గూగుల్ హోమ్‌: త్వరలో మీరు మెషీన్లతో మాట్లాడొచ్చు!

  • 10 ఏప్రిల్ 2018
డిజిటల్ వాయిస్ అసిస్టెంట్స్ Image copyright Trushar Barot

"చిట్టీ, మంచి కాఫీ తీసుకురా! టీవీ ఆన్ చేసి న్యూస్ చానెల్ పెట్టు! అలాగే, ఈ రోజు ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకో?" అని ఉదయం లేవగానే మీ పనులన్నింటినీ చిట్టీకి పురమాయించారు.

కానీ, చిట్టి మీ ఇంట్లో పని మనిషి కాదు. మీ మౌఖిక ఆదేశాలను పాటించే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. మీ గృహోపకరణాలన్నింటితో అనుసంధానించి ఉన్న ఓ వాయిస్ డివైస్.

ఇదంతా కాల్పనిక నవలలోని సన్నివేశం కాదు. అతి త్వరలో మనింట్లో చోటు చేసుకునే సన్నివేశపు ముందస్తు చిత్రం.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఇలాంటి వాయిస్ డివైస్‌లను ఉపయోగిస్తున్నారు.

ఇక భారత్ విషయానికొస్తే, మీరు ఊహించినదాని కంటే ముందే మీ ఇంటికి ఈ సాంకేతిక పరికరం రావొచ్చు.

అమెరికా, ఇంగ్లండ్‌లలో ఇప్పటికే 'డిజిటల్ వాయిస్ అసిస్టెంట్స్' అమర్చిన గృహోపకరణ వస్తువుల వినియోగం వేగంగా పెరుగుతోంది.

'ఎకో అండ్ డాట్' పేరుతో అమెజాన్ తొలిసారిగా 'డిజిటల్ వాయిస్ అసిస్టెంట్స్' స్పీకర్లను ఆవిష్కరించింది. 'అలెక్సా' అనే వాయిస్ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగిస్తూ ఇవి పని చేస్తాయి.

ఈ రోజు వాతావరణం ఎలా ఉంది అని మీరు అలెక్సాను అడిగితే.. అది తప్పకుండా సమాధానం చెబుతుంది. అంతేకాదు సమోసా ఎలా తయారు చేయాలి అని అడిగితే కావాల్సిన సమాచారం అంతా వివరంగా వినిపిస్తుంది.

ఈ రోజు ముఖ్యమైన వార్తలు అడిగినా చెబుతుంది.

గతేడాది అమెజాన్ తన స్పీకర్లను భారత్ మార్కెట్‌లో ప్రవేశపెట్టగా ఈరోజు (మంగళవారం) గూగుల్ తన డివైస్ "గూగుల్ హోమ్‌"ను తీసుకొచ్చింది.

అమెరికా, బ్రెజిల్‌ తదితర దేశాల వారికంటే భారతీయులే ఇలాంటి డిజిటల్ వాయిస్ అసిస్టెంట్స్‌ను ఉపయోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఇటీవల అసెంచర్ చేసిన సర్వేలో తేలింది.

వాయిస్ టెక్నాలజీ ఉపయోగం ఎలా పెరుగుతోందంటే..

  • ఈ ఏడాది చివరి నాటికి భారత్, చైనా, అమెరికాలోని మూడో వంతు నెటిజన్లు వాయిస్ యాక్టివేటెడ్ సాంకేతికతను వాడతారని అంచనా.
  • ఈ ఏడాది వాయిస్ డివైస్‌లను కొనుగోలు చేస్తామని 39 శాతం మంది భారత నెటిజన్లు చెప్పారు.
  • 2017లో ఒక్క అమెరికాలోనే 4.5 కోట్ల వాయిస్ డివైస్‌లు అమ్ముడుపోయాయి.
Image copyright seewhatmitchsee

ఇవి ఎలా పని చేస్తాయి?

అమెజాన్, గూగుల్ తీసుకొచ్చిన ఈ డివైస్‌లు చూడటానికి స్పీకర్లుగా కనిపిస్తాయి.

మనింట్లో వాడే వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ పరికరం మాదిరిగానే ఉంటాయి.

దీన్ని అనుసంధానించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముందుగా మన గొంతు విని గుర్తుపట్టేందుకు ఈ పరికరంతో మాట్లాడాలి.

మొబైల్ యాప్స్‌తోనూ ఇవి వస్తున్నాయి. వీటిని అనుసంధానించేలా ఏర్పాట్లు ఉన్నాయి. అమెజాన్ ఇలాంటి మినీ యాప్స్‌కు 'స్కిల్స్' అనే పేరు పెట్టింది. గూగుల్ వీటిని 'యాక్షన్స్‌'గా పిలుస్తోంది.

వీటిని ఉపయోగించి మీకిష్టమైన టీవీ చానెల్‌ను, ఇతర వివరాలను సెట్టింగ్‌లో చేర్చుకోవచ్చు.

భారతీయ భాషలను అర్థం చేసుకుంటుందా?

అమెజాన్, గూగుల్‌లు భారత మార్కెట్‌లో తీసుకొచ్చిన ఈ ఉపకరణాలు ఎదుర్కొనే అతి పెద్ద సవాలు.. ఇక్కడి భాషలను అర్థం చేసుకోవడమే.

ఇవి కేవలం ఇంగ్లిష్‌లో ఇచ్చే ఆదేశాలను మాత్రమే అర్థం చేసుకోగలవు. అంతేకాదు, భారతీయ యాసలో మాట్లాడే ఇంగ్లిష్‌ను అర్థం చేసుకోవడం వీటికి సవాలే. దీన్ని కూడా ఇవి అధిగమించాల్సి ఉంటుంది.

అమెజాన్ గతేడాది అక్టోబర్‌లోనే భారత్‌లో తన డివైస్‌ను ఆవిష్కరించింది. ఆ తర్వాత ఇండియన్ ఇంగ్లిష్‌ను అర్థం చేసుకునేలా వాటి సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసింది.

గూగుల్‌ డివైస్ హిందీలోని ఆదేశాలను కూడా అర్థం చేసుకోగలదని అంటున్నారు. అయితే, అది ఎంత వరకు పని చేస్తుందనేది చూడాలి.

భారత్‌లో వీటికి ఎంత విస్తృతమైన మార్కెట్ ఉందో ఈ రెండు కంపెనీలకు బాగా తెలుసు. అందుకే మరిన్ని భారతీయ భాషలను అర్థం చేసుకునే విధంగా మరికొన్ని మార్పులతో ఈ డివైస్‌లను తీర్చిదిద్దేందుకు బాగా శ్రమిస్తున్నాయి.

భవిష్యత్తులో వినియోగం

ప్రస్తుతం స్మార్ట్ స్పీకర్ల వరకే ఈ సాంకేతికత పరిమితమైంది. భవిష్యత్తులో ఈ వాయిస్ ఇంటర్‌ఫేస్ మీ ఇంట్లోని టీవీ, రేడియో, సెక్యూరిటీ సిస్టం, కుక్కర్, ఫ్రిజ్ తదితర సాంకేతిక, డిజిటల్ పరికరాలతో అనుసంధానమయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే మన ఫోన్లు ఈ సాంకేతికతతో పనిచేస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్, ఐ-ఫోన్‌లో 'సిరి' ఇలాంటివే.

ఈ సాంకేతికత భారత్‌లోని పేదల పరిస్థితిని మార్చే విప్లవాత్మక మార్పు కావొచ్చు. అయితే డిజిటల్ నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇక్కడి నిరక్షరాస్యత పెద్ద అడ్డంకిగా మారుతోంది.

భారత్‌లోని గ్రామీణ వ్యవసాయదారులకు ఫోన్‌లో ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగించాలి? యాప్స్‌ను ఎలా వాడాలి అని తెలుసుకోవడానికంటే వాయిస్ యాక్టివేటెడ్ ఫోన్‌ను వాడటం చాలా సులభం కావొచ్చు.

ఎందుకంటే ఈ వాయిస్ యాక్టివేటెడ్ ఫోన్ వారి భాషను అర్థం చేసుకుంటుంది. అలాగే, ఫోన్‌లోని యాప్స్‌ను, ఇంటర్నెట్‌ను ఉపయోగించేలా వాళ్లకు సూచనలిస్తుంది.

Image copyright Daisy-Daisy

మన వివరాలు భద్రమేనా?

ఈ సాంకేతికతపై వినియోగదారులు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, కొన్ని దేశాల్లోని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరికరం మౌఖిక ఆదేశాలను అనుసరించి పని చేస్తుండటంతో సొంతింట్లో కూడా తమకు గోప్యత లేకుండా పోతుందేమోనని కొంతమంది భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ డివైస్‌ను తయారు చేసిన కంపెనీలు మన వ్యక్తిగత వివరాలను తెలుసుకుంటే? ప్రభుత్వం ఈ పరికరం ద్వారా మన వివరాలను సేకరిస్తే? ఇలాంటి భయాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి.

వ్యక్తిగత వివరాల గోప్యత అతి పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో తయారీదారుల నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సందేహాలకు సరైన సమాధానం రావడం లేదు.

(రచయిత త్రుషార్ బరోట్, బీబీసీ న్యూస్ భారతీయ భాషలకు డిజిటల్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. 2017లో హార్వర్డ్ యూనివర్సిటీలో నిర్వహించినడిజిటల్ వాయిస్ డివైజెస్ రీసెర్చ్ ప్రాజెక్టుకు సారథ్యం వహించారు.)

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)