తండ్రిని ఆకలి ఓడించింది, ఆ తండ్రిని కొడుకు గెలిపించాడు.. రాహుల్ 'గోల్డ్' కోస్ట్ స్టోరీ ఇదీ!

  • 10 ఏప్రిల్ 2018
తల్లిదండ్రులు నీలిమ, మధులతో రాహుల్ Image copyright Madhu
చిత్రం శీర్షిక తల్లిదండ్రులు నీలిమ, మధులతో రాహుల్ (రాహుల్ తల్లి నీలిమ 2016లో మరణించారు.)

"జాతీయ జెండా రెపరెపలాడుతుండటం.. జాతీయ గీతం వినడమే.. నాకు కావలసింది. నీ డబ్బు, హోదా కోసం కాదు రా.. నేను ఎదురుచూడబోయేది"- ఇవీ రాగాల మధు తన కుమారుడు వెంకట్ రాహుల్‌‌ గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా) కామన్వెల్త్ క్రీడాపోటీలకు వెళ్లడానికి ముందు అతడికి చెప్పిన మాటలు!

ఏప్రిల్ 7న వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని సాధించి తండ్రి కలను నెరవేర్చారు 21 ఏళ్ల రాహుల్.

రాహుల్ క్రీడాకారుడు కావడం వెనక తండ్రి మధు ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టూవర్టుపురం గ్రామానికి చెందిన మధు తన పిల్లల కలలు నెరవేర్చడానికి పొలం, ఇల్లు కూడా అమ్ముకున్నారు.

మధు కూడా ఒకప్పుడు క్రీడాకారుడు. వివిధ పోటీల్లో పాల్గొన్న ఆయన 14 బంగారు పతకాలు గెలుచుకున్నారు.

"నేను కూడా వెయిట్‌లిఫ్టర్‌నే. కళాశాలలో ఉండగా కబడ్డీ ఆడాను. జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నాను" అని ఆయన బీబీసీతో చెప్పారు. 1995లో పెళ్లయిన తర్వాత, ఆర్థిక స్తోమత చాలక ఆయన ఆటను వదులుకున్నారు. 1996లో రాహుల్ పుట్టాడు. తన కుమారుడికి ఆట పట్ల మక్కువ ఉందని మధు తర్వాత గుర్తించారు.

Image copyright Madhu
చిత్రం శీర్షిక రాహుల్

'రాహుల్ ఆసక్తిని చూసి నేనే శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టా'

"మూడేళ్ల వయసున్నపుడు రాహుల్ నా వెయిట్‌లిఫ్టింగ్ సామగ్రితో ఆడుకుంటూ ఉండేవాడు. అతడిలో ఉన్న ఆసక్తిని చూసి నేనే శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను'' అని గుర్తు తెచ్చుకున్నారు మధు.

"ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ముందుకు వెళ్లలేకపోయాను. నా కొడుకుకు మాత్రం వీటి కారణంగా వెనకడుగు వేసే పరిస్థితి రానివ్వకూడదని నిశ్చయించుకున్నాను. రాహుల్‌ను స్పోర్ట్స్ మీట్‌లకు తీసుకెళ్లేవాడిని. అతడికి వెయిట్‌లిఫ్టింగ్‌ను చూసి అర్థం చేసుకోవడం అవసరమనిపించింది'' అని ఆయన వివరించారు.

రాహుల్ తర్వాత తెలంగాణలోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో చేరాడు. ఆయన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఇప్పటి వరకు దాదాపు 56 బంగారు పతకాలు సాధించారు.

Image copyright Madhu
చిత్రం శీర్షిక ఒక స్పోర్ట్స్ మీట్‌లో రాహుల్

చిన్న కుమారుడు వరుణ్ కూడా వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి చూపడం మధుకు ఇంకా ఆనందం కలిగించింది. 2017 నవంబరులో ఆస్ట్రేలియాలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో వరుణ్ 77 కేజీల విభాగంలో పసిడి పతకం గెల్చుకున్నారు.

అన్నదమ్ములిద్దరూ పంజాబ్‌లోని జాతీయ క్రీడా సంస్థలో శిక్షణ పొందుతున్నారు.

"నా ఇద్దరు కొడుకులు సాధించేది చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎరుకల కుటుంబంలో పుట్టిన నేను, కుటుంబం ఆకలి తీర్చాలా, క్రీడల్లో కొనసాగాలా అని ఆలోచించేవాడిని. ఈ రెండింటిలో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబం కోసం ఆటను వదులుకున్నాను. నా కొడుకులు వారి కలలతో పాటు నా కలలు కూడా నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు మధు.

Image copyright Madhu
చిత్రం శీర్షిక కుమారులు రాహుల్, వరుణ్‌లతో మధు

2016లో క్యాన్సర్‌తో చనిపోయిన రాహుల్ తల్లి

తల్లిదండ్రులే రాహుల్‌కు మొదటి స్నేహితులని మధు చెప్పారు.

"నేను, వాళ్ల అమ్మనే వాడికి స్నేహితులం. సినిమాకు వెళ్లాలన్నా రాహుల్ మాతోనే. ఇప్పటికీ ఇంటికి వస్తే సినిమాకు నాతోనే వస్తాడు. 2016 ఆగస్టులో తల్లి నీలిమ క్యాన్సర్‌తో కాలం చేసినప్పుడు రాహుల్ చాలా కుంగిపోయాడు. ఆట మీద పట్టు మాత్రం కోల్పోలేదు" అని మధు తెలిపారు.

రాహుల్‌కు అన్నీ అమ్మానాన్నే. రాహుల్ ఛాతీపై ఉన్న తల్లిదండ్రుల టాటూయే అందుకు చిహ్నం. కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన పసిడి పతకాన్ని ఆయన తన తల్లిదండ్రులకు అంకితం ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు