నా బాధనెవరూ పట్టించుకోవట్లేదు.. నాకున్న మార్గం ఇదే: శ్రీరెడ్డి

  • 10 ఏప్రిల్ 2018
శ్రీ రెడ్డి Image copyright Facebook/Sri Reddy
చిత్రం శీర్షిక శ్రీ రెడ్డి

''నా పోరాటంలో నేను నిస్సహాయురాలిని అయిపోయాను. నా బాధను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, అందుకే ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.. బహిరంగంగా అర్ధనగ్నంగా నిరసన తెలపాల్సి వచ్చింది'' అని సినీ నటి శ్రీ రెడ్డి మల్లిడి చెప్పారు.

తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక దోపిడీపై హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఎంఏఏ)' ఎదుట శ్రీ రెడ్డి కొద్ది రోజుల కిందట ఈ నిరసన చేపట్టారు. తన గళం వినిపించేందుకు, తన డిమాండ్లపై ప్రభుత్వాన్ని స్పందించేలా చేసేందుకు తనకున్న మార్గం ఇదొక్కటేనని ఆమె తెలిపారు.

''సినీ పరిశ్రమలోని కొందరు నేను నగ్నంగా ఉన్న వీడియోలు, ఫొటోలు పంపించాలని అడుగుతున్నారు. నా బాధను, నిరసనను తెలిపేందుకు నేను అర్ధనగ్న ప్రదర్శన ఎందుకు చేయకూడదు'' అని శ్రీ రెడ్డి ప్రశ్నించారు.

Image copyright Facebook/Sri Reddy
చిత్రం శీర్షిక శ్రీ రెడ్డి

శ్రీ రెడ్డి లోగడ ఒక ప్రాంతీయ టీవీ ఛానల్‌లో ప్రజెంటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఐదేళ్ల క్రితం ఆమె చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు.

లైంగిక దోపిడీ ఆరోపణలపై ఆమె ఇప్పటి వరకు ఆధారాలను చూపలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా ఆమె అనుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో, ప్రచారం కోసమే ఆమె ఇదంతా చేస్తున్నారా, లేక ఇంత తీవ్ర స్థాయి నిరసనకు దిగేలా ఆమెను మీడియా సంస్థలు ప్రేరేపిస్తున్నాయా అనే అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిని శ్రీ రెడ్డి తోసిపుచ్చారు.

కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ బోర్డు (సీబీఎఫ్‌సీ) సమాచారం ప్రకారం భారత్‌లో హిందీ, తమిళ చిత్రపరిశ్రమల తర్వాత తెలుగు చిత్రపరిశ్రమే అతిపెద్దది.

సినిమాల్లో అవకాశాలు కావాలంటే తమ లైంగిక కోరికలు తీర్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరిని మినహాయిస్తే ఎవరూ దీనిపై బహిరంగంగా మాట్లాడటం లేదు.

Image copyright Facebook/Madhavi Latha
చిత్రం శీర్షిక మాధవీ లత

సినీ నటి మాధవీలత నిరుడు బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు. ''నీకు సినిమాలో అవకాశం ఇస్తే, ప్రతిఫలంగా నాకేం వస్తుంది'' అని అడుగుతారని, లైంగిక వేధింపులు ఈ ప్రశ్నతో మొదలవుతాయని ఆమె వెల్లడించారు.

సినీ గేయ రచయిత్రి శ్రేష్ఠ గత ఏడాది బీబీసీతో మాట్లాడుతూ కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో సినీరంగంలోని మగవారి సంబంధీకులైన మహిళల నుంచి కూడా సమస్యలు ఎదురవుతుంటాయని ఆమె చెప్పారు.

''నా భర్త కోరిక తీర్చు'' అని ఒక నిర్మాత భార్య తనను అడిగారని శ్రేష్ఠ తెలిపారు.

Image copyright Sreshta
చిత్రం శీర్షిక శ్రేష్ఠ

పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు?: శివాజీ రాజా

ప్రస్తుతం శ్రీ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'నిషేధం' విధించింది. 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా బీబీసీతో మాట్లాడుతూ- శ్రీ రెడ్డి వ్యవహారశైలి కారణంగా ఆమెపై తాము నిషేధం విధించామని చెప్పారు.

లైంగిక వేధింపులపై శ్రీ రెడ్డి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆమె ఆధారాలు లేకుండా ప్రచారం కోసం మాట్లాడుతున్నారని ఆరోపించారు.

తన నిరసనను వ్యక్తంచేయడానికి శ్రీ రెడ్డి ఎంచుకున్న మార్గం సరైనది కాదని నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అభిప్రాయపడ్డారు. ఆమె నిరసన వ్యక్తం చేసిన తీరు భారత మహిళలందరి గౌరవానికి భంగం కలిగించిందన్నారు.

'మా'లో తనకు సభ్యత్వం కల్పించాలని శ్రీ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఫిల్మ్ స్టూడియోలపై ప్రభుత్వం దాడులు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఫిల్మ్ స్టూడియోల్లో చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని, తనపై స్టూడియో ప్రాంగణంలోనే అత్యాచారం జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు.

Image copyright Facebook/Sivaji Raja
చిత్రం శీర్షిక 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా

నిరసనపై మిశ్రమ స్పందన

శ్రీ రెడ్డి నిరసన పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చిత్ర పరిశ్రమలో లైంగిక దోపిడీ ఉందన్నది అందరికీ తెలిసిన నిజమని మహిళల హక్కుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ 'మహిళా చేతన' కార్యదర్శి కత్తి పద్మ పేర్కొన్నారు. అయితే నిరసన వ్యక్తంచేయడానికి శ్రీ రెడ్డి ఎంచుకున్న మార్గం సరికాదని, అందువల్ల ఆమెకు తాము సంఘీభావం తెలపాలనుకోవడం లేదని ఆమె చెప్పారు.

అయితే కొందరు సామాజిక కార్యకర్తల నుంచి శ్రీ రెడ్డికి మద్దతు లభిస్తోంది.

శ్రీ రెడ్డి ధైర్యంగా స్పందించారు: వైజయంతి వసంత మోగ్లి

సినీ పరిశ్రమలో లైంగిక దోపిడీ గురించి ముందెన్నడూ లేని విధంగా ధైర్యంగా, నిజాయతీగా స్పందించి శ్రీ రెడ్డి చరిత్ర సృష్టించారని ప్రముఖ ట్రాన్స్‌జెండర్ కార్యకర్త వైజయంతి వసంత మోగ్లి 'ఫేస్‌బుక్‌'లో రాశారు.

హాలీవుడ్‌లో #MeToo ఉద్యమం నేపథ్యంలో, లైంగిక వేధింపులు, లైంగిక హింసకు వ్యతిరేకంగా భారత చిత్ర పరిశ్రమ కూడా దృఢమైన వైఖరిని అనుసరిస్తుందనే ఆశతో చాలా మంది ఉన్నారని వ్యాఖ్యానించారు.

నిరుడు హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్దయెత్తున వచ్చాయి.

లైంగిక వేధింపులు అంతటా ఉన్నాయని చేతులు దులిపేసుకోవడం తగదని, అలా చేయడమంటే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నివారించడమనే బాధ్యత నుంచి, ఆ బాధ్యతపై చర్చ నుంచి తప్పించుకోవడమే అవుతుందని వైజయంతి వసంత మోగ్లి చెప్పారు.

శ్రీ రెడ్డి తీవ్రస్థాయి నిరసనతో తెలుగు చిత్రపరిశ్రమలో లైంగిక దోపిడీ విస్తృత స్థాయిలో చర్చనీయాంశం అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)