ప్రెస్‌రివ్యూ: ‘పన్నులు మాకు.. పైసలు వాళ్లకా?’ దక్షిణాది రాష్ట్రాల ప్రశ్న

  • 10 ఏప్రిల్ 2018
Image copyright Getty Images

దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున పన్నులు వెళుతుంటే.. కేంద్రం నుంచి నిధులు మాత్రం అనేక ఉత్తర, మధ్య, పశ్చిమ భారత రాష్ట్రాలకు వెళుతున్నాయని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఒక అంచనా ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ సగటున చెల్లిస్తున్న ప్రతి రూపాయికీ తిరిగి పొందుతున్నది కేవలం 67 పైసలు మాత్రమే.

ఉత్తరప్రదేశ్‌ అయితే రూపాయికి తిరిగి రూ.1.79 పైసలు దక్కించుకుంటోంది.

నిధుల పంపకంపై కేంద్రం తీసుకుంటున్ననిర్ణయాలపై దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాలూ ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నాయి.

ఈ వివక్షను ప్రశ్నించేందుకే దక్షిణాది రాష్ట్రాల ఆర్ధికమంత్రులు నేడు తిరువనంతపురంలో భేటీ కాబోతున్నారు.

ఈ సమావేశానికి ఏపీ నుంచి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు హాజరవుతున్నారు. తెలంగాణ, తమిళనాడు నుంచి ఎవరూ హాజరుకావడం లేదు.

తాజాగా 2020-2025 సంవత్సరాలకు సంబంధించి సిఫారసులు చేయడానికి 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటామని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది.

2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటే సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలు కేంద్ర పన్నుల ఆదాయంలో 70శాతం వరకూ నష్టపోయే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాలు వాదిస్తున్నాయి.

Image copyright finance commission / facebook

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు కూడా 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలపై మండిపడ్డారు.

''మనం కేంద్రానికి ఇస్తున్న దాంట్లో సగం కూడా తిరిగి మనకి రావడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి మనం కష్టపడాల్సి వస్తోంది. ఇదేం సమాఖ్య?'' అని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక కేంద్రం మౌనం దాల్చింది.

దక్షిణాది రాష్ట్రాలు దేశ పన్నుల ఆదాయంలో 30శాతం వాటా అందిస్తుంటే.. కేంద్రం నుంచి కేవలం 18శాతం మాత్రమే నిధులు తిరిగి వెనక్కి వస్తున్నాయి.

15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటే, ఉత్తరాది, దక్షిణాది మధ్య సామాజిక, ఆర్థిక అంతరం భారీగా పెరిగిపోతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధుల కేటాయింపును కేంద్రం సమర్థించుకుంటోంది.

సొంత ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రాలు కేంద్రం ఇచ్చే నిధులపై ఎక్కువ ఆధారపడతాయని చెబుతోంది.

సులభ వాయిదాల్లో గ్యాస్‌!

నిరుపేదలకు వాయిదాల పద్ధతిలో వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైందని ఈనాడు పేర్కొంది.

లబ్ధిదారుల నుంచి ముందస్తుగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కనెక్షన్లు ఇవ్వనుంది.

ఆ సొమ్మును వాయిదాల పద్ధతిలో లబ్ధిదారుల నుంచి వసూలు చేసేలా పథకాన్ని రూపొందించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అంబేడ్కర్‌ జయంతి రోజున పంపిణీ ప్రారంభించాలని చమురు సంస్థలను కేంద్రం ఆదేశించింది.

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేదలకు వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం గతంలోనే నిర్ణయించింది.

ఈ ప్రక్రియలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేయవద్దని కేంద్రం స్పష్టం చేసినట్లు డీలర్లు చెబుతున్నారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా కేంద్రమే డీలర్ల ద్వారా లబ్ధిదారుల గుర్తింపు, పంపిణీకి లక్ష్యాలను నిర్దేశించటం చర్చనీయాంశంగా మారింది.

కనెక్షన్‌ డిపాజిట్‌ సొమ్మును కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తోంది. లబ్ధిదారులు పైసా చెల్లించాల్సిన అవసరం లేదు.

పొయ్యికి రూ.900, గ్యాస్‌కు రూ.700 లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా.. ఆ మొత్తాన్నీ వాయిదాల రూపంలో వసూలు చేయాలని నిర్ణయించింది.

కనెక్షన్‌ తీసుకున్న ఏడో నెల నుంచి సిలిండరు తీసుకోగానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేసే సబ్సిడీ సొమ్మును వాయిదా మొత్తంగా కేంద్రం రాబట్టుకోనుంది.

కనెక్షన్‌ ఇచ్చినట్లు నిర్ధారించుకున్న మీదట ఆ మొత్తాన్ని డీలర్ల ఖాతాల్లో సర్దుబాటు చేయనుంది.

అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు బాధ్యతనూ డీలర్లకే కేంద్రం అప్పగించింది. రేషన్‌ దుకాణాలు లేదా ఈ-సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వివరాలను సేకరించి క్షేత్రస్థాయిలో నిర్ధారించుకున్న తరవాత లబ్ధిదారులను ఎంపిక చేయాలి.

Image copyright Telangana cmo / facebook

పదవీ విరమణ వయసు 60కి పెంచండి!

తెలంగాణలో పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వోద్యోగులు కోరినట్లు సాక్షి కథనం రాసింది.

ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో దీన్ని 62 ఏళ్లకు పెంచారు.

తాజాగా తెలంగాణలోనూ రిటైర్‌మెంట్‌ వయసును పెంచాలని ప్రభుత్వోద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని వారు గుర్తు చేస్తున్నారు.

ఉద్యోగుల విభజన జరిగి ఏడాది గడిచిన తర్వాత కూడా పదవీ విరమణ వయసు పెంపు దిశగా దృష్టి సారించకపోవడంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.

విద్యార్థులు Image copyright Getty Images

విటమిన్ డీ కోసం స్కూల్‌ ప్రార్థన సమయం మార్పు!

పిల్లల్లో విటమిన్ డీ లోపం నివారించేందుకు స్కూల్ ప్రార్థన వేళల్లో మార్పులు చేయనున్నట్లు ఆంధ్రజ్యోతి కథనం రాసింది.

విటమిన్‌ డీ లోపంతో స్కూల్ పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.

దేశంలో 90 శాతం మంది విద్యార్థులు విటమిన్‌ డీ లోపంతో బాధపడుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది.

దీన్ని నివారించేందుకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

పాఠశాలల ప్రార్థనా వేళల్లో (అసెంబ్లీ) మార్పులు చేస్తూ 'ప్రాజెక్టు ధూప్‌'ను ప్రారంభించింది.

ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో ప్రార్థనా వేళలు నిర్వహించాలని, అది కూడా మంచి గాలి, వెలుతురు లభించే ప్రాంతాల్లో చేపట్టాలని పాఠశాలలకు సూచించింది.

ఈ సమయంలో సరైన సూర్యరశ్మి సోకి విద్యార్థుల శరీరంలో విటమిన్‌ డీ దానంతట అదే ఉత్పత్తి అవుతుందని పేర్కొంది.

ఇలా చేయడం వల్ల పిల్లల్లో చురుకుదనం పెరుగుతుందని, ఆకలి మందగించడం, చేతులు-కాళ్ల నొప్పులు వంటి సమస్యలు పరిష్కారమవుతాయని చెబుతోంది.

ఈ నెల 7 నుంచి ఢిల్లీలోని పలు పాఠశాలల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)