించిన సమావేశానికి వెళ్లా. మా బస్తీకి రోడ్లు, లైట్లు, నీళ్లు లేవనీ, ఆయా విభాగాల్లో తాము పనిచేస్తామనీ చెప్పారు. ఎక్కడినుంచో వచ్చిన వాళ్లు మా బస్తీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నప్పుడు నేనెందుకు చేయకూడదు అనిపించింది. అదే విషయం వాళ్లకు చెప్పా.

నన్ను కూడా వాళ్లతో కలిసి పనిచేయడానికి ఆహ్వానించారు. మొదట మా ఇంట్లో వాళ్లకు చదువు చెప్పమన్నారు. నేను 9వ తరగతి వరకూ చదువుకున్నా కాబట్టి ప్రాథమిక విషయాలు మా వాళ్లకు సులువుగానే నేర్పగలిగా. తరవాత ఓ రోజు సమావేశంలో రాజ్యాంగం గురించి బోధించారు. అప్పుడే మహిళల హక్కుల గురించి నాకు తెలిసింది.

Image copyright CORO

‘అప్పుడే ముస్లిం పర్సనల్ లా గుర్తొచ్చింది’

దేశంలో అందరూ సమానమేనని రాజ్యాంగం చెబుతుందనే విషయం నాకప్పుడే అర్థమైంది. కానీ అది చెప్పేదానికి అమలులో ఉన్న వ్యవస్థకూ సంబంధం లేదనే ఆలోచన నన్ను తొలిచేసింది. అదే నాలో ఓ కొత్త మార్పునకు పునాది వేసింది’’ అని ముంతాజ్ గుర్తు చేసుకుంటారు.

‘‘నా ఉత్సాహాన్ని గమనించి కోరో సభ్యులు మా బస్తీలో తమ కేంద్రాన్ని నిర్వహించే బాధ్యతను నాకప్పగించారు. ఓ రోజు ఇద్దరు భార్యాభర్తలు తగవులాడుకొని ఆ కేంద్రానికి వచ్చారు. భార్యాభర్తలిద్దరూ సమానమనీ, అలా దెబ్బలాడుకోవడం మంచిది కాదని చెప్పా. దానికి బదులుగా ‘మీ ఇంట్లో జరుగుతోందీ ఇదేగా’ అని వాళ్లు నాతో అన్నారు. ఆ మాట నాకు తూటాలా తగిలింది.

నిజమే.. నా భర్త కూడా నన్ను హింసిస్తాడు. అతడిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించినా అది జరగలేదు. కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకుందామనుకున్నా కుదరలేదు. అప్పుడే ‘ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్ ఆఫ్ 1937’ గుర్తొచ్చింది.

దాని సాయంతో ‘తలాక్’ తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టా. నేను తీసుకున్న నిర్ణయాన్ని మా అమ్మ తట్టుకోలేకపోయింది. ఎప్పుడూ అంత మౌనంగా ఉండే అమ్మాయి, చిన్నప్పట్నుంచీ ఇంట్లో ఎంతో హింసను చూసిన అమ్మాయి అలాంటి నిర్ణయం ఎలా తీసుకుందని ఆశ్చర్యపోయింది.

కోరో సంస్థే నాలో ఆ మార్పు రావడానికి కారణమని ఆమె భావించింది. ఆ సంస్థతో కలిసి పనిచేయడం మానేయమని నన్నడిగింది. నేను ఒప్పుకోలేదు. దాంతో నన్నూ నా బిడ్డనూ ఇంట్లోంచి బయటకు పంపించేసింది’’ అంటూ తన గతం గురించి చెబుతారు ముంతాజ్.

‘‘ఇంట్లోంచి వచ్చేశాక నాకు కోరో ఫెలోషిప్ దొరికింది. నా దగ్గరున్న కొద్దిపాటి బంగారాన్ని అమ్మేసి ఓ గది అద్దెకు తీసుకుని ఉంటూ పనిచేసుకోవడం మొదలుపెట్టా. ఆ తరవాత ఏడాదికి నాకు విడాకులు కూడా వచ్చాయి.

నేను విడాకులు తీసుకోవడం అమ్మకు నచ్చలేదు. ఓ రోజు నా దగ్గరకు వచ్చి నన్ను తీవ్రంగా కొట్టింది. దాంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేశా. కొన్నాళ్లకు అన్నీ సద్దుమణిగాయి. అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది.

కానీ ఈ పరిణామాలన్నీ నా కూతురిపైన ప్రతికూల ప్రభావం చూపాయి. తను చాలా భయపడింది. చాలాకాలం ఎవరితో మాట్లాడలేదు. చివరికి కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లాక తనలో మార్పు మొదలైంది. ఆ సమయంలో కోరోలో పనిచేసే రాహుల్ గవరే నాకు తోడుగా ఉన్నారు.

ఆయన ఓ రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించారు. గత జీవితం గుర్తొచ్చి నాకు మొదట భయమేసింది. కానీ నా కూతురు కూడా రాహుల్‌ని పెళ్లి చేసుకోమని కోరింది. దాంతో మళ్లీ నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టా’’ అంటూ తన కొత్త జీవితం ఎలా ప్రారంభమైందో ముంతాజ్ వివరించారు.

తనకు ఓ కొత్త జీవితాన్ని ఇచ్చిన కోరో విస్తరణ కోసం ముంతాజ్ పనిచేయడం మొదలుపెట్టారు. మొదట వయోజన విద్యా కేంద్రాల విస్తరణ కోసం పనిచేశారు. ఆ తరవాత అసిస్టెంట్ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆపైన ‘కోరో’లో సొంతంగా ఓ విభాగ బాధ్యతలు తీసుకున్నారు.

ముంతాజ్‌ అనేక ఫెలోషిప్‌లు చేశారు. మహిళామండలి ఛైర్మన్‌గానూ ఎన్నికయ్యారు. తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ‘కోరో’కు జాయింట్ సెక్రెటరీగానూ చేశారు.

ప్రస్తుతం ‘రైట్ టు పీ’ ఉద్యమం ప్రాజెక్టు సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గృహహింస, అత్యాచార బాధితుల సంక్షేమం కోసం కూడా పాటుపడుతున్నారు. ‘సంవిధాన్ సంవర్థన్ సమితి’తోనూ కలిసి పనిచేస్తున్నారు.

‘‘మొత్తంగా నా జీవితాన్ని గమనిస్తే అంబేడ్కర్ ఇచ్చిన ‘చైతన్యపరచు, సమీకరించు, పోరాడు’ అన్న నినాదమే నన్ను ముందుకు నడిపిందనీ, ఆ నినాద ప్రభావం నా ప్రతి పనిలోనూ కనిపిస్తుందనీ అర్థమవుతుంది’’ అంటారు ముంతాజ్.

‘‘ఇప్పటికీ ఆయన కళ్లు నాతో మాట్లాడతాయి. ఆయన నన్ను గమనిస్తున్నారని అనిపిస్తుంది. నాకు మాట్లాడటానికీ, జీవితంలో పోరాడటానికీ స్ఫూర్తినిచ్చిన అంబేడ్కర్‌కు సదా కృతజ్ఞురాలిని’’ అని చెబుతారు ముంతాజ్, ఆ కృతజ్ఞతను తన కళ్లలో చూపిస్తూ..!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలోనుంచి బోటును బయటకు తీయలేరా

కేసీఆర్‌నే జైలుకు పంపుతామంటున్నారు.. తప్పు చేస్తే ఆ సీఎంలు వదిలిపెట్టేవాళ్లా - కేటీఆర్

18 సంవత్సరాల్లోపు యూజర్లకు ఇలాంటి పోస్టులు ఇక కనిపించవు - ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్

ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్

శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనను టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారు

గోదావరి కచ్చులూరు పడవ ప్రమాదంలో ప్రధాన నిందితుడైన బోటు యజమాని, మరో ఇద్దరి అరెస్ట్

నిర్మలా సీతారామన్: కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు... లాభాలతో ఉరకలెత్తిన సెన్సెక్స్

ఆంధ్రప్రదేశ్: గ్రామ స‌చివాల‌య ఉద్యోగ ప‌రీక్ష‌లపై వివాదం ఏంటి.. ప్రభుత్వం ఏమంటోంది