'సురభి': పీహెచ్‌డీలు చేసినా నాటకాలతో వారి బంధం వీడలేదు!

  • రిపోర్ట్: ఖాజా పాషా/కెమెరా: లక్ష్మీకాంత్
  • బీబీసీ కోసం
సురభి కళాకారులు

ఫొటో సోర్స్, BBC/KAJAPASHA

ఫొటో క్యాప్షన్,

సురభి జయచంద్ర

సురభి నాటకాల గురించి తెలుగువారికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 133 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నాటక సమాజం అందరికీ సుపరిచితమే.

ఎనిమిది తరాలుగా ఈ నాటకాలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. మరి ఈ సురభి నాటక కుటుంబంలో యువత మనోగతం ఏమిటి?

నాటకాల గురించి వారు ఏమనుకుంటున్నారు? తమ పూర్వీకులు అందించిన ఈ కళను కాపాడుకునేందుకు ఏం చేస్తున్నారు?

ఈ విషయాలు తెలుసుకునేందుకు బీబీసీ ‘సురభి’ యువతరంతో మాట్లాడింది.

వీడియో క్యాప్షన్,

వీడియో: సుదీర్ఘ చరిత్ర ఉన్న సురభి నాటకం

పీహెచ్‌డీ చేశాం..

ఒకప్పుడు అంతగా చదువుసంధ్యలు లేనివారే సురభి నాటకాల్లో ఉన్నత శ్రేణి కళాకారులుగా వెలుగొందారు. కానీ నేడు డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు పూర్తి చేసిన కొత్త తరం యువతీ యువకులు సురభి నాటకాల్లో వేషాలు వేస్తున్నారు.

తమ వారసత్వ కుటుంబ కళను, సంస్కృతిని కాపాడుకోవడంలోనే తమకు సంతృప్తి ఉందని చెబుతున్నారు.

కొందరు బయట ఉద్యోగాలు చేస్తూనే, సాయంత్రం వేళల్లో మొఖాలకు మేకప్ వేసుకుని నాటక ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు.

అలాంటి వారిలో ఒకరే సురభి సిందె రమేశ్. ఆయన థియేటర్ ఆర్ట్ (సాంకేతిక అంశాలు)లో పీహెచ్‌డీ చేశారు.

అట్లాగే ఆయన ఆల్‌ ఇండియా రేడియోలో (ఫ్రీలాన్సర్) వ్యాఖ్యాతగానూ పనిచేస్తున్నారు.

మరో టీవీ ఛానెల్‌‌లోనూ పనిచేస్తూనే సాయంత్రం ఈ నాటకాల్లో పాల్గొంటారు. సాంకేతిక ఏర్పాట్లను చూస్తారు.

ఫొటో సోర్స్, BBC/KAJAPASHA

ఫొటో క్యాప్షన్,

పదోతరగతి చదువుతున్న లోచన సురభి నాటకాల్లోనూ పాల్గొంటారు.

ఇందులోనే సంతృప్తి!

"నేను ఎంబీఏ చదివాను. నాటకాలు వేస్తున్నాను. మా సురభి నాటకాలను బతికించాలన్న ఆలోచనతో ఈ వృత్తిలోనే కొనసాగుతున్నా. ఆర్థికంగా ఇబ్బందులుంటాయి. కానీ, ఇందులోనే సంతృప్తి ఉంది. అమ్మా, నాన్న, తాత ఇలా కుటుంబంలోని అందరూ కలిసి నాటకాలు వేస్తాం" అని సురభి జయచంద్ర చెప్పారు.

జేఎల్. నరసింహారావు పురస్కారం (బెస్ట్ యంగ్ థియేటర్ పర్సన్ ఆఫ్ ది ఇయర్) కూడా జయచంద్ర అందుకున్నారు.

ఆర్. స్వప్న సుభద్ర, థియేటర్ ఆర్ట్‌ విభాగంలో ఎంఫిల్ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు. ఈమె కూడా నాటకాల్లో వేషాలు వేస్తారు.

ఆర్. నిరుపమ సునేత్రి ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. పీహెచ్‌డీ చేస్తున్నారు. ఈమె కూడా నాటకాలు వేస్తారు.

నంది నాటకోత్సవంలో బెస్ట్ కాస్ట్యూమ్స్ అవార్డు అందుకున్నారు. లైటింగ్ స్పెషలిస్టుగా కూడా పనిచేస్తున్నారు.

సురభి ఆవేటి నాగేశ్వర రావు కూడా థియేటర్ ఆర్ట్‌లో ఎంఫిల్ చేస్తున్నారు. దూరదర్శన్‌లో మేకప్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు.

ఆర్. లోచన పదో తరగతి చదువుతున్నారు. ఈమె కూడా అనేక పాత్రలు పోషించారు.

"శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి(సురభి)లో చిన్నప్పటి నుంచే నాటకాలలో పాత్రలు చేస్తున్నాను. కృష్ణుడు, ప్రహల్లాదుడు, బాలవర్ధి, ఇలా అనేక వేషాలు వేశాను" అని లోచన చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/KAJAPASHA

ఫొటో క్యాప్షన్,

అరకొర ఆదాయంతో ఇబ్బందులు పడుతున్నామని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.

నా బిడ్డ ఏమైనా అడిగితే కొనిచ్చే పరిస్థితి లేదు

అయితే రోజూ విద్యుత్ దీపాల వెలుగులో ప్రదర్శనలు చేసే ఈ కళాకారుల జీవితాల్లో అంతా వెలుగే లేదు. అనేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం సురభి కళాకారులకు ఆర్థిక సాయం చేస్తోంది. కానీ ఆ సాయం తమకు ఏమాత్రం సరిపోవడంలేదని, అరకొర ఆదాయంతో ఇబ్బందులు పడుతున్నామని కళాకారిణి శ్యామల అన్నారు.

"నేను 26 ఏళ్లుగా ఈ నాటకాల్లో వేషాలు వేస్తున్నాను. పాతాళ భైరవి నాటకంలో నేను అమ్మవారి వేషం వేశాను. అందులో నేను ప్రత్యక్షమై నరుడా.. నీకేం కావాలో కోరుకో అంటాను. అతను కోరినవన్నీ ఇచ్చేస్తాను. కానీ, తెల్లారి లేచిన తర్వాత నా బిడ్డ ఏదైనా అడిగితే మాత్రం కొనిచ్చే స్థోమత నాకు లేదు" అంటూ శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.

సురభి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లి వద్ద ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అక్కడ కొందరు ఇళ్లు కట్టుకున్నారు.

వారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి (సురభి)లో రోజూ నాటకాలు వేస్తుంటారు.

దాంతో రోజూ లింగంపల్లికి వెళ్లిరాలేక కొందరు పబ్లిక్ గార్డెన్స్‌లోనే తాత్కాలిక షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు.

ఫొటో సోర్స్, BBC/KAJAPASHA

అమ్మాయి నటనా కౌశలమే కట్నం

"గతంలో సురభి కుటుంబంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆమె ఏ వేషానికి పనికొస్తారు? అన్న కోణంలోనే అబ్బాయి తరఫువాళ్లు ఆలోచించేవారు. కట్నాలు.. కానుకలు ఉండేవి కావు. అమ్మాయి నటనా కౌశలాన్నే కట్నంగా భావించేవారు.

సురభి కుటుంబంలో నాలుగు ఇంటిపేర్లు ఉంటాయి. అవేటి, ఏకందార్, సిందె అనే ఇంటిపేరు ఉన్నవాళ్లు అన్నాతమ్ముళ్లు. వారి కూతుళ్లను వనారస వాళ్లకు ఇచ్చి పెళ్లి చేయాలి. వనారస వాళ్లు అవేటి, ఏకందార్, సిందెలకు ఇవ్వొచ్చు. గతంలో కులాంతర వివాహాలు ఉండేవి కాదు. ప్రస్తుతం ఆ సమస్య లేదు. నాది కూడా కులాంతర వివాహమే" అని సురభి రమేష్ తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

133 ఏళ్ల క్రితం తోలుబొమ్మలాటను నాటకంగా మలిచి ప్రదర్శించారు. దానికే సురభి నాటకంగా పేరొచ్చింది.

కడప జిల్లాలో..

సురభి కుటుంబం చరిత్ర చెప్పాలంటే.. 1880కి వెళ్లాల్సిందే.

ఆ సమయంలో బ్రిటిష్ వారి వద్ద సైనికులుగా కొందరు, తోలుబొమ్మలాటలు, గారడీ విద్యలతో మరికొందరు జీవనం కొనసాగించేవారు.

ఆ తోలుబొమ్మలాటలు ఆడేవారే తర్వాతి కాలంలో నాటక ప్రదర్శనల వైపు మళ్లి సురభి వారిగా గుర్తింపు పొందారని 'తెలుగు నాటక వికాసం' పేరుతో పీఎస్‌ఆర్ అప్పారావు రాసిన పుస్తకంలో వివరించారు.

1885లో కడప జిల్లాలోని సురభి అనే మారుమూల గ్రామంలో ఆ ఊరి పెద్దలైన చెన్నారెడ్డి, రామిరెడ్డిల ఇంట్లో పెళ్లి సందర్భంగా "కీచక వధ" అనే నాటకంతో సురభి నాటక ప్రస్థానం ప్రారంభమైందని సురభి నాగేశ్వరరావు తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/KAJAPASHA

కాగడాలు, దీపాల వెలుగుల్లో నాటకాలను ప్రదర్శిస్తున్న ఆ రోజుల్లో సురభి వారు తమ మొదటి ప్రదర్శనలో కిరోసిన్ లైట్లను వినియోగించారు.

పెళ్లి వారింటి చీరలు, సెట్టింగ్ కోసం దుప్పట్లను, ఆకట్టుకునే దుస్తులను, నగలను ఉపయోగించి నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరణ పొందారు.

ఆనాడు వాళ్లు నాటక ప్రదర్శనలో చూపించిన సాంకేతికతే సురభి సమాజం ఇన్నేళ్లు కొనసాగడానికి, సురభి ఖ్యాతి వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు.

ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథలు చెబుతూ, పాటలు పాడుతూ అందుకు తగ్గట్టుగా తోలు బొమ్మలను ఆడిస్తూ ఉండే వారి నైపుణ్యమే తరువాతి కాలంలో నాటక ప్రదర్శనలకు ఉపయోగపడింది.

ఫొటో సోర్స్, BBC/KAJAPASHA

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఐదు సురభి సమాజాలు (బృందాలు) నాటకాలు ప్రదర్శిస్తున్నాయని సురభి నాగేశ్వరరావు(బాబ్జీ) తెలిపారు.

నాగేశ్వరరావును కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి (సురభి)లో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

"కాలానుగుణంగా నాటక ప్రదర్శన కోసం లైటింగ్, ఎఫెక్ట్స్ వంటి సాంకేతిక అంశాల్లో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. మా కళాకారులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ, నాటకాలంటే వారికి ప్రాణం. ఇన్నేళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ కళను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది" అని రమేష్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)